Monday, August 30, 2010

త్వరలో కొత్త రకం ఆపిళ్లు

మరింత మధురం.. ఆరోగ్యకరం!
త్వరలో కొత్త రకం ఆపిళ్లు
లండన్‌: రోజుకో ఆపిల్‌ తింటే వైద్యుడి అవసరం తప్పుతుందని చెబుతుంటారు. డాక్టర్ల అవసరాన్ని మరింత ఎక్కువగా తప్పించే ఆపిల్‌ పండ్లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ పండు జన్యు క్రమాన్ని ఆవిష్కరించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొనడమే ఇందుకు కారణం. 'గోల్డెన్‌ డెలీషియస్‌' రకం ఆపిల్‌ పండు జన్యు క్రమాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఆవిష్కరించింది. ఐదు దేశాలకు చెందిన 100 మంది పరిశోధకులు ఇందులో పాలుపంచుకున్నారు. దీనివల్ల మరింత రుచికరమైన, తియ్యటి, ఆరోగ్యవంతమైన ఆపిల్‌ పండ్ల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని వారు తెలిపారు. ఇప్పటికే ఈ పండులోని కండ రంగు, ఫ్లేవర్‌ను నియంత్రించే జన్యువులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఫలితంగా ఎర్ర రంగు కండ ఉన్న పండ్లను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వీటిలో మరింత ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి ద్వారా కీళ్లు ఆరోగ్యంగా ఉంచుకోవడంతోపాటు అల్జీమర్స్‌ వంటి వ్యాధులు దరిచేరకుండా చూసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. ఆపిల్‌ జన్యుపటం ఆవిష్కారం ద్వారా శాస్త్రవేత్తలు ఆ పండు మూలాలను గుర్తించగలిగారు.