Thursday, September 9, 2010

జైజై గ్రీన్‌ గణేశా!

మళ్లీ వినాయక చవితి వచ్చేసింది. ప్రతి సంవత్సరం లానే పెద్ద పెద్ద వినాయక విగ్రహాలతో మండపాలను అలంకరించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమంటే, కేవలం మట్టితో చేసిన 'ఎకో గణేశ' ఎక్కువ మండపాలలో దర్శనమివ్వనున్నాడు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, రసాయన రంగుల స్థానంలో మట్టి వినాయకుడు, సహజమైన రంగుల్లో కనువిందు చేయనున్నాడు. ది సొసైటీ ఫర్‌ అవేర్‌నెస్‌ అండ్‌ విజన్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సేవ్‌) సంస్థ గత ఆరు సంవత్సరాలుగా 'సుజలాం' కార్యక్రమంలో భాగంగా మట్టి గణేశులను ప్రజలకు అందిస్తోంది. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ప్రభుత్వ సహకారంతో 25 వేల మట్టి వినాయకులను ఉచితంగాను, మరో 25 వేలను నామమాత్రపు ధరకు పంపిణీ చేస్తోంది.
హిమాయత్ నగర్ లోని ఆక్స్‌ఫర్డ్‌  గ్రామర్‌ స్కూలులో మట్టి వినాయకుడిని తయారు చేసే విధానంపై విద్యార్థుల కోసం వర్క్‌షాప్‌ను నిర్వహించారు.  అదే విధంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకోసం  వర్క్‌షాప్‌లను నిర్వహించటం జరుగుతోంది. మట్టి, గడ్డి, జనప నార, వెదురు పుల్లల వంటి సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించి విద్యార్థులు వినాయక విగ్రహాలను తయారు చేయటం నేర్చుకొంటున్నారు.
మనమంతా కలిసి చేసే ఈ ప్రయత్నాల వలన జలాశయాలకు కలిగే హాని తగ్గుతుందని భావించవచ్చు.