Saturday, August 7, 2010

తేనెటీగ దారి మర్చిపోతోంది!

తేనెటీగ దారి మర్చిపోతోంది!
సెల్‌ టవర్ల ప్రభావం?
తగ్గుతున్న జీసీసీ తేనె సేకరణ
ధురమైన అంశాన్ని చెప్పాలంటే తేనెతో పోలుస్తాం. తెలుగును తేనెలూరే భాషగా వర్ణిస్తాం. బరువు తగ్గాలంటే పరగడుపునే గోరు వెచ్చని నీటిలో కాస్త తేనె, నిమ్మరసం కలుపుకోవాలని నిపుణులు సలహా ఇస్తారు. బలవర్ధకమైన, రుచికరమైన ఆహార పదార్థంగానే కాకుండా సబ్బుల వంటి సౌందర్య సాధనాల ఉత్పత్తిలో కూడా తేనెను వినియోగిస్తారు. అటువంటి తేనె.. క్రమంగా అరుదైపోతోంది.
క్క గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అమ్మకాల నిమిత్తమే ఏడాదికి 3,000 క్వింటాళ్ల వరకు తేనె అవసరం అవుతుంది. కానీ, గత ఆర్థిక సంవత్సరంలో అతి కష్టం మీద 1,800 క్వింటాళ్లు మాత్రమే సేకరించగలిగారు. తేనె సేకరణ పడిపోవడానికి అడవుల విస్తీర్ణం, వర్షాల తగ్గుదల వంటివే కాకుండా సెల్‌ టవర్లు, సెల్‌ సిగ్నళ్లు కూడా కారణమని చెప్తున్నారు. 'తేనెటీగలు చాలా సున్నితమైనవి. కష్టజీవులు కూడా. ఒక్కో ఈగ తన స్వల్ప జీవిత కాలంలో దాదాపు లక్ష వరకు పువ్వులపై వాలి మకరందాన్ని సేకరించి తేనెపట్టుకు చేరుస్తుంది. పువ్వులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటి నుంచి తేనెను పీల్చి, మళ్లీ తాము ఎక్కడ పట్టుపెట్టాయో అక్కడకు వెళ్లడానికి వాటికి ఒక మార్గం ఉంటుంది. సెల్‌ఫోన్ల టవర్లు, వాటి నుంచి వచ్చే రేడియో ధార్మికత కారణంగా తేనెటీగల మెదడు ప్రభావితమై అవి తమ ఇళ్లకు వెళ్లే మార్గాన్ని మరిచిపోతున్నాయి. పిల్ల ఈగలైతే వృద్ధి చెందకుండా మరణిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ నిపుణులు కూడా ఇటీవల తమ పరిశీలనలో తేల్చార'ని జీసీసీ ప్రధాన కార్యాలయం ప్రత్యేక విధుల అధికారి (ఓఎస్‌డీ) ఎస్‌.రాధాకృష్ణ వివరించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం అన్ని ప్రాంతాల్లో విస్తారంగా ఉండడం కూడా తేనెటీగలు మకరందాన్ని సేకరించలేకపోవడానికి మరొక కారణమని ఆయన అంటున్నారు.