Sunday, October 24, 2010

పాఠ్య ప్రణాళికలో సమాచార, విద్యా హక్కు చట్టాలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి మారనున్న 7, 9 తరగతుల పాఠ్య ప్రణాళికలో సమాచార, విద్యా హక్కు చట్టాలు, విపత్తు నిర్వహణ తదితర అంశాలు చోటు చేసుకోనున్నాయి.   రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) ఈ విషయానికి సంబంధించి అధ్యయనం చేస్తోంది. సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన పెంపొందాల్సిన అవసరాన్ని తెలియజేయడంతో పాటు చట్టం ప్రయోజనాలు, దరఖాస్తు చేసుకునే విధానం తదితర అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రం లోని పలు  ప్రాంతాలు తరచూ కరవు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. మరోవైపు తుపాన్లు, సునామీ, వరదలు వంటి విపత్తులు ఎప్పుడు విరుచుకుపడతాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో  విద్యార్థులకు విపత్తులు, వాటి ప్రభావం వంటి  అంశాలపై అవగాహన పెంపొందించటానికి  రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య ప్రణాళికలో 'విపత్తు నిర్వహణ' అంశాన్ని చేర్చేందుకు సిద్ధమైంది. పౌరులకు రాజ్యాంగ హక్కులు- బాధ్యతలు, బుద్ధిమాంద్యం, పర్యావరణం తదితర అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి ప్రభుత్వం దశలవారీగా 1 నుంచి 6 తరగతుల వరకు కొత్తగా పాఠ్యపుస్తకాలు రూపొందించింది. ప్రస్తుతం 7 నుంచి 10 వ తరగతి వరకు పుస్తకాలు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2011-12లో 7, 9; 2012-13లో 8, 10 తరగతుల విద్యార్థులకు కొత్త పాఠ్య పుస్తకాలను అందవచ్చు.