Wednesday, September 29, 2010

ఓపెన్‌సోర్స్






























































ఓపెన్‌సోర్స్‌లో అందరికీ అన్నీ!
పిల్లలకు ఆటలు.. విద్యార్థులకేమో పాఠాలు.. డిజైనర్లకు సాఫ్ట్‌వేర్‌లు.. ఉద్యోగులకు ఉచిత ఆఫీస్‌లు.. పెద్దలకు వీడియోలు.. పీసీ రక్షణకు ప్రత్యేక చిట్కాలు.. అన్నీ ఒకే చోటే!
కొత్త పీసీ కొంటాం. ఎవరి ఆసక్తుల మేరకు ఇంట్లో పోటీ. ఆటల కోసం ఒకరు, ఉచిత సాఫ్ట్‌వేర్‌ల కోసం మరొకరు, సమాచారం కోసం ఇంకొకరు వెతుకులాట. మరయితే ఓపెన్‌ సోర్స్‌ కమ్యూనిటీ అందరి అవసరాలు తీర్చేలా సాఫ్ట్‌వేర్‌లు, వీడియో గేమ్స్‌, ఆఫీస్‌ అప్లికేషన్స్‌, సిస్టం సెక్యూరిటీ, మెదడుకు పదును పెట్టే ఆటలు... ఇలా అన్నీ ఒకేచోట అందిస్తోందని మీకు తెలుసా? అదే SchoolForge.net. ప్రధానంగా విద్యార్థులకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌లను రూపొందించడం దీని ప్రత్యేకత. ఉద్యోగుల ఆఫీస్‌ పనుల్ని మరింత సులభతరం చేసే అప్లికేషన్స్‌ అందుబాటులో ఉంచారు. సృజనాత్మకత కలిగి డిజైనింగ్‌ రంగాన్ని ఎంచుకునే విద్యార్థులకు మల్టీమీడియా అప్లికేషన్స్‌ పొందుపరిచారు. పీసీ సామర్థ్యాన్ని మరింత పెంచే యుటిలిటీ అప్లికేషన్స్‌ అందిస్తున్నారు.
ఆటల్లోనే చదువు! పిల్లల కోసం విజ్ఞానదాయకమైన ఆటల్ని రూపొందించారు. ఉదాహరణకి సెలిస్టియా ఆటని ఆడుతూనే విశ్వం గురించి తెలుసుకోవచ్చు. సౌర కుటుంబాన్ని చుట్టేసి రావచ్చు. నక్షత్రాలు, గ్రహాలు, ఉల్కలు, ఉపగ్రహాల్ని ఎక్స్‌ప్లోర్‌ చేయవచ్చు. రెండు నుంచి పదేళ్ల పిల్లల్ని ఆకట్టుకునేందుకు GCompris కలెక్షన్‌ను రూపొందించారు. దీంట్లో క్విజ్‌లు, రంగుల్ని గుర్తించే ఆటలు, చదరంగం, బీజగణితం, భూగర్భశాస్త్రం, అంకెల గారడీ లాంటివి బోలెడు. ఆకర్షణీయమైన కార్టూన్లతో ఆటల్ని రూపొందించారు. అక్షరాల రూపంలో చేపలు పై నుంచి పడుతుంటాయి. వాటిని టైప్‌ చేస్తుంటే కింది ఉన్న పెంగ్విన్‌ వాటిని చక్కగా ఆరగించేస్తుంది. టక్స్‌మ్యాథ్స్‌ ఆటలో లెక్కలు చేయవచ్చు. టక్స్‌పెయింట్‌తో బొమ్మలు గీయొచ్చు. ఎక్కాల్ని కంఠస్తం చేయడానికి మల్టిప్లికేషన్‌ స్టేషన్‌ గేమ్‌ని తయారు చేశారు. మొత్తం ఆటల్ని లినక్స్‌, విండోస్‌, మ్యాక్‌ వెర్షన్లలో అందుబాటులో ఉంచారు. వివరాలకు http://tinyurl.com/education222
* మరిన్ని ఆటల కోసం http:// osswin. source forge.net/games.html
సృజనాత్మకత ఉందా? ఆకట్టుకునేలా గ్రాఫిక్‌ని రూపొందించడం సృజనాత్మకతతో కూడిన కళ. ఇలాంటి గ్రాఫిక్స్‌ని 3డీలో క్రియేట్‌ చేయాలంటే వేల రూపాయలు పోసి మల్టీమీడియా సాఫ్ట్‌వేర్‌లు కొనక్కర్లేదు. ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరి! Art of Illusion త్రీడీ మోడలింగ్‌ సాఫ్ట్‌వేర్‌తో గ్రాఫిక్స్‌ని రూపొందించవచ్చు. ఓపెన్‌సోర్స్‌ గ్రాఫిక్స్‌ ఎడిటర్‌గా పేరొందించిన మరో మల్టీమీడియా సాఫ్ట్‌వేర్‌ Inkscape. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొరల్‌డ్రా, Adobe Illustrator, Xara X... లాంటి కమర్షియల్‌ సాఫ్ట్‌వేర్‌లతో సమానంగా దీన్ని వాడుకోవచ్చు. సరికొత్త ఆప్షన్లతో మెనూబార్‌, టూల్‌బార్‌లను ఏర్పాటు చేశారు. మరోవైపు కొత్త వెర్షన్‌తో డిజైనర్లను ఆకర్షిస్తున్న బ్లెండర్‌ 2.52 బీటాతో మరింత ఆకర్షణీయంగా డిజైన్లు రూపొందించవచ్చు. తెరపై మీరు చేస్తున్న పనిని ఆడియో, వీడియో రూపంలో రికార్డ్‌ చేయాలంటే CamStudioతో చేయవచ్చు. వివిధ ఫార్మెట్‌ల్లో ఉన్న వీడియోలను ఎడిట్‌ చేసుకునేందుకు Avidemux నిక్షిప్తం చేశారు. http://tinyurl.com/multimedia222
* మరిన్ని ఉచిత సాఫ్ట్‌వేర్‌లకు www.opensourcewindows.org
ఉద్యోగులకు ప్రత్యేకం ఇంట్లో ఆఫీస్‌ డాక్యుమెంట్‌లను తయారు చేయాలంటే ఎమ్మెస్‌ ఆఫీస్‌ను కొనక్కర్లేదు. NeoOffice డౌన్‌లోడ్‌ చేసుకుని వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్స్‌ను తయారు చేయవచ్చు. ఇప్పటికే అనేక మందికి సుపరిచితమైన 'ఓపెన్‌ఆఫీస్‌' కూడా పొందొచ్చు. మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌లో మాదిరిగానే డాక్యుమెంట్‌ను రూపొందించాలంటే Abiword నిక్షిప్తం చేసుకోండి. వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్ని నమోదు చేసేందుకు GNUCash డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పీడీఎఫ్‌ ఫైల్స్‌ని సులభంగా వీక్షించేందుకు సుమత్రా పీడీఎఫ్‌ పొందొచ్చు. సన్‌బర్డ్‌ క్యాలెండర్‌ను కూడా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. http://tinyurl.com/office-tools
ఇలా పీసీ పరిరక్షణ పీసీకి రక్షణ వలయంలా పని చేసే యాంటీ వైరస్‌, స్పైవేర్‌లు ఓపెన్‌సోర్స్‌లో కూడా ఉన్నాయని తెలుసా? అయితే, ClamWin, Winpoochల గురించి తెలుసుకోవాల్సిందే. సాధారణ యాంటీ వైరస్‌ల మాదిరిగానే ఇవి పని చేస్తాయి. విండోస్‌ 7, విస్టా, ఎక్సెపీ, 2000, 98, విండోస్‌ సర్వర్‌ 2008, 2003 ఓఎస్‌ల్లో Clamwin యాంటీ వైరస్‌ను వాడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 6,00,000 వినియోగదారులు వాడుతున్నారు. యాంటీవైరస్‌ అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అయ్యేలా పెట్టుకోవచ్చు. షెడ్యూల్‌ స్కానింగ్‌ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక winpooch తో ట్రోజన్స్‌, మాల్వేర్‌, స్పైవేర్‌ల పని పట్టొచ్చు. http://tinyurl. com/antivirus-spyware
వీడియో ఏదైనా! ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విశేషాల్ని టీవీలో మాదిరిగా చూడాలనుకుంటే Miro Video Playerను దిగుమతి చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌ చేసిన ప్లేయర్‌తో ఆన్‌లైన్‌ వీడియో షేరింగ్‌ సర్వీసుల్లోని వీడియోలను వెతికి వీక్షించవచ్చు. నచ్చిన వాటిని లైబ్రరీగా పెట్టుకోవచ్చు. హై డెఫినెషన్‌ వీడియోలకు కూడా అనువు.
* ఒకవేళ ఆయా సాఫ్ట్‌వేర్‌లు స్కూల్‌ఫర్జ్‌ నుంచి డౌన్‌లోడ్‌ కాకుంటే వాటిని రూపొందించిన నిపుణుల సైట్‌ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఉదాహరణకు Gcompris ఎడ్యుకేషనల్‌ గేమ్‌ డౌన్‌లోడ్‌ కాకుంటే అదే పేరుతో గూగుల్‌ సెర్చ్‌లో వెతికి http://gcompris.net/-download- హోం సైట్‌ నుంచి దిగుమతి చేసుకోండి.
* ఓపెన్‌సోర్స్‌ కమ్యూనిటీలో మీరు సభ్యులవ్వాలంటే www.schoolforge.net/education-software