Tuesday, August 3, 2010

సెల్‌ఫోన్లు - బ్యాక్టీరియా పుట్టలు!

సెల్‌ఫోన్ల మీద హానికారక సూక్ష్మజీవులు కూడా ఉంటాయని మీకు తెలుసా? అది కూడా మీ బాత్రూమ్‌లోని ఫ్లష్‌ హ్యాండిల్‌ మీద ఉండే బ్యాక్టీరియా కన్నా సగటున 18 రెట్లు ఎక్కువంటే నమ్ముతారా? నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమని చెబుతున్నారు బ్రిటన్‌ పరిశోధకులు. ప్రస్తుతం వాడకంలో ఉన్నవాటిల్లో నాలుగోవంతు సెల్‌ఫోన్లు బాగా మురికిపట్టినవేనని తాజా అధ్యయనంలో వెల్లడి అయింది.  అధ్యయనం కోసం తీసుకున్న ఫోన్లల్లో అన్నింటికన్నా మురికిపట్టిన దాని మీద మన పెద్దపేగుల్లో కనిపించే బ్యాక్టీరియాతో పాటు సాల్మోనెల్లా వంటి క్రిముల స్థాయి ఏకంగా 39 రెట్లు అధికంగా ఉంది కూడా. ఆహారాన్ని కలుషితం చేసే బ్యాక్టీరియా సైతం ఎక్కువగానే ఉంటోంది. ''సెల్‌ఫోన్‌ను చేత్తో పట్టుకున్నప్పుడు దాని నుంచి అంటుకున్న బ్యాక్టీరియా వృద్ధి చెంది, తిరిగి ఫోన్‌ మీదికి చేరుతోంది. ఇలా పెరిగి పెరిగి చివరికి అనారోగ్యానికి కారణమవుతోంది'' అని పరిశోధకులు వివరించారు. ఇలాంటి సూక్ష్మక్రిములతో తీవ్రమైన కడుపునొప్పి వంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మనకు బ్యాక్టీరియా ఎంత తేలికగా అంటుకుంటోందనటానికి ఈ సెల్‌ఫోన్లే మంచి ఉదాహరణ.