Saturday, August 7, 2010

సెల్‌ఫోన్‌ హాని చేస్తుందా?

బ్రాండెడ్‌ సెల్‌ఫోన్లతో అయినా అన్‌బ్రాండెడ్‌ మొబైల్‌తో అయినా 5 నిమిషాలు మాట్లాడినా చెవి దగ్గర వేడెక్కితే , ఫోన్‌ నుంచి అధిక రేడియేషన్‌ వెలువడటమే కారణం. అందుకే సెల్‌ఫోన్‌ కొనేటప్పుడు ఫీచర్లతో పాటు రేడియేషన్‌ ఎంత వెలువరిస్తుందో కూడా తెలుసుకోవాలి. 
మొబైల్‌ ఫోన్‌ రేడియో తరంగాలను ప్రసారం చేయడంతో పాటు గ్రహిస్తుంది కూడా. అందుకే ఫోన్‌ నిర్దిష్ట శోషణ సూచి (ఎస్‌ఏఆర్‌) అంటే రేడియో తరంగాల నుంచి ఎంత శక్తిని మన శరీరం గ్రహిస్తుందో కూడా తెలుసుకోవాలి.
'కిలోగ్రాముకు 2 వాట్ల కంటే తక్కువ రేడియేషన్‌ వెలువరించేవి మంచి ఫోన్లు' అని స్వతంత్ర సాంకేతిక సంస్థ ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ నాన్‌ అయొనైజింగ్‌ రేడియేషన్‌ ప్రొటెక్షన్‌ (ఐసీఎన్‌ఐఆర్‌పీ) తేల్చింది. 10 గ్రాముల కణజాలాన్ని సగటుగా తీసుకుని లెక్కించారు. దీనినే అంతర్జాతీయంగా అనుసరిస్తున్నారు. అయితే చెవి దగ్గర ఫోన్‌ ఉంచి మాట్లాడేందుకు ఎస్‌ఎఆర్‌ 1.29 వాట్లు/కిలోగ్రామ్‌ ఉండాలని ఐసీఎన్‌ఐఆర్‌పీ నిర్దేశించింది.
ఎస్‌ఏఆర్‌ పరిమాణం నిర్ధరించిన అత్యధిక విలువ కంటే తక్కువే ఉండాలి. ఎందుకంటే నెట్‌వర్క్‌ను చేరేందుకు మాత్రమే సెల్‌ఫోన్‌ తన బ్యాటరీ నుంచి శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. నెట్‌వర్క్‌ బేస్‌ స్టేషన్‌ నుంచి మనం ఎంత దూరాన ఉన్నాం అనే అంశంపై సెల్‌ఫోన్‌ శక్తి వినియోగం ఆధారపడుతుంది.
ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి  * ఎస్‌ఏఆర్‌ తక్కువగా ఉండే సెల్‌ఫోన్లు కొనాలి. * సాధ్యమైన చోట్ల ఫోన్‌ చెవి దగ్గరకు చేర్చకుండా, స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడాలి * హెడ్‌సెట్‌ (ఇయర్‌ఫోన్లు) వినియోగించినా సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ ప్రభావం పూర్తిగా పోదు * అవసరమైన కాల్స్‌ మాత్రమే మాట్లాడి, మిగిలిన వాటికి టెక్ట్స్‌ మెసేజ్‌ (ఎస్‌ఎంఎస్‌) వినియోగించాలి * సెల్‌ఫోన్‌ తీసుకెళ్లేటప్పుడు మన శరీరానికి కనీసం అంగుళం దూరాన ఉండేలా చూసుకోవాలి * నెట్‌వర్క్‌ బలహీనంగా ఉన్నచోట, సిగ్నల్‌ కోసం ఫోన్లు అత్యధిక రేడియేషన్‌ను వెలువరించే అవకాశముంది. అలాంటి ప్రదేశాల్లో ఫోన్‌ వినియోగం తగ్గించాలి * నిద్రించేటప్పుడు తలగడ వద్ద ఫోన్‌ ఆన్‌చేసి ఉంచవద్దు.