Sunday, October 3, 2010

క్రీడా సంబరం 'కామన్‌వెల్త్‌'

భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ చేతుల మీదుగా కామన్వెల్త్‌ క్రీడల ఆరంభ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ అద్భుత ఘట్టానికి ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం వేదికగా నిలిచింది. 28 ఏళ్ల కింద ఆసియా క్రీడలను నిర్వహించిన భారత్‌ ఇపుడు కామన్వెల్త్‌ క్రీడల ప్రారంభ వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించింది. ౩ అక్టోబరు సాయంత్రం వేళ జవహర్లాల్‌ నెహ్రూ స్టేడియంలో రూ.44 కోట్లతో ఏర్పాటుచేసిన బెలూన్‌ ఆకారపు ఏరోస్టాట్‌ తెరను ఆకాశంలోకి ఎత్తగానే ప్రాంగణమంతా స్వర్ణకాంతులు పరచుకున్నాయి.  కామన్‌వెల్త్‌ దేశాల అధినేత ఎలిజబెత్‌ రాణి తరఫున బ్రిటన్‌ యువరాజు ఛార్లెస్‌, భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ స్టేడియంలోని 60 వేలమంది ప్రేక్షకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఆరంభించారు. ఈ క్రీడల్ని బ్రిటిష్‌ రాణి ప్రారంభించకపోవడం గత 44 ఏళ్ల కాలంలో ఇదే మొదటిసారి. యువరాజు ఛార్లెస్‌, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఏకకాలంలో ఈ క్రీడల్ని ప్రారంభించాలన్న దౌత్యపరమైన ఒప్పందం మేరకు ఆదివారం ఒకే వేదికపై నుంచి ఇరువురూ క్రీడల ప్రారంభ సూచకంగా ప్రకటన చేశారు.
ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌, అంతర్జాతీయ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జాక్విస్‌ రోగ్‌, భారత్‌ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు సురేశ్‌ కల్మాడీ, వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. సంస్కృతి, ఆధునికత కలగలిసిన కార్యక్రమాలు 2 గంటలపాటు ప్రేక్షకుల్ని కట్టిపారేశాయి. 70 వేల కోట్ల రూపాయల ఈ మెగా కార్యక్రమం ఇది.  పన్నెండు రోజులపాటు జరిగే క్రీడా పండుగలో 71 దేశాలకు చెందిన ఏడువేల మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు.
1050 మంది పాఠశాల విద్యార్థుల నమస్తే నృత్య ప్రదర్శనను 23 భారతీయ భాషల్లో ఏరోస్టాట్‌లో ఆవిష్కరించారు. క్రీడాకారుల పెరేడ్‌ 71 మంది మహిళలతో ప్రారంభమైంది. అంతా చీరలు కట్టుకొని భారతీయతను, చీరల రంగుల్లో వారివారి దేశాల పతాకాలను ప్రతిబింబించారు. ఒలింపిక్‌ పతకాన్ని గెలుచుకున్న అభినవ్‌ బింద్రా సారథ్యంలో 619 మంది సభ్యుల భారత బృందం ప్రాంగణంలోకి వచ్చినపుడు కేరింతలు కొట్టారు.   71 దేశాల క్రీడాకారుల మార్చ్‌ సాగింది. హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ తార సైనా నెహ్వాల్‌, బాక్సింగ్‌ వీరుడువిజేందర్‌సింగ్‌, కుస్తీ యోధుడు సుశీల్‌ కుమార్‌లు బ్యాటన్‌ను మోసిన వారిలో ఉన్నారు. అనంతరం అన్ని దేశాల పతాకాలు ప్రాంగణంలోకి రాగా, భారత కెప్టెన్‌ బింద్రా ప్రమాణస్వీకారం చేశారు. 816 మంది ప్రదర్శనకారులు చేసిన సూర్య నమస్కారాలు, క్లిష్టమైన ఆసనాలు అలరించాయి.