Thursday, October 7, 2010

200 కోట్ల ఏళ్ల క్రితం భూమ్మీద బిగ్‌బ్యాంగ్‌

200 కోట్ల ఏళ్ల క్రితం భూమ్మీద బిగ్‌బ్యాంగ్‌
బహుకణజీవులు పుట్టింది అప్పుడే
ఐర్లాండ్‌ శాస్త్రవేత్తల వెల్లడి
లండన్‌: మన శరీరం కొన్ని కోట్ల కణాల నిర్మితం. భూమ్మీదున్న అన్ని సంక్లిష్ట జీవరాశలదీ ఇదే తీరు. కోట్లకొద్ది కణాలు ఒక దానికొకటి కలిసి బహుకణ జీవుల ఆవిర్భావానికి అంకురార్పణ జరిగిందెప్పుడు? అసలు భూమ్మీద రెండు కణాలు కలిసిందెప్పుడు? ఈ మౌలిక ప్రశ్నకు ఐర్లాండ్‌ శాస్త్రవేత్తలు సమాధానం కనుక్కున్నారు. దాదాపు 200 కోట్ల ఏళ్ల క్రితం రెండు ఏకకణజీవులు కలిసి ఒకే కేంద్రకంతో కూడిన బహుకణజీవిగా ఏర్పడ్డాయని వారు అంచనా కట్టారు. విశ్వ ఆవిర్భావాన్ని సూచించే బిగ్‌బ్యాంగ్‌ మాదిరిగా దీన్ని 'ప్రకృతి బిగ్‌బ్యాంగ్‌' అని అభివర్ణిస్తున్నారు. ఐర్లాండ్‌ జాతీయ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ మెక్‌ఎల్‌నెర్నీ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం సంగర్‌ సంస్థకు చెందిన జేమ్స్‌ కాటన్‌తో కలిసి పదేళ్లపాటు పరిశోధించి ప్రకృతి బిగ్‌బ్యాంగ్‌ను కనుక్కున్నారు. వీరి ప్రతిపాదన ప్రకారం.. 200 కోట్ల ఏళ్ల క్రితం ఏకకణ బ్యాక్టీరియా, ఏకకణ ఆర్కియెన్‌ కలిసి ఒకే కేంద్రకమున్న ఈస్ట్‌కు (శిలీంధ్రం) జన్మనిచ్చాయి. దీన్నించే పరిణామక్రమంలో కీటకాలు, వృక్షాలు, జంతువులు ఉద్భవించాయి. మనిషి పుట్టిందీ ఈ క్రమంలోనే. ఈ సంక్లిష్ట బహుకణ జీవరాశులను 'యూకరైట్లు' అని శాస్త్రీయ పరిభాషలో పిలుస్తారు. ఈస్ట్‌ జన్యుక్రమం విశ్లేషణ ఆధారంగా నెర్నీ, కాటన్‌ల బృందం భూమ్మీద జరిగిన మొట్టమొదటి కేంద్రక సంలీనాన్ని గుర్తించింది. 'ఏ జీవజాతి డీఎన్‌ఏ సమాచారమైనా దాని కేంద్రకంలో ఉంటుంది. అసలు ఒక కేంద్రకం మొదటిసారిగా ఎలా ఏర్పడిందన్నది ఇప్పటివరకూ రహస్యంగానే ఉంది. ప్రస్తుతం మనకు ఆ విషయం తెలిసింది' అని మెక్‌ఎల్‌నెర్నీ చెప్పారు.