నగరాల్లో అంతకంతకూ పెరిగిపోతున్న వాయు కాలుష్యానికి కళ్లెం వేసే చర్యలు మొదలయ్యాయి. పర్యావరణ అనుకూలమైన యూరో-3, యూరో-4 పెట్రోలు, డీజిల్ అందుబాటులోకి వచ్చేశాయని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఇటీవల తెలిపారు. దీనితో మన దేశంలో సురక్షితమైన ఇంధనం అందుబాటులోకి వచ్చి, మెల్ల మెల్లగా ప్రాణాలు హరించే హానికారక పెట్రోలు, డీజిల్ నుంచి జనానికి విముక్తి లభించనుంది.
యూరో-4 గ్రేడ్ పెట్రోలు, డీజిల్‌ను 2010 ఏప్రిల్ 1 నుంచి హైదరాబాద్ సహా దేశంలోని 13 పెద్ద నగరాల్లో అందుబాటులోకి తెచ్చారు. యూరో-3 గ్రేడ్ ఇంధనాన్ని దశలవారీగా దేశవ్యాప్తంగా అక్టోబర్ 1 నాటికి అమల్లోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యూరో-4 పెట్రోలు కోసం లీటర్‌కు రూ.0.50, డీజిల్ కోసం రూ.0.26, యూరో-3 పెట్రోలు కోసం రూ.0.26, డీజిల్ కోసం రూ.0.21 చొప్పున ధరలు పెంచారు.
అత్యున్నత స్థాయి ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు.. తమ చమురు శుద్ధి కర్మాగారాల్లో మార్పులు చేసుకున్నాయి. వీటికోసం రూ.32వేల కోట్లు ఖర్చుపెట్టాయి.
ఏమిటీ యూరో-3, 4యూరో-3, 4 ప్రమాణాలు వాహనాల నుంచి వచ్చే ఉద్గారాల స్థాయిని సూచిస్తాయి. ఐరోపా సంఘం (ఈయూ) సభ్య దేశాల కోసం వీటిని రూపొందించారు. ఈ ప్రమాణాల కింద ఇంధనాల్లో సల్ఫర్ పరిమాణాన్ని బాగా కుదించాల్సి ఉంటుంది. అందువల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. గాలి నాణ్యత పెరుగుతుంది. * యూరో-3 ఇంధనాల్లో సల్ఫర్ గరిష్ఠ స్థాయి 350 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉంటుంది. యూరో-4 ఇంధనాల్లో అది 50 పీపీఎంకు తగ్గుతుంది. ప్రస్తుతం భారత్‌లో వాడుతున్న పెట్రోల్, డీజిల్‌లో సల్ఫర్ పరిమాణం 550-350 పీపీఎం మేర ఉంటోంది.
అనారోగ్య సమస్యలు ఇంధనంలో ఉన్న సల్ఫర్ ఆక్సీకరణం చెందడం వల్ల సల్ఫర్ డైఆక్సైడ్‌లు విడుదలవుతాయి. పైగా ఇంధనంలో సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ఉద్గారాలు పెరుగుతాయి. గాలిలో సూక్ష్మ ద్రవ, ఘన పదార్థాల స్థాయి ఎక్కువవుతుంది. వీటివల్ల తీవ్ర శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి. అకాల మరణాలు పెరుగుతాయి. ఉబ్బసం రోగులకు ఈ కాలుష్య కారకాలు ప్రాణాంతకంగా మారతాయి. సూక్ష్మ పదార్థాల వల్ల భూతాపం పెరిగిపోతుంది. సల్ఫర్ ఆక్సైడ్‌ల వల్ల వాతావరణంలో ఆమ్లత్వం పెరుగుతుంది. దీనివల్ల భవనాలు, లోహాలు, పెయింట్లకు హాని జరుగుతుంది. ఆమ్ల వర్షాలూ పెరిగిపోతాయి. జల వనరుల్లోనూ ఆమ్లాలు పెరిగిపోతాయి. ఫలితంగా పంటలకూ నష్టం తీవ్ర వాటిల్లుతుంది.
ఎక్కడిదీ సల్ఫర్..? పెట్రోలు, డీజిల్ ముడి చమురు నుంచి ఉత్పత్తవుతాయి. ఈ ముడి చమురులోనే సల్ఫర్ ఉంటుంది. దీని పరిమాణం ఒక్కో చమురు క్షేత్రంలో ఒక్కోలా ఉంటుంది. సల్ఫర్ తక్కువగా ఉన్న ముడి చమురును 'స్వీట్ క్రూడ్' అంటారు. ఈ పదార్థం అధికంగా ఉంటే 'సోర్ క్రూడ్'గా పేర్కొంటారు. ఉత్తర సముద్రం, నైజీరియాల్లో ఉత్పత్తయ్యే చమురులో సల్ఫర్ తక్కువగా ఉంటోంది. మధ్య ప్రాచ్యంలో లభిస్తున్న చమురులో ఈ పదార్థం ఎక్కువగా ఉంటోంది. సరాసరిన ముడి చమురులో సల్ఫర్ 1 నుంచి 3 శాతం మేర పేరుకుపోతోంది.
వాహనానికి నేస్తం * వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో మోటారు వాహనాల ఉద్గారాలను తగ్గించడం చాలా కీలకం. ఇందులో సల్ఫర్ స్థాయిని తగ్గించడం చాలా ముఖ్యమైన చర్య. దీనివల్ల ఇతర ఉద్గారాలూ తగ్గుతాయి. 500 పీపీఎం కన్నా ఎక్కువగా సల్ఫర్ ఉంటే వాతావరణంలో సూక్ష్మ పదార్థాలు, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్‌లు పెరిగిపోతాయి. అత్యంత తక్కువ స్థాయిలో సల్ఫర్ (10 పీపీఎం కన్నా తక్కువ) ఉంటే ఈ ఉద్గారాలను 95శాతం మేర తగ్గించే పరిజ్ఞానాలను వాడడానికి వీలుకలుగుతుంది. * ఇంధన సామర్థ్యం పెరిగేలా, ఉద్గారాలు తక్కువగా ఉండేలా కార్ల తయారీదార్లు.. ఇంజిన్ డిజైన్‌లో మార్పులు చేస్తున్నారు. ఉదాహరణకు డీజిల్ ఇంజిన్‌లో 'హై ప్రెజర్ ఇంజెక్షన్ వ్యవస్థ' వల్ల వాహనం తక్కువ ఇంధనం వాడడంతోపాటు కాలుష్యకారకాల విడుదల కూడా తగ్గిపోతుంది. అయితే డీజిల్‌లో సల్ఫర్ స్థాయి ఎక్కువగా ఉంటే ఈ పరిజ్ఞానం సరిగా పనిచేయదు. * ఇంధనంలో సల్ఫర్ అధికంగా ఉంటే వాహనం నిర్వహణ ఖర్చులూ పెరుగుతాయి. ఈ పదార్థం వల్ల పిస్టన్ రింగ్, ఎగ్జాస్ట్ వ్యవస్థ వంటి భాగాలు వేగంగా తుప్పు పడతాయి. అందువల్ల తరచూ వీటిని మార్చాల్సి ఉంటుంది. * సల్ఫర్ స్థాయి 50 పీపీఎం కన్నా తక్కువ ఉంటే పర్యావరణ పరంగాను, వాహన సామర్థ్యం పరంగాను అనేక ప్రయోజనాలు ఉంటాయి.