ప్రభుత్వ విభాగాల్లో అవినీతి పెరుగుతోంది
సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాల్లో అవినీతి పెరిగిపోతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తంచేసింది. ''దేశంలో అవినీతిపై నియంత్రణ లేకపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా ఆదాయపు పన్ను, అమ్మకం పన్ను, ఎక్సైజ్ విభాగాల్లో అవినీతి విపరీతంగా ఉంది. డబ్బులివ్వకుంటే ఏ పనీ కాదు'' అని జస్టిస్ మార్కండేయ కట్జు, జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం తాజాగా వ్యాఖ్యానించింది. ఒక కేసులో ఆదాయపు పన్ను ఇన్‌స్పెక్టర్ మోహన్‌లాల్ శర్మను పంజాబ్, హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ వేసిన అప్పీలును అనుమతిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ పీపీ మల్హోత్రా వాదనలు వినిపిస్తూ- ఓ పన్నుచెల్లింపుదారు నుంచి ఇన్‌స్పెక్టర్ రూ.10 వేలు లంచం తీసుకొన్నట్లు దిగువ కోర్టు నిర్ధరించిందని, హైకోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించిందని ఆక్షేపించారు. ఆయనకు దిగువ కోర్టు ఏడాది కారాగార శిక్ష విధించింది. చట్టబద్ధం చేయొచ్చుగా: అదనపు సొలిసిటర్ జనరల్ వాదన అనంతరం ధర్మాసనం స్పందిస్తూ- ''ప్రభుత్వం అవినీతిని ఎందుకు చట్టబద్ధం చేయకూడదు? అలా చేస్తే ఒక్కో పనికి ఒక మొత్తాన్ని నిర్ణయించవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఏదైనా పనిచేసిపెట్టాలంటే రూ.2,500 అడగొచ్చు. ఈ విధానంతో ప్రతీ వ్యక్తి తానెంత లంచం ఇవ్వాలో ముందే తెలుసుకోవచ్చు. ప్రభుత్వ అధికారులకూ బేరమాడాల్సిన అవసరం ఉండదు. అయినా, పాపం అధికారులనూ తప్పుబట్టలేం.. ద్రవ్యోల్బణం పెరుగుతోంది కదా''అని వ్యాఖ్యానించింది. కోర్టులో విచారణకు హాజరైన ఇన్‌స్పెక్టర్- తనపై సీబీఐ అభియోగాలను తోసిపుచ్చారు. తాను అవినీతికి పాల్పడలేదని, తనకేమీ తెలియదని, ఈ కేసులో ఇరికించారని చెప్పారు. ఆయన వాదనతో ధర్మాసనం సంతృప్తి చెందలేదు. అవినీతి ముఖ్యంగా ఆదాయపుపన్ను, అమ్మకం పన్ను, ఎక్సైజ్ పన్ను విభాగాల్లో తీవ్రస్థాయిలో ఉందని పునరుద్ఘాటించింది.