Thursday, September 2, 2010

విద్యాహక్కు చట్టంపై అలసత్వం

ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన విద్యాహక్కు చట్టం అమలులో పాఠశాల విద్యాశాఖ అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది.  కేంద్రం పంపిన ముసాయిదా ప్రకారం విద్యాశాఖ అధికారులు నిబంధనలను రూపొందించారు. వీటిపై  ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ జూన్‌ 30తో ముగియగా మరో 15 రోజులు గడువు పెంచారు. ఇది ముగిసి నెలన్నరైనా అధికారిక నిబంధనల ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. ఈ నిబంధనలు రూపొందితేనే విద్యా హక్కు చట్టంపై స్పష్టత వస్తుంది. ఈ చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకు ఒకరిని, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒకరిని చొప్పున ఉపాధ్యాయులను నియమించాలి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇంతవరకు మొదలుకాలేదు.
విద్యాహక్కు చట్టం ప్రకారం రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిటీ ఏర్పడాలి. ఈ కమిటీలో హైకోర్టు న్యాయమూర్తి లేదా పేరొందిన సత్సమాన విద్యావేత్త ఛైర్‌పర్సన్‌గా ఉండాలి. సభ్యులుగా వివిధ రంగాల్లో నిపుణులై ఉండాలి. దీనికి ఆలస్యం జరిగే పక్షంలో 'రైట్‌ టూ ఎడ్యుకేషన్‌ ప్రొటెక్షన్‌ అథార్టీ' ఏర్పడాలి. దీనికి పైవిధంగా నియామకాలు జరగాలి. ఇది కూడా ఇంకా అమలుకు నోచుకోలేదు. 
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రవేశాల సమయంలో విద్యార్థులకు ప్రవేశపరీక్ష పెట్టకూడదు. డొనేషన్లను స్వీకరించకూడదు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ చట్టం ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చినా నిబంధనలతో నిమిత్తంలేకుండానే అధికారుల కళ్లేదుటే, ఎప్పటిలాగే ఈ ఏడాదీ ప్రవేశాలు జరిగాయి. మరోవైపు గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరే బలహీనవర్గాల విద్యార్థులకు 25% సీట్లను కేటాయించాలి. అందుకు అవసరమైన రుసుమును ప్రభుత్వం చెల్లించాలి. ఇదీ కార్యరూపం దాల్చలేదు.