Thursday, October 28, 2010

అంగారకునిపై శాశ్వత నివాసం

అంగారకునిపై శాశ్వత నివాసం
వ్యోమగాములు అక్కడే స్థిరపడతారు
భారీ నిధులతో నాసా కసరత్తు

వాషింగ్టన్‌: గ్రహాంతరజీవనం గురించి ఇప్పటి వరకూ కథలు, నవలల్లోనే చదివాం.. ఇంకో రెండు దశాబ్దాల్లో అది నిజం కానుంది. అంగారకునిపై శాశ్వత మానవ నివాసాలను ఏర్పాటు చేసే దిశగా నాసా కసరత్తు మొదలుపెట్టింది. దీని పేరు 'వందేళ్ల స్టార్‌షిప్‌'. దీంట్లో భాగంగా తొలిదశలో కొద్దిమంది వ్యోమగాములను అరుణగ్రహంపైకి పంపిస్తారు. వాళ్లు అక్కడే శాశ్వతంగా ఉండి జీవనం గడుపుతారు. స్వయంపోషకత్వం దిశగా అడుగులు వేస్తారు. తమ అవసరాలు తామే తీర్చుకొనే స్థాయికి చేరుకుంటారు. అప్పటివరకూ భూమిపై నుంచి ఆహారం తదితర నిత్యావసరాలను పంపిస్తూ ఉంటారు. వ్యోమగాములను తిరిగి భూమ్మీదకు తీసుకురావటం అన్నది ఆర్థికంగా సాధ్యం కాదని, కాబట్టే వాళ్లు అక్కడే ఉండేలా స్టార్‌షిప్‌నకు రూపకల్పన చేస్తున్నామని ఈ ప్రాజెక్టును చేపట్టిన నాసాకు చెందిన ఏమ్స్‌ పరిశోధన కేంద్రం డైరక్టర్‌ పీట్‌ వార్డెన్‌ తెలిపారు. స్టార్‌షిప్‌ ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం రూ.50వేల కోట్లు. ఆచరణలో మరెన్నో రెట్లు పెరిగే వ్యయం కోసం విరాళాలు స్వీకరిస్తామని వార్డెన్‌ పేర్కొన్నారు. గూగుల్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన లారీపేజ్‌తో కూడా మాట్లాడానని, ఆయన ఆసక్తి చూపారన్నారు.

నీరు ఉండటం వల్లే..: సౌరకుటుంబంలోని గ్రహాల్లో అంగారకునిపైనే నీరు ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అక్కడ మనిషి స్థిరపడటానికి ఇది అనుకూల అంశం. అయితే, ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు, ఆక్సిజన్‌ లేని వాతావరణం వంటివి మాత్రం ప్రతికూల అంశాలు. వీటిని అధిగమించాల్సి ఉంటుంది. సింథటిక్‌ బయాలజీ, మనిషి జన్యుక్రమంలో మార్పులు తీసుకురావటం వంటి ఆధునిక టెక్నాలజీల సాయంతో ఇటువంటి సమస్యలను పరిష్కరించవచ్చని వార్డెన్‌ పేర్కొన్నారు. వ్యోమగాములు మొదట అంగారకుని ఉపగ్రహాలపై స్థిరపడి.. అక్కడి నుంచి అంగారకుని వివరాలు తెలుసుకోవటానికి విస్తృతమైన పరిశోధనలు జరపాల్సి ఉంటుందన్నారు. 2030 నాటికి మనిషి అంగారకుని చందమామలపైకి వెళ్లటం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.