Wednesday, August 18, 2010

ఇండియన్‌ ఐడల్‌-5గా తెలుగుతేజం

పంద్రాగస్టు పర్వదినాన తెలుగుతేజం శ్రీరామ్‌ మహోన్నత శిఖరాన్ని అధిరోహించాడు. ఇండియన్‌ ఐడల్‌గా ఆవిర్భవించాడు. సోనీ టీవీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండియన్‌ ఐడల్‌-5 మ్యూజిక్‌ రియాలిటీ షోలో తెలుగు కుర్రాడు శ్రీరామ్‌ విజయకేతనం ఎగురవేశాడు. పోటీలు జరుగుతున్న తొలి రోజు నుంచీ శ్రావ్యమైన తన గొంతుతో శ్రీరామ్‌ అందరినీ ఆకట్టుకున్నాడు.శ్రీరామ్‌ను జడ్జీలు పొగడ్తలతో ముంచెత్తని రోజు లేదు.  విలక్షణ నటుడు అమీర్‌ఖాన్‌.... 'ఆ కిశోర్‌కుమారే' పాడుతున్నాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో శ్రీరామ్‌ తొలినుంచీ హాట్‌ఫేవరేట్‌గా మారిపోయాడు. అనుకున్నట్లే... ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో విజేతగా నిలిచి తెలుగువారి హృదయాలను ఆనందంతో నింపేశాడు 24 ఏళ్ల మైనంపాటి శ్రీరామచంద్ర.
ఇండియన్‌ ఐడల్‌ విజేత శ్రీరామ్‌కు సోనీటీవీ రూ.50 లక్షల నగదు బహుమతిని అందించింది. దీంతోపాటు ఒక బైక్‌, ఒక కారు కూడా ఇచ్చారు. విజేతతో ఒక సంవత్సరంపాటు సోనిటీవీతో ఒప్పందం కూడా ఉంటుంది. యాశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌లో పాట పాడే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. ఇండియన్‌ ఐడల్‌ కార్యక్రమాన్ని తాను సెలక్షన్స్‌ జరుగుతున్నప్పటి నుంచీ చూసినట్లు బిగ్‌బీ అమితాబ్‌ చెప్పారు. తన శ్రీమతి జయాబచ్చన్‌కు ఈ కార్యక్రమం బాగా నచ్చిందని వెల్లడించారు. అంత తేలికగా దేనినీ ఆమోదించే తత్వం ఆమెది కాదని అమితాబ్‌ మ్యూజిక్‌ రియాలిటీ షో కార్యక్రమాన్ని ఆకాశానికి ఎత్తేశారు.
ఇండియన్‌ ఐడల్‌ ఫైనల్స్‌కు వెళ్లినా... చివరి వరకూ గెలుపు ఎవరిని వరిస్తుందన్నది చెప్పడం కష్టమే. కార్యక్రమాన్ని చూసి అభిమానులు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో వారికి మద్దతు ప్రకటించాలి. పాటలు పాడటంలో ఎంత ప్రతిభ ఉన్నా... సెల్‌ఫోన్ల ద్వారా సంక్షిప్త సందేశాలు రావడం కూడా ముఖ్యమే. ఇంతకుముందు ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో కారుణ్య ఫైనల్స్‌కు చేరినా ఎస్‌ఎంఎస్‌ల్లో వెనకబడిపోవడంతో ఆయన రన్నరప్‌గా నిలిచారు. ఈసారి శ్రీరామ్‌ గెలుపును కోరుకుంటూ చాలా మంది ఎస్‌ఎంఎస్‌లు పంపడం శ్రీరామ్‌కు కలిసివచ్చింది. అభిజీత్‌ సావంత్‌, సందీప్‌ ఆచార్య, ప్రశాంత్‌ తమాంగ్‌, సౌరభీలు ఇంతకుముందు ఇండియన్‌ ఐడల్స్‌గా విజయం సాధించారు. ప్రస్తుత విజేత... శ్రీరామ్‌ ఈటీవీ నిర్వహించిన 'ఒక్కరే' పోటీలో విజేతగా నిలిచాడు. ఈటీవీ 'సై' ఫైనలిస్ట్‌. బిగ్‌ఎఫ్‌ఎంలో 'వాయిస్‌ఆఫ్‌ ఆంధ్రా'గా ఎంపికయ్యాడు. ఇప్పటి వరకూ 5 తెలుగు సినిమాల్లో పాటలు పాడిన శ్రీరామ్‌ ఇంజినీరింగ్‌ చదువుకున్నాడు. సంగీతంలో ప్రవేశం ఉంది. సందీప్‌-సులేమాన్‌ కంపోజ్‌ చేసిన ఒక హిందీ సినిమాకు శ్రేయా ఘోషల్‌తో కలిసి ఒక పాట పాడారు.