సముద్రగర్భంలో భారత్ ఆర్‌వోవీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: మనుషుల అవసరం లేకుండానే సముద్రగర్భంలో ప్రయాణించే జలాంతర్గాములను మన దేశమూ రూపొందించి చూపింది. ఈ జలాంతార్గాములను రిమోట్‌లీ ఆపరబుల్ వెహికిల్(ఆర్‌వోవీ) అని పిలుస్తున్నారు. సముద్ర ఉపరితలంపై ఒక నౌక నుంచి వీటిని నియంత్రిస్తారు. వీటిని ఇప్పటి వరకూ అమెరికా, ఫ్రాన్స్, జపాన్, రష్యా, చైనా మాత్రమే రూపొందించాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డైరక్టర్ ఆత్మానంద్ చెప్పారు.
రష్యాకు చెందిన ఎక్స్‌పెరిమెంటల్ డిజైన్ బ్యూరో ఆఫ్ ఓషనాలజికల్ ఇంజనీరింగ్‌తో కలిసి ఎన్ఐవోటీ ఈ జలాంతర్గాములను రూపొందించిందని ఆయన తెలిపారు. సముద్రంలో 6000 మీటర్ల లోతున పరిశోధించే సామర్థ్యాన్ని భారత్ సంతరించుకోవడంతో, ఐక్యరాజ్య సమితి కేటాయించిన ప్రదేశంలో పాలీ మెటాలిక్ నాడ్యూల్స్‌లనే ఖనిజాలను వెతకడానికి మన దేశం ఉపక్రమించింది. అంతే కాక సముద్ర గర్భంలో ఆర్‌వోవీలు నిర్వహించే పరిశోధనల వలన అక్కడి భూమి, సాంద్రత, కరిగి ఉన్న ప్రాణవాయువు తదితర వివరాలు తెలుస్తాయి. త్వరలోనే కృష్ణా-గోదావరి బేసిన్‌లోనూ భారత్ తయారీ ఆర్‌వోవీ సర్వే నిర్వహిస్తుంది.