Saturday, September 18, 2010

విద్యార్థులకు ఆరోగ్య కార్డు

విద్యార్థులకు వైద్య సంరక్షణ  ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డు  నవంబరు నుంచి పాఠశాల ఆరోగ్య పథకం
రాష్ట్రంలో పాఠశాల ఆరోగ్య పథకాన్ని పునురుద్ధరించడానికి అవసరమైన అన్ని చర్యలు దాదాపుగా పూర్తయ్యాయి. మొదటిదశలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక, ఉన్నత, ఆశ్రమ, గురుకుల పాఠశాలలు అన్నింటిలోనూ నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా అమల్లోకి తీసుకురాబోతున్నారు. నిధులు దుర్వినియోగం అవుతున్నాయని నాలుగేళ్ల కిందట నిలిపివేసిన ఈ పథకాన్ని పటిష్ఠంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ పి.వి.రమేష్‌ 'న్యూస్‌టుడే'తో చెప్పారు. దీని కోసం ఈ ఏడాది జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం నుంచి రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. పాఠశాల ఆరోగ్య పథకం విధి విధానాలపై విద్యాశాఖ అధికారులకు పూర్తి వివరాలు అందచేసినట్లు చెప్పారు.

రాష్ట్రంలో ఏటా పదిశాతం పైన పిల్లలు అనారోగ్య కారణాలతో పాఠశాల స్థాయిలో బడి మానేస్తున్నారు. బడికి వెళుతున్న మొత్తం 85లక్షలు-90 లక్షల మంది పిల్లల్లో 10 శాతం మంది తీవ్ర అనారోగ్యానికి గురికావడం ఆందోళనకర పరిణామం. మిగిలిన వారిలోనూ చాలా మంది రక్తలేమితో పాటు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రాణాంతకమైన వ్యాధులకు గురికాకుండా ఐదేళ్ల వయసులో తీసుకోవాల్సిన టీకాలు దాదాపు 40% మంది వేయించుకోవడం లేదు. కేంద్ర వైద్యఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల ఆరోగ్య పథకం కింద పిల్లలందరికీ ధనుర్వాతం, కంఠసర్పిలాంటి వ్యాధుల నివారణకు బూస్టర్‌ డోసు టీకాలు వేయనున్నారు. ఈ పథకం కింద 1-10వ తరగతి పిల్లలకు ఇచ్చే ఆరోగ్యకార్డుల్లో ఆరోగ్య సమాచారంతో పాటు పాఠశాల బదిలీ ధ్రువపత్రాన్ని కూడా జత పరుస్తున్నారు. అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌, జర్మనీలాంటి అభివృద్ధి చెందిన దేశాల తరహాలో పాఠశాల్లో ఆరోగ్యకార్డులు ఇవ్వడం వల్ల వ్యాధులను మొదటి దశలోనే గుర్తించి నయం చేయడానికి అవకాశం ఉంటుందని డాక్టర్‌ పి.వి.రమేష్‌ చెప్పారు.

ఉపాధ్యాయులకు శిక్షణ: ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి అనుసరించాల్సిన విధానాలపై అధ్యాపకులకు శిక్షణ నిర్వహించనున్నారు. ప్రతి పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడిని ఎంపిక చేసి జిల్లా స్థాయిలో అక్టోబరులో శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం అమలు తీరును అధ్యయనం చేసిన తరవాత రెండో దశలో పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

పాఠశాల ఆరోగ్య పథకంలోని ముఖ్యాంశాలు
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే వైద్యుడు వారంలో రెండు రోజులు పాఠశాల ఆరోగ్య కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలి.
* ప్రతి నెలా ఒక నిర్దిష్టమైన రోజున పాఠశాలకు వెళ్లి పిల్లలను పరీక్షించి మందులు ఇవ్వాలి.
* నిర్ధారిత కాల పట్టిక ప్రకారం టీకాలు వేయాలి. విటమిన్‌-ఎ, నట్టల మందులు ఇవ్వాలి.

* అనారోగ్యకారక లక్షణాలు ఉన్న పిల్లలను గుర్తించి, వెంటనే వారికి తగిన చికిత్స కోసం ఉన్నతస్థాయి ఆస్పత్రులకు సిఫారసు చేయాలి.
* ఆరోగ్య సంరక్షణకు పాటించాల్సిన విధానాలు, ప్రథమ చికిత్స తదితర అంశాలపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు.

* ప్రతి వారం ఒక పీరియడ్‌ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై అవగాహన తరగతులు.
* మానసిక సంబంధమైన సమస్యలు ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌.