Sunday, October 24, 2010

పసుపుతో కేన్సర్‌కు చికిత్స

పసుపులో అనేక వైద్య గుణాలు ఉన్న సంగతి మన అందరికీ తెలుసు. కేన్సర్‌ చికిత్సలో పసుపు కీలక పాత్ర పోషిస్తుందని ఇపుడు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి అయింది.  ఈ పరిశోధన బృందానికి భారత సంతతికి చెందిన ఎరి శ్రీవత్సన్‌ నాయకత్వం వహించటం విశేషం. పసుపులో ఉండే కర్కుమిన్‌ అనే పదార్థాన్ని సిస్ల్పాటిన్‌ అనే ఔషధంతో కలిపితే, కేన్సర్‌ చికిత్సకు ఇచ్చే కీమోథెరపీ సామర్థ్యం పెరుగుతుందని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.  మెదడు, మెడ కేన్సర్‌ చికిత్సలో ఇది సాయపడుతుందని వారు తెలిపారు. పసుపు వాపు, మంటలను తగ్గిస్తుందని రుజువైంది. కొన్ని రకాల కేన్సర్లను అణచివేస్తుందని గతం లో జరిగిన అధ్యయనాల్లోనూ తేలింది. మెదడు, మెడ కేన్సర్లు చాలా ప్రమాదకరమైనవి. వీటిని ఆలస్యంగా గుర్తిస్తే శస్త్రచికిత్సలు, కీమోథెరపీ, రేడియేషన్‌ వంటివి ఇవ్వాలి.  శ్రీవత్సన్‌, వాంగ్‌లు ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో కర్కుమిన్‌ ద్వారా మెదడు, మెడ కేన్సర్లు నయమవుతాయని తేలింది.  దీనివల్ల ఇతరత్రా దుష్ప్రభావాలు తగ్గుతాయని వివరించారు.