Thursday, October 7, 2010

భాగ్యనగరంలో తగ్గుతున్న గాలి నాణ్యత

కాలుష్యం కోరల్లో భాగ్యనగరం  చిక్కుకొంది. రోజురోజుకూ తగ్గుతున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది.వాయు కాలుష్యం హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగిపోతున్నదని  సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరానిమెంట్‌ (సీఎస్‌ఈ)  పేర్కొంది. నగరంలోని వాయు నాణ్యతతోపాటు, రవాణ గణాంకాలను సీఎస్‌ఈ విశ్లేషించింది. చిన్నపాటి ధూళి కణాలు (పీఎం) ఎక్కువగా ఉన్నాయని గుర్తించింది.  కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం హైదరాబాద్‌లో వాయు నాణ్యత అధమ స్థాయికి చేరిందని సీఎస్‌ఈ పేర్కొంది. ''పాత నిబంధనల ప్రకారం నగరంలోని కొన్ని ప్రాంతాలు ఒక మోస్తరు స్థాయి కాలుష్య ప్రాంతాలుగా వర్గీకరించారు. మారిన నిబంధనల నేపథ్యంలో ఇవి తీవ్రమైన కాలుష్య ప్రాంతాలుగా మారిపోయాయి. తక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాలు అధిక కాలుష్య స్థాయికి చేరాయి'' అని నివేదిక వివరించింది. అక్టోబర్ 7 గురువారం నాడు  జరిగిన ఒక రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీఎస్‌ఈ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. 2003లో సరాసరి వార్షిక పీఎం10 స్థాయి 66 ఎంజీ/సీయూఎం మేర ఉండేది. 2009లో అది 80 ఎంజీ/సీయూఎంకు పెరిగిందని నివేదిక వెల్లడించింది. అత్యధిక కాలుష్య ప్రాంతంలో ఉండాల్సిన ప్రమాణం కన్నా ఇది 1.3 రెట్లు ఎక్కువని సీఎస్‌ఈ అసోసియేట్‌ డైరెక్టర్‌ అనుమితా రాయ్‌ చౌధరి తెలిపారు. ప్రస్తుతం నగరంలో 26లక్షల వాహనాలు ఉన్నాయి. ఏటా 2లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. దానితో నగరంలో సరాసరి ప్రయాణ వేగం కూడా తగ్గుతోందని చెప్పారు. 1981లో గంటకు 17 కిలోమీటర్ల మేర వేగం ఉండేదని, 2006లో అది 12 కిలోమీటర్లకు పడిపోయిందని వివరించారు. వాహనాల సంఖ్య పెరగడం వల్లే నగరంలో కాలుష్యం పెరుగుతోందని తెలిపారు.