Sunday, October 10, 2010

క్షీణిస్తున్న పరాగ సంపర్కం

క్షీణిస్తున్న పరాగ సంపర్కం
భారత్‌లో కూర'గాయాల'కు కారణమిదే కలకత్తా వర్సిటీ పరిశోధనలో వెల్లడి
తేనెటీగలు, సీతాకోకచిలుకలు వంటి కీటకాలు తగ్గిపోవడంతో భారత్‌లో కూరగాయల ఉత్పత్తి క్రమేణా క్షీణిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. గత 45 ఏళ్లలో సాగు విస్తీర్ణం పెరిగినా.. అనేక రకాల కూరగాయల దిగుబడుల తీరు ఆందోళనకరంగా ఉందని ఇందులో వెల్లడైంది. కీటకాలు కానరాకపోవడంతో మొక్కల్లో పరాగసంపర్కం తగ్గిపోయి.. దిగుబడులు క్షీణిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. పరాగసంపర్కం అనేది సహజసిద్ధమైన ప్రక్రియ. పువ్వులోని పుప్పొడి రేణువులను కీటకాలు రవాణాచేసి, ఫలదీకరణం చెందేలా దోహదపడతాయి. ఈ ప్రక్రియ అన్ని పంటలకూ అవసరం ఉండదు. పరాగసంపర్కం అవసరమైన దోసకాయలు, వంకాయలు, గుమ్మడికాయలు, టమోటా, సొరకాయలు వంటి 11 రకాల పంటల దిగుబడుల్లో వృద్ధి రేటును పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ కూరగాయల సాగు విస్తీర్ణం 340 శాతం మేర పెరిగినా.. దిగుబడి మాత్రం 63 శాతమే పెరిగింది. అధ్యయనంలో 1963ని ప్రామాణిక సంవత్సరంగా తీసుకున్నారు. ఇదే కాలానికి సంబంధించి.. పరాగ సంపర్కం అవసరంలేని దుంపలు, అల్లం, వెల్లుల్లి, కొన్నిరకాల పప్పు ధాన్యాల దిగుబడులు సాగు విస్తీర్ణం నిష్పత్తికి అనుగుణంగానే పెరగడం గమనార్హం. ''కీటకాలు తగ్గిపోవడం వల్ల పరాగ సంపర్కం అవసరమైన పంటల దిగుబడులు తగ్గిపోయాయనడానికి ఇదే సూచిక. పరాగ సంపర్కంపై ఆధారపడ్డ పంటల దిగుబడి తగ్గిపోవడాన్ని చూస్తే ఈ ప్రక్రియకు అవసరమైన కీటకాలు కనుమరుగు కావడాన్ని సూచిస్తోంది'' అని పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రతిభా బసు తెలిపారు.