skip to main |
skip to sidebar
ఇద్దరు సూర్యుల గ్రహం
10:28 PM
Vikasa Dhatri
ఇద్దరు సూర్యుల గ్రహం
భూమికి 49 కాంతి సంవత్సరాల దూరంలో దర్శనం
కనుగొన్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలు
వాషింగ్టన్: ఇద్దరు సూర్యుళ్లు కలిగిన ఒక భారీ గ్రహాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మాములు గ్రహాలకు భిన్నంగా దీనికి రెండు సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు ఉంటాయి. వాస్తవానికి ఇది హెచ్‌ఆర్ 7162 ప్రాథమిక తార చుట్టూ పరిభ్రమిస్తోందని పరిశోధకులు తెలిపారు. భూమికి 49 కాంతి సంవత్సరాల దూరంలో లైరా తారామండలంలో ఇది ఉన్నట్లు గుర్తించారు. ఆస్ట్రోమెట్రీ అనే విధానం ద్వారా ఈ గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ద్వారా భూమిని పోలిన గ్రహాలను గుర్తించడానికి మార్గం సుగమమవుతుందని పరిశోధనకు నాయకత్వం వహించిన మాథ్యూ మటర్స్‌పాగ్ తెలిపారు. లోగడ కూడా శాస్త్రవేత్తలు జంట నక్షత్రాలున్న గ్రహాలను కనుగొన్నారు. తాజాగా కనుగొన్న హెచ్‌ఆర్ 7162 నక్షత్రానికి సమీపంలోనే మరో తార ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వారు చెప్పారు. రెండో నక్షత్రం గురుత్వాకర్షణ శక్తి ప్రభావం పడి, గ్రహం ఆవిర్భావం సమయంలో ప్రభావం చూపి ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఈ పరిశోధన.. గ్రహాల ఏర్పడటంపై వచ్చిన కోర్ అక్రిషన్ అనే సిద్ధాంతాన్ని విభేదిస్తోంది. ఈ సిద్ధాంతం కింద.. తార చుట్టూ పరిభ్రమించే ధూళి, వాయు రేణువులు ఒక్కటిగా అతుక్కుంటూ భారీ శిలలుగా రూపాంతరం చెందుతాయి. ఆ తరువాత ఇవే భారీ గ్రహాలకు కేంద్రకాలుగా తయారవుతాయి. ఇదంతా జరగడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. అయితే హెచ్‌ఆర్ 7162 వ్యవస్థ ఆవిర్భావాన్ని గమనిస్తే.. కేవలం కొన్ని వేల సంవత్సరాల్లోనే గ్రహాల ఏర్పాటుకు అవసరమయ్యే వాయువులు, ధూళిని దెబ్బతీసినట్లు అర్థమవుతోంది. ఫలితంగా ఈ పదార్థాలన్నీ దూరంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితిని కూడా అధిగమించి భారీ గ్రహం ఏర్పడింది.