రెండు తెరల కంప్యూటర్! ఒక్కటే కంప్యూటర్... కానీ, రెండు తెరలు! ఒక తెరపై సినిమా చూడొచ్చు! మరో తెరపై ఈ-పుస్తకం చదువుకోవచ్చు! అదెలా సాధ్యం?
ఎక్కడికైనా తీసుకెళ్లే ల్యాప్‌లాప్ తెలుసు. చేతిలో ఒదిగిపోయే నోట్‌బుక్ చూశాం. పుస్తకంలా మారిపోయిన ఈ-రీడర్లు వాడుతున్నాం. మరి, రెండు తెరల ఆల్ట్రా మొబైల్ పీసీ తెలుసా? చిత్రంలో కనిపిస్తున్నది అదే. పేరు libretto W100 ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ కంపెనీ తోషిబా దీన్ని తయారు చేసింది. రెండు తెరలతో పుస్తకం మాదిరిగా మడుచుకునేలా రూపొందించారు. చేతిలో ఒదిగిపోయే ఈ తాకేతెర మొబైల్ పీసీ ఎలా పని చేస్తుందో వివరంగా తెలుసుకుందాం!
ఏంటి ప్రత్యేకత?
ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో బహుముఖ ప్రజ్ఞాశాలి. పుస్తకంలా కనిపిస్తూ ఈ-రీడర్‌గా మార్కులు కొట్టేసినప్పటికీ దీంట్లో సినిమాలు చూడొచ్చు, మ్యూజిక్ వినొచ్చు, ఫొటోలను భద్రం చేసుకోవచ్చు. బ్రౌజింగ్ కూడా చాలా సులభం. అడ్డంగానూ, నిలువుగానూ వాడగలడం మరో ప్రత్యేకత. ఉదాహరణకి ఒకవైపు తెరపై ఫేస్‌బుక్ ఓపెన్ చేసుకుని, మరోవైపు తెరపై మెయిల్స్‌ని చెక్ చేసుకోవచ్చు. అంతా ఓకేగానీ దీంట్లో టైపింగ్ ఎలా అంటారా? తాకేతెరపై వర్చువల్ కీబోర్డ్ ఉంది. ట్రాక్ ప్యాడ్‌లా కూడా వాడుకోవచ్చు. విండోస్ 7హోం ప్రీమియం ఓఎస్‌ను ఇన్‌స్టాల్ చేశారు. అన్ని మల్టీమీడియా అప్లికేషన్స్‌ను సులభంగా సపోర్ట్ చేస్తుంది. ఇన్‌బిల్డ్ వెబ్ కెమేరాతో ఛాటింగ్ చేసుకోవచ్చు. బ్రౌజింగ్ చేసేప్పుడు రెండు తెరల్లోనూ ఒకే పేజీ కనిపించేలా కూడా చేయవచ్చు. 1.2 GHz Intel U5400 ప్రాసెసర్, 2 జీబీ డీడీఆర్3 ర్యామ్, 62 జీబీ స్లేట్ హార్డ్ డ్రైవ్, 1024 x 600 స్క్రీన్ రిజల్యుషన్‌తో 7 అంగుళాల తాకేతెర, నెంబర్ ప్యాడ్‌తో కూడిన వర్చువల్ కీబోర్డ్, ఫేస్ రికగ్నెషన్ టెక్నాలజీతో కూడిన వెబ్ కెమేరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, యూఎస్‌బీ 2.0 పోర్ట్, వై-ఫై, బ్లూ టూత్... సదుపాయాలు ఉన్నాయి. ధర సుమారు రూ.79,990. మొబైల్ పీసీతో పాటు అవసరాన్ని బట్టి Toshiba 45W Slimline Global AC Adapter, USB 2.0 DVD SuperMulti Drive, 500 GB 2.0 External Hard Driveలను కూడా తీసుకోవచ్చు. ఇతర వివరాలకు http://laptops.toshiba.com/laptops/libretto/w100