Sunday, August 15, 2010

మాయంచేసే పరిజ్ఞానం

మాయంచేసే పరిజ్ఞానం త్వరలో సాక్షాత్కారం!
పట్టుదారంతో చమత్కారం
కీలక ముందడుగు వేసిన శాస్త్రవేత్తలు
లండన్‌: పౌరాణిక సినిమాల్లో చూపించినట్లు.. ఉన్నట్లుండి మీరూ అంతర్థానమైపోవాలని అనుకుంటున్నారా? అయితే మీ కల త్వరలోనే సాకారం కాబోతోంది. ఈ దిశగా కీలక ముందడుగు వేసినట్లు బోస్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. వీరు పట్టుదారంతో ఒక అద్భుత వస్త్రాన్ని తయారుచేయడంలో మంచి పురోగతి సాధించారు. దీన్ని ఏదైనా వస్తువుపై కప్పిఉంచితే.. అది కాంతి కిరణాలను పక్కకు వంచేస్తుంది. ఫలితంగా ఆ వస్తువు మన కంటికి కనిపించదు. కాంతిలో దృశ్య స్పెక్ట్రమ్‌కు వెలుపల ఉండే టెరాహెర్ట్జ్‌ రేంజ్‌ ఉండే 'మెటా మెటీరియల్‌'పై శాస్త్రవేత్తలు కొంతకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు పట్టు దారానికి ఈ లక్షణాన్ని కల్పించడం చాలా కీలక విజయమని వివరించారు. మానవశరీరం ఈ దారాన్ని నిరాకరించదని తెలిపారు. అందువల్ల దీన్ని నేరుగా మానవశరీరంపై ప్రవేశపెట్టవచ్చని పరిశోధనలో పాలుపంచుకున్న ఫియోరెంజో ఒమెనెట్టో పేర్కొన్నారు. ఈ పట్టు వస్త్రంలో బంగారంతో తయారుచేసిన చిన్న పరికరాలను ఉంచుతారు. వీటిని స్ల్పిట్‌ రింగ్‌ రిజోనేటర్లని వ్యవహరిస్తారు. ప్రతి చదరపు సెంటీమీటర్‌ వస్త్రంలో 10వేల రిజోనేటర్లను ఉంచుతారు. ఇవి నిర్దేశిత పౌనఃపున్యాల్లో కాంతిని గ్రహించడమో.. పరావర్తనం చెందించడమో.. పక్కకు వంచడమో చేస్తాయి. వైద్యశాస్త్రంలో ఇది అక్కరకొస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.