Sunday, August 15, 2010

వీర గంధము


వీరగంధము దెచ్చినారము
వీరుడెవ్వడొ తెల్పుడీ!
పూసి పోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో !!

తెలుగు బావుట కన్ను చెదరగ
కొండవీటను నెగిరినప్పుడు
తెలుగు వారల కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు

తెలుగువారల వేడినెత్తురు
తుంగభద్రను గలిసినప్పుడు
దూరమందున నున్న సహ్యజ
కత్తినెత్తురు కడిగినప్పుడు

ఇట్టి సందియ మెన్నడేనియు
బుట్టలేదు రవంతయున్‌
ఇట్టి ప్రశ్నల నడుగువారలు
లేకపోయిరి సుంతయున్‌

నడుముగట్టిన తెలుగు బాలుడు
వెనుక తిరుగండెన్నడున్‌
బాసయిచ్చిన తెలుగు బాలుడు
పాఱిపోవం డెన్నడున్‌

ఇదిగో! యున్నది వీరగంధము
మై నలందుము మైనలందుము;
శాంతిపర్వము జదువవచ్చును
శాంతి సమరంబైన పిమ్మట

తెలుగునాటిని వీరమాతను
జేసి మాత్రము తిరిగి రమ్మిక
పలుతుపాకులు పలు ఫిరంగులు
దారి కడ్డము రాక తప్పవు

వీరగంధము దెచ్చినారము
వీరుడెవ్వడొ తెల్పుడీ
పూసిపోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో !!
-- 'కవిరాజు' త్రిపురనేని రామస్వామి చౌదరి