Sunday, August 15, 2010

భారతీయ భాషల్లో తర్జుమా

ఏ భాషైనా సరే!
ఇంటర్నెట్‌లో ఇక భారతీయ భాషల్లో తర్జుమా సదుపాయం
'ఎంటీ' వ్యవస్థను అభివృద్ధి పరచిన ఐఐఐటీ-హైదరాబాద్‌
హైదరాబాద్‌: కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ వంటి సదుపాయాలు త్వరలో భారతీయులకు మరింత సులభరీతిలో చేరువ కాబోతున్నాయి. ఇంగ్లీషులో తక్కువ ప్రవేశం ఉన్నవారూ వీటిని ప్రభావశీలంగా వినియోగించుకునేందుకు అవసరమైన భారతీయ భాషల మెషిన్‌ ట్రాన్స్‌లేషన్‌ (ఎంటీ) వ్యవస్థ సిద్ధమైంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న దీనిని ఐఐఐటీ-హైదరాబాద్‌ (ఐఐఐటీ-హెచ్‌) నేతృత్వంలోని 11 విద్యాసంస్థల కన్సార్టియం అభివృద్ధి చేసింది. మొదటి దశలో ఈ వ్యవస్థ విషయాన్ని (టెక్ట్స్‌) 12 భారతీయ భాషల్లోకి స్వయంచలితంగా తర్జుమా చేసే సదుపాయాన్ని అందిస్తుంది. రెండో దశలో మరో 12 భాషల్లో ఈ అవకాశం అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు ఐఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌, ఆచార్యుడు రాజీవ్‌ సంగాల్‌ తెలిపారు. గూగుల్‌ సహా ఇతర సైట్లు ప్రధానంగా ఇంగ్లీషు నుంచి ఇతర అంతర్జాతీయ భాషల్లోకి మాత్రమే తర్జుమా సదుపాయాన్ని అందిస్తున్నాయన్నారు. ఎంటీ ప్రాజెక్టు భారతీయ భాషలపై దృష్టి సారించిందని ఆయన వివరించారు. తమ ఉత్పత్తిని ఆవిష్కరించిన అనంతరం ఐటీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తామన్నారు. గూగుల్‌, యాహూ వంటి సంస్థలు 'ఎంటీ' కోసం తమను సంప్రదిస్తే అవసరమైన చర్చలకు సిద్ధమని డైరెక్టర్‌ ప్రకటించారు. ఈ ఉత్పత్తిపై తమకు పేటెంట్‌ హక్కులు ఉంటాయని, ఎంటీని వినియోగించుకునేవారు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుందన్నారు.