పిల్లలకు కథలు చెప్పాలని... మంచి మాటలను వినిపించాలని... మాతృభాష తియ్యదనాన్ని మేళవిస్తూ... విజ్ఞానాన్ని అందించాలని తపనపడే తల్లులెందరో! అటువంటి వారికి ఉపయోగపడేలా... చిన్నారుల భవితకు బాటలు పరిచేలా... అంతర్జాలంలో ఓ బాల ప్రపంచం ఏర్పడుతోంది. అభిరుచిగా బాలల సైట్లు తెరిచి... అదో తపనగా వాటిని నిర్వహిస్తున్న మహిళలతో వసుంధర ముచ్చటించింది.కాన్వెంటు చదువులు, ఆంగ్లపాఠాల జోరు అధికమైంది. తెలుగు భాషలోని గొప్ప కథలు, మాటల ముత్యాలు, పద విన్యాసాలు పిల్లలకు చేరే మార్గాలు తక్కువైపోయాయి. అదే ఎందుకలా అనుకొన్న కొందరు మహిళలు బాలల సాహిత్యాన్ని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే క్రమంలో డాట్‌కామ్‌లు తెరిచారు. బ్లాగులు ఆరంభించారు. పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా కొందరు రచనలు చేస్తే... మరికొందరు వారి భాగస్వామ్యానికి అవకాశం ఏర్పరిచారు.
హాయి 'జాబిలి'..
ఇప్పటి పిల్లలు పెద్ద గడుగ్గాయిలే! చెప్పే కథ ఏమాత్రం ఆసక్తిలేకపోయినా 'వద్దుపో..' అంటూ పరుగులు పెట్టేస్తారు. తిరుపతికి చెందిన రమ్యగీతిక నిర్వహిస్తున్న jabilli.in సైట్‌లోని కథలు ఆ పేరులానే చల్లని ఆహ్లాదాన్నిస్తున్నాయి. 'కథ నడుస్తున్న కొద్దీ 'అబ్బ..' అన్నంత ఆసక్తి చూపాలి. అవ్వ చెప్పిన కథలు, బేతాళకథలు ఈ కోవలోనివే. ఎంత రక్తి కట్టిస్తాయో.. పాత్రల ద్వారా ఎన్నో వ్యక్తిత్వాలు, విలువలు నేర్చుకునేలా వాటిని ఎంపిక చేస్తున్నా' అంటున్న రమ్య ఆకట్టుకునేందు కోసం యానిమేషన్ బొమ్మల్ని జంతువుల, నీతి కథలకి జోడించారు. అలానే 'సరదా ఆటలు' కదలనీయకుండా చేస్తాయి. 'అవును. ఇందులో ప్రయాణాల్లో ఆడే ఆట ఒకటి. బస్సు, జీపు, కారు, లారీ.. ఇలా ఒకొక్కరు ఒక్కోటి ఎంపిక చేసుకుని ఊరు చేరేదాకా దారిపొడవున ఎవరివి ఎక్కువ ఎదురైతే వారే గెలిచినట్లు.. లాంటి ఆటలు బోలెడున్నాయి' అని చెబుతుంది. ఇవేకాదు, మంచి మాటలు, ఇంట్లో చేసుకునే బొమ్మలు, తమాషా లెక్కలు... వంటివెన్నో దీన్లో ఉన్నాయి.
బాల వైభవం..
ఆటపాటల బాలసాహిత్యాన్ని పిల్లలకు చెప్పడమే కాదు, అలాంటివి వారి చేతనే రాయిస్తే మరింత ఉపయోగం అంటారు నెల్లూరుకు చెందిన రచయిత్రి చంద్రలత. ఆమె నడుపుతున్న బ్లాగు prabhavabooks.blogspot.comతో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. 'గుర్తించాల ేగానీ.. పిల్లల్లో చెప్పలేనంత సృజన ఉంది. ఎనిమిదేళ్లుగా వారికి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నా. వాటిల్లో పాల్గొన్న ప్రతి చిన్నారిలో మార్పు గమనించా. అవన్నీ నా బ్లాగులో పొందుపరిచా. అలా ఐదారొందల మంది చిన్నారి రచయితలు తయారయ్యారు. వారు రాసినవన్నీ కొత్త కథలు, పాటలే. బొమ్మలూ వారిచేతనే వేయిస్తున్నా' అని చెప్పే ఆమె పిల్లలకు పదాలు, వాక్యాలు ఇచ్చి రచనలు చేయిస్తారు. వారు రాసిన వాటిని నెట్‌లో ఉంచుతారు.
పదాల మాటామంతి..
అమెరికాలో ఉంటున్న తెలుగు మహిళ లలిత కూడా చిన్నారుల కోసం ఒకసైట్ నిర్వహిస్తున్నారు. అక్షరాలు, కఠిన పదాలు, పద్యాలు చక్కగా పలుకుతూ... పిల్లలకు వివరించడాన్ని www.telugu4kids.comలో తన గొంతుతోనే వినిపించే ప్రయత్నం చేశారు. 'పిల్లల్ని ఆకట్టుకోవడంలో ప్రత్యేకత ఉండాలని అలా చేశాను. వారికి సులువుగా అర్థమయ్యేలా కాకి, మొదటి బావి వంటి వీడియో కథల్ని రూపొందించాను. తెనాలి రామకృష్ణ, వేమనపద్యాలు, సామెతలు వంటి వాటిని నెట్‌లో ఉంచాను. అక్షరం మీద క్లిక్ చేస్తే పలికే విధానం నా సైట్‌లో ఉంది' అని చెప్పే లలిత కొన్ని సరదా మాటల్ని 'తార' అనే పాత్రతో చెప్పించారు. తెలుగులో మరిన్ని ఆసక్తిగొలిపే kottapalli.in, www.telugudanam.co.in, www.bookbox.comలాంటి లింక్‌లు పిల్లలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తాయనడంలో సందేహం లేదు.
ఏడాదిన్నర క్రితం 'జాబిలి' ఆరంభించిన నేను తిరుపతిలో ఓ రెస్టరంట్ నడుపుతున్నా. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ చేసిన నేను తల్లిదండ్రులకు, పిల్లలకు ఉపకరించేలా టపాలు రాస్తుంటా. అందులో నాకెంతో ఆనందం ఉంది. గతంలో కిండర్‌గార్టెన్ స్కూలు నడిపిన అనుభవంతో పిల్లలమనసుల్ని చదవగలిగా. వారిలో మార్పు తేవాలని నా ప్రయత్నం. ఇందులో నా భర్త, కుమారుడి ప్రోత్సాహం ఉంది. - రమ్యగీతిక |
పిల్లలు చెబితేనే అది కచ్చితమైన బాలసాహిత్యం. వాటిపై ఇప్పటిదాకా నాలుగైదు పుస్తకాలు రాశాను. ప్రస్తుతం మదనపల్లె రిషీవ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రిసోర్స్ పర్సన్‌గా ఉన్న నేను తెలుగు భాషలో పిల్లలకి కావాల్సిందేమిటో దగ్గరుండి చూశాను. అమ్మ, ఆకలి ఎంత ముఖ్యమో భాష కూడా అంతే ముఖ్యం. కానీ పుస్తకాల్లో ఆడుకుంటూ పాడుకుంటూ నేర్చుకునేలా తెలుగు లేదు. అదే రెండేళ్ల క్రితం నేను బ్లాగ్‌ను రూపొందించేందుకు స్ఫూర్తి. - చంద్రలత. |
హైదరాబాద్‌లోనే ఎంసీఏ చదువుకున్నా. మా వారి ఉద్యోగరీత్యా న్యూజెర్సీ వచ్చా. నా చదువంతా ఆంగ్లమాధ్యమంలోనే. పిల్లలకి చక్కటి తెలుగు నేర్పించలేకపోతున్నాననే బాధే 'తెలుగు4కిడ్స్'కి ప్రాణం పోసింది. నాకు కాలక్షేపంగా, పదిమందికీ ఉపయోగంగా ఉంటుందనే ఈ ప్రయత్నం. నేను ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నా. - లలిత |
ఏడాదిన్నర క్రితం 'జాబిలి' ఆరంభించిన నేను తిరుపతిలో ఓ రెస్టరంట్ నడుపుతున్నా. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ చేసిన నేను తల్లిదండ్రులకు, పిల్లలకు ఉపకరించేలా టపాలు రాస్తుంటా. అందులో నాకెంతో ఆనందం ఉంది. గతంలో కిండర్‌గార్టెన్ స్కూలు నడిపిన అనుభవంతో పిల్లలమనసుల్ని చదవగలిగా. వారిలో మార్పు తేవాలని నా ప్రయత్నం. ఇందులో నా భర్త, కుమారుడి ప్రోత్సాహం ఉంది.
పిల్లలు చెబితేనే అది కచ్చితమైన బాలసాహిత్యం. వాటిపై ఇప్పటిదాకా నాలుగైదు పుస్తకాలు రాశాను. ప్రస్తుతం మదనపల్లె రిషీవ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రిసోర్స్ పర్సన్‌గా ఉన్న నేను తెలుగు భాషలో పిల్లలకి కావాల్సిందేమిటో దగ్గరుండి చూశాను. అమ్మ, ఆకలి ఎంత ముఖ్యమో భాష కూడా అంతే ముఖ్యం. కానీ పుస్తకాల్లో ఆడుకుంటూ పాడుకుంటూ నేర్చుకునేలా తెలుగు లేదు. అదే రెండేళ్ల క్రితం నేను బ్లాగ్‌ను రూపొందించేందుకు స్ఫూర్తి.
హైదరాబాద్‌లోనే ఎంసీఏ చదువుకున్నా. మా వారి ఉద్యోగరీత్యా న్యూజెర్సీ వచ్చా. నా చదువంతా ఆంగ్లమాధ్యమంలోనే. పిల్లలకి చక్కటి తెలుగు నేర్పించలేకపోతున్నాననే బాధే 'తెలుగు4కిడ్స్'కి ప్రాణం పోసింది. నాకు కాలక్షేపంగా, పదిమందికీ ఉపయోగంగా ఉంటుందనే ఈ ప్రయత్నం. నేను ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నా.