Saturday, October 30, 2010

కాలానికి వందనం

కాలానికి వందనం
కాలం సమవర్తి. ప్రపంచంలోని ప్రతి మనిషికీ రోజుకు ఇరవై నాలుగు గంటలే ఇచ్చింది. గంటకు అరవై నిమిషాలే ఇచ్చింది. ఎక్కడా తేడా లేదు. వివక్ష లేదు. కొందరు మాత్రమే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అపురూపంగా వాడుకుంటున్నారు. చాలామంది ఎలా వాడుకోవాలో తెలియక వృథా చేసుకుంటున్నారు. విజేతకూ పరాజితుడికీ తేడా...సమయపాలన! కాలం కథ ఏమిటో, కాలం మనకు నేర్పించే పాఠాలేమిటో, కాలాన్ని కబళించే సర్పాలేవో ఈ పుస్తకంలో మాచర్ల రాధాకృష్ణమూర్తి చక్కగా విశ్లేషించారు. 'అత్యంత విజ్ఞుడైన సలహాదారు కాలం', 'రీసైకిల్‌ చేయలేని ఏకైక వస్తువు దుబారా చేసిన కాలం', 'మనం రోజును ఎలా ఖర్చుచేస్తావో, జీవితాన్ని కూడా అలానే ఖర్చుచేస్తాం'... తదితర సూక్తులు ఆలోచింపజేస్తాయి. శైలి ఆహ్లాదకరంగా ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోడానికి రచయిత ఇచ్చిన చిట్కాలు ఆచరణసాధ్యంగానే ఉన్నాయి.
సమయపాలన
రచన: మాచర్ల రాధాకృష్ణమూర్తి
పేజీలు: 189; వెల: రూ.100/-
ప్రతులకు: ఎం.ఆర్‌.కె.మూర్తి
హారిక పబ్లికేషన్స్‌, ప్రకాష్‌నగర్‌
నరసరావుపేట, గుంటూరు జిల్లా.

డెంగీకి దోమకాటు!

డెంగీకి దోమకాటు!
ఏడిస్‌ ఈజిప్టీపై పోరుకు జన్యుమార్పిడి కీటకం
కౌలాలంపూర్‌: ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు డెంగీ వ్యాధిని వ్యాపింపజేసే దోమలను.. దోమలతోనే అంతంచేయాలని మలేషియా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా జన్యుమార్పిడి (జీఎం) చేసిన మగ దోమలను విడుదల చేయబోతున్నారు. అలోర్‌ గజా, బెంటాంగ్‌ల ప్రాంతాలను ఇందుకోసం ఎంపిక చేశారు. 4వేల నుంచి 6వేల దోమలను వచ్చే నెలలో విడుదల చేస్తారు. జీఎం దోమలు.. ఆడ దోమలను సంభోగం జరుపుతాయి. వీటికి పుట్టే దోమలు.. లార్వా దశలోనే చనిపోతాయి. ఫలితంగా డెంగీకి కారణమయ్యే ఏడిస్‌ ఈజిప్టీ దోమల సంఖ్య తగ్గుతుందని అంచనావేస్తున్నారు.

Friday, October 29, 2010

జ్ఞానపదం


పరీక్షల్లో రాకపోతే
మీకు మంచి మార్కులు,
కలెక్టర్లు కాదు, మీరు
కాగలరట క్లర్కులు!

ఆటపాటలసలేమీ
వద్దని కా దర్థం,
ఎంతో విలువైన టైము,
చేయరాదు వ్యర్థం!

వారానికి ఒక్కసారి
చాలు మీకు వీడియో,
అప్పుడపుడు వినవచ్చును
వీలయితే రేడియో!

వ్యసనంగా మారరాదు
ఇంటివద్ద టీ.వీ.
సండే ఉదయాన తప్ప
పనికొచ్చే వేవీ?

కళ్ళు ఉరిమి చూసిందని
నిన్ను క్లాసు టీచరు,
అమ్మకి మొరపెట్టరాదు,
తనొక పూరు క్రీచరు!

వచ్చే సంచిక వరకూ
చాలును ఈ పాఠం
నాకూ వేరే వున్నది
కద ఒక జంఝాటం!

- దేవీప్రియ అంకుల్‌

Thursday, October 28, 2010

సంక్షేమంలో భారత్‌కు 88వ స్థానం

సంక్షేమంలో భారత్‌కు 88వ స్థానం
న్యూఢిల్లీ: అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించిన ప్రపంచదేశాల జాబితాలో భారత్‌ 88వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే పదిస్థానాల దిగువకు పడిపోయింది. సంపద, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, విద్య, వైద్యం, మౌలిక సౌకర్యాలు తదితర 89 అంశాల ఆధారంగా లండన్‌కు చెందిన లెజిటం ఇన్‌స్టిట్యూట్‌ అనే పరిశోధన సంస్థ ఈ జాబితాను ఏటా విడుదల చేస్తోంది. ఈసారి మొత్తం 110 దేశాల స్థితిగతులను పరిశీలించింది. తొలిస్థానాన్ని నార్వే కైవసం చేసుకోగా ఆ తర్వాత స్థానాల్లో వరుసగా డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ నిలిచాయి. పొరుగునున్న చైనా 58వ స్థానం దక్కించుకుంది. మనదేశం విషయానికొస్తే ఆర్థికవ్యవస్థ, ప్రభుత్వపాలనకు సంబంధించి మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. విద్య, ఆరోగ్యం, సామాజికపెట్టుబడి, అవకాశాలు మొదలైన విభాగాల్లో మార్కులు సంపాదించుకోలేకపోయింది. ఆరోగ్యం విషయంలో భారత్‌ దారుణమైన స్థితిలో ఉందని పౌష్టికాహారాన్ని అందించటంలో, వ్యాధుల నియంత్రణలో విఫలమైందని నివేదిక పేర్కొంది.

సహ చట్టానికి సొంత చిహ్నం, వెబ్‌సైట్‌

సహ చట్టానికి సొంత చిహ్నం, వెబ్‌సైట్‌
న్యూఢిల్లీ: సాధికారత, పారదర్శకతకు మారుపేరుగా మన్ననలు అందుకుంటున్న సహ చట్టం ఇకపై సొంత చిహ్నం(లోగో), వెబ్‌సైట్‌తో ప్రజలకు మరింత చేరువ కానుంది. ఈ చిహ్నాన్ని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల సహాయమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ గురువారం ఆవిష్కరించారు. పాలనలో జవాబుదారీతనం, ప్రజల సాధికారతకు ఈ చిహ్నం ప్రతిబింబంగా నిలుస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. దీని రూపు రేఖలు అందరికీ ఇట్టే గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. సహ చట్టం వెబ్‌సైట్‌ www.rtigateway.org. in ను కూడా మంత్రి ప్రారంభించారు. సమాచారాన్ని కోరేవారు, అందించేవారు, శిక్షణ తీసుకునేవారు, సమాచార కమిషన్లు, విద్యార్థులు, విద్యావేత్తలు అందరికీ 'విజ్ఞాన ఖని'గా ఉపయోగపడేలా దీనిని తీర్చిదిద్దారు. ఇందులో డిజిటల్‌ లైబ్రరీ, చర్చావేదిక, ఈ-న్యూస్‌లెటర్‌, బ్లాగ్‌ వంటి సదుపాయాలూ ఉన్నాయి.

అంగారకునిపై శాశ్వత నివాసం

అంగారకునిపై శాశ్వత నివాసం
వ్యోమగాములు అక్కడే స్థిరపడతారు
భారీ నిధులతో నాసా కసరత్తు

వాషింగ్టన్‌: గ్రహాంతరజీవనం గురించి ఇప్పటి వరకూ కథలు, నవలల్లోనే చదివాం.. ఇంకో రెండు దశాబ్దాల్లో అది నిజం కానుంది. అంగారకునిపై శాశ్వత మానవ నివాసాలను ఏర్పాటు చేసే దిశగా నాసా కసరత్తు మొదలుపెట్టింది. దీని పేరు 'వందేళ్ల స్టార్‌షిప్‌'. దీంట్లో భాగంగా తొలిదశలో కొద్దిమంది వ్యోమగాములను అరుణగ్రహంపైకి పంపిస్తారు. వాళ్లు అక్కడే శాశ్వతంగా ఉండి జీవనం గడుపుతారు. స్వయంపోషకత్వం దిశగా అడుగులు వేస్తారు. తమ అవసరాలు తామే తీర్చుకొనే స్థాయికి చేరుకుంటారు. అప్పటివరకూ భూమిపై నుంచి ఆహారం తదితర నిత్యావసరాలను పంపిస్తూ ఉంటారు. వ్యోమగాములను తిరిగి భూమ్మీదకు తీసుకురావటం అన్నది ఆర్థికంగా సాధ్యం కాదని, కాబట్టే వాళ్లు అక్కడే ఉండేలా స్టార్‌షిప్‌నకు రూపకల్పన చేస్తున్నామని ఈ ప్రాజెక్టును చేపట్టిన నాసాకు చెందిన ఏమ్స్‌ పరిశోధన కేంద్రం డైరక్టర్‌ పీట్‌ వార్డెన్‌ తెలిపారు. స్టార్‌షిప్‌ ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం రూ.50వేల కోట్లు. ఆచరణలో మరెన్నో రెట్లు పెరిగే వ్యయం కోసం విరాళాలు స్వీకరిస్తామని వార్డెన్‌ పేర్కొన్నారు. గూగుల్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన లారీపేజ్‌తో కూడా మాట్లాడానని, ఆయన ఆసక్తి చూపారన్నారు.

నీరు ఉండటం వల్లే..: సౌరకుటుంబంలోని గ్రహాల్లో అంగారకునిపైనే నీరు ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అక్కడ మనిషి స్థిరపడటానికి ఇది అనుకూల అంశం. అయితే, ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు, ఆక్సిజన్‌ లేని వాతావరణం వంటివి మాత్రం ప్రతికూల అంశాలు. వీటిని అధిగమించాల్సి ఉంటుంది. సింథటిక్‌ బయాలజీ, మనిషి జన్యుక్రమంలో మార్పులు తీసుకురావటం వంటి ఆధునిక టెక్నాలజీల సాయంతో ఇటువంటి సమస్యలను పరిష్కరించవచ్చని వార్డెన్‌ పేర్కొన్నారు. వ్యోమగాములు మొదట అంగారకుని ఉపగ్రహాలపై స్థిరపడి.. అక్కడి నుంచి అంగారకుని వివరాలు తెలుసుకోవటానికి విస్తృతమైన పరిశోధనలు జరపాల్సి ఉంటుందన్నారు. 2030 నాటికి మనిషి అంగారకుని చందమామలపైకి వెళ్లటం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

Wednesday, October 27, 2010

బాలకార్మికుల గణనపై 'సుప్రీం' అసంతృప్తి


వెట్టి, బాలకార్మిక వ్యవస్థల నిర్మూలన కోసం అవసరమైన గణనను రాష్ట్రాలు చేపట్టకపోవటంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ''ఎన్‌హెచ్‌ఆర్‌సీ సూచనల మేరకు ఈ గణన కోసం కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు కేంద్రం నిధులిస్తోంది. ఏ ఒక్క రాష్ట్రామూ దీనిని చేపట్టలేదు'' అని ప్రధాన న్యాయమూర్తి కపాడియా.. న్యాయమూర్తులు కె.ఎస్‌.రాధాకృష్ణన్‌, స్వతంతర్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బాల కార్మికులపై సర్వే చేయకపోతే నిధులు ఎందుకు విడుదల చేస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. తమ ఉత్తర్వులు అమలు చేయకపోతే.. ఆదేశాలు జారీచేయటాన్ని ఆపేస్తామని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెట్టి, బాల కార్మికవ్యవస్థ నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై 1985లో దాఖలైన వ్యాజ్యంపై సుప్రీం విచారణ చేపట్టింది.

Tuesday, October 26, 2010

పిండి కొద్దీ రొట్టె

సామెతలు...
తెలుగు సాహిత్యంలో సామెతల కేమీ కొదవ లేదు. నగర జీవి మరిచిపోయినా ఈ సామెతలు పల్లె జనం నోళ్లలో నేటికీ నానుతూ ఉన్నాయి. జంతువులు, చెట్లు, వ్యవసాయం..... ఇలా ఎన్నో విషయాల గురించి విలువైన సమాచారాన్ని సామెతల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు. అటువంటి సామెతల నుంచి కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాం.
    * 1 పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు
    * 2 పగటి ముచ్చట పని చేటు
    * 3 పండిత పుత్ర పరమ శుంఠ
    * 4 పండితపుత్రుడు... కానీ పండితుడే...
    * 5 పందికేంతెలుసు పన్నీరు వాసన
    * 6 పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది
    * 7 పని లేని మంగలి పిలిచి తల గొరిగినట్లు
    * 8 పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
    * 9 పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది
    * 10 పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి
    * 11 పరుగెత్తి పాలుతాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలు
    * 12 పరువం మీద వున్నపుడు పంది కూడా అందంగా ఉంటుంది
    * 13 పల్లాన పండింది; మెరకన ఎండింది; వాడికుప్ప కాలింది; వాడి అప్పుతీరింది. అయితే ఎవరు వాడు?
    * 14 పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?
    * 15 పావలా కోడికి ముప్పావలా దిష్టి
    * 16 పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా!
    * 17 పాపమని పాత చీర ఇస్తే ఇంటి వెనక్కు వెళ్ళి మూరేసుకుందట
    * 18 పాలు, నీళ్ళలా కలిసిపోయారు
    * 19 పిండి కొద్దీ రొట్టె
    * 20 పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు
    * 21 పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట
    * 22 పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు
    * 23 పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి
    * 24 పిచ్చోడి చేతిలో రాయి
    * 25 పిచ్చోడికి పింగే లోకం
    * 26 పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ
    * 27 పిల్లికి బిచ్చం పెట్టనివాడు
    * 28 పుండుకు పుల్ల మొగుడు
    * 29 పుట్టుకతో వచ్చిన బుద్ది, పుడకలతో గానీ పోదు
    * 30 పుడుతూ పుత్రులు పెరుగుతూ శత్రువులు
    * 31 పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
    * 32 పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి
    * 33 పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు
    * 34 పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లు
    * 35 పెదవులతో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించటం
    * 36 పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదు
    * 37 పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు
    * 38 పెరుగుట విరుగుట కొరకే
    * 39 పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్ళినట్టు
    * 40 పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే
    * 41 పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట
    * 42 పైన పటారం, లోన లొటారం
    * 43 పొట్టోడికి పుట్టెడు బుద్దులు
    * 44 పొమ్మనలేక పొగపెట్టినట్లు
    * 45 పొయ్యి దగ్గర పోలీసు
    * 46 పొరుగింటి పుల్లకూర రుచి
    * 47 పెళ్ళీకి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టు

Sunday, October 24, 2010

శబ్ద కాలుష్యానికి అడ్డుకట్ట

శబ్ద కాలుష్యానికి అడ్డుకట్ట
వచ్చే దీపావళి నాటికి ప్రత్యేక వ్యవస్థ
న్యూఢిల్లీ: వచ్చే దీపావళి నాటికి శబ్ద కాలుష్యాన్ని పర్యవేక్షించే విస్తృత నెట్‌వర్క్‌ దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దీనిని ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లోని జనసమ్మర్ధం ఉండే ప్రాంతాల్లో పరిసర శబ్ద స్థాయిలను నియంత్రించేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 160 శబ్ద నియంత్రణ కేంద్రాలను నిర్మిస్తారు. ''వచ్చే దీపావళి నాటికి వ్యవస్థ సిద్ధం అవుతుంది. దేశంలో ఏ ప్రాంతంలో శబ్ద కాలుష్యం స్థాయిలు ఏవిధంగా ఉన్నాయన్న వాస్తవ కాల సమాచారాన్ని ఈ ప్రత్యేక వ్యవస్థ అందిస్తుంది'' అని సీపీసీబీ ఛైర్మన్‌ ఎస్పీ గౌతం వెల్లడించారు.

ఇద్దరు సూర్యుల గ్రహం

ఇద్దరు సూర్యుల గ్రహం
భూమికి 49 కాంతి సంవత్సరాల దూరంలో దర్శనం
కనుగొన్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌: ఇద్దరు సూర్యుళ్లు కలిగిన ఒక భారీ గ్రహాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మాములు గ్రహాలకు భిన్నంగా దీనికి రెండు సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు ఉంటాయి. వాస్తవానికి ఇది హెచ్‌ఆర్‌ 7162 ప్రాథమిక తార చుట్టూ పరిభ్రమిస్తోందని పరిశోధకులు తెలిపారు. భూమికి 49 కాంతి సంవత్సరాల దూరంలో లైరా తారామండలంలో ఇది ఉన్నట్లు గుర్తించారు. ఆస్ట్రోమెట్రీ అనే విధానం ద్వారా ఈ గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ద్వారా భూమిని పోలిన గ్రహాలను గుర్తించడానికి మార్గం సుగమమవుతుందని పరిశోధనకు నాయకత్వం వహించిన మాథ్యూ మటర్స్‌పాగ్‌ తెలిపారు. లోగడ కూడా శాస్త్రవేత్తలు జంట నక్షత్రాలున్న గ్రహాలను కనుగొన్నారు. తాజాగా కనుగొన్న హెచ్‌ఆర్‌ 7162 నక్షత్రానికి సమీపంలోనే మరో తార ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వారు చెప్పారు. రెండో నక్షత్రం గురుత్వాకర్షణ శక్తి ప్రభావం పడి, గ్రహం ఆవిర్భావం సమయంలో ప్రభావం చూపి ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఈ పరిశోధన.. గ్రహాల ఏర్పడటంపై వచ్చిన కోర్‌ అక్రిషన్‌ అనే సిద్ధాంతాన్ని విభేదిస్తోంది. ఈ సిద్ధాంతం కింద.. తార చుట్టూ పరిభ్రమించే ధూళి, వాయు రేణువులు ఒక్కటిగా అతుక్కుంటూ భారీ శిలలుగా రూపాంతరం చెందుతాయి. ఆ తరువాత ఇవే భారీ గ్రహాలకు కేంద్రకాలుగా తయారవుతాయి. ఇదంతా జరగడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. అయితే హెచ్‌ఆర్‌ 7162 వ్యవస్థ ఆవిర్భావాన్ని గమనిస్తే.. కేవలం కొన్ని వేల సంవత్సరాల్లోనే గ్రహాల ఏర్పాటుకు అవసరమయ్యే వాయువులు, ధూళిని దెబ్బతీసినట్లు అర్థమవుతోంది. ఫలితంగా ఈ పదార్థాలన్నీ దూరంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితిని కూడా అధిగమించి భారీ గ్రహం ఏర్పడింది.

పాఠ్య ప్రణాళికలో సమాచార, విద్యా హక్కు చట్టాలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి మారనున్న 7, 9 తరగతుల పాఠ్య ప్రణాళికలో సమాచార, విద్యా హక్కు చట్టాలు, విపత్తు నిర్వహణ తదితర అంశాలు చోటు చేసుకోనున్నాయి.   రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) ఈ విషయానికి సంబంధించి అధ్యయనం చేస్తోంది. సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన పెంపొందాల్సిన అవసరాన్ని తెలియజేయడంతో పాటు చట్టం ప్రయోజనాలు, దరఖాస్తు చేసుకునే విధానం తదితర అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రం లోని పలు  ప్రాంతాలు తరచూ కరవు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. మరోవైపు తుపాన్లు, సునామీ, వరదలు వంటి విపత్తులు ఎప్పుడు విరుచుకుపడతాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో  విద్యార్థులకు విపత్తులు, వాటి ప్రభావం వంటి  అంశాలపై అవగాహన పెంపొందించటానికి  రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య ప్రణాళికలో 'విపత్తు నిర్వహణ' అంశాన్ని చేర్చేందుకు సిద్ధమైంది. పౌరులకు రాజ్యాంగ హక్కులు- బాధ్యతలు, బుద్ధిమాంద్యం, పర్యావరణం తదితర అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి ప్రభుత్వం దశలవారీగా 1 నుంచి 6 తరగతుల వరకు కొత్తగా పాఠ్యపుస్తకాలు రూపొందించింది. ప్రస్తుతం 7 నుంచి 10 వ తరగతి వరకు పుస్తకాలు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2011-12లో 7, 9; 2012-13లో 8, 10 తరగతుల విద్యార్థులకు కొత్త పాఠ్య పుస్తకాలను అందవచ్చు. 

పసుపుతో కేన్సర్‌కు చికిత్స

పసుపులో అనేక వైద్య గుణాలు ఉన్న సంగతి మన అందరికీ తెలుసు. కేన్సర్‌ చికిత్సలో పసుపు కీలక పాత్ర పోషిస్తుందని ఇపుడు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి అయింది.  ఈ పరిశోధన బృందానికి భారత సంతతికి చెందిన ఎరి శ్రీవత్సన్‌ నాయకత్వం వహించటం విశేషం. పసుపులో ఉండే కర్కుమిన్‌ అనే పదార్థాన్ని సిస్ల్పాటిన్‌ అనే ఔషధంతో కలిపితే, కేన్సర్‌ చికిత్సకు ఇచ్చే కీమోథెరపీ సామర్థ్యం పెరుగుతుందని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.  మెదడు, మెడ కేన్సర్‌ చికిత్సలో ఇది సాయపడుతుందని వారు తెలిపారు. పసుపు వాపు, మంటలను తగ్గిస్తుందని రుజువైంది. కొన్ని రకాల కేన్సర్లను అణచివేస్తుందని గతం లో జరిగిన అధ్యయనాల్లోనూ తేలింది. మెదడు, మెడ కేన్సర్లు చాలా ప్రమాదకరమైనవి. వీటిని ఆలస్యంగా గుర్తిస్తే శస్త్రచికిత్సలు, కీమోథెరపీ, రేడియేషన్‌ వంటివి ఇవ్వాలి.  శ్రీవత్సన్‌, వాంగ్‌లు ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో కర్కుమిన్‌ ద్వారా మెదడు, మెడ కేన్సర్లు నయమవుతాయని తేలింది.  దీనివల్ల ఇతరత్రా దుష్ప్రభావాలు తగ్గుతాయని వివరించారు.

Tuesday, October 19, 2010

సున్నిత పర్యావరణ ప్రాంతంగా దండి

భారత స్వాతంత్రోద్యమంలో కీలకమైన ఉప్పు సత్యాగ్రహానికి వేదికగా నిలిచిన గుజరాత్‌లోని దండి, దానిపక్కనున్న మూడు గ్రామాలను పర్యావరణపరమైన సున్నిత ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. నవసరి జిల్లాలోని తీరప్రాంతాలైన దండి, సమాపూర్‌, మత్వాడ్‌, ఒంజాల్‌లలో సున్నితమైన పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయని కేంద్ర పర్యావరణ అటవీశాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ''ఈ నాలుగు గ్రామాలకున్న చారిత్రక, పర్యావరణ ప్రాధాన్యం దృష్ట్యా ఈ ప్రాంతాన్ని పరిరక్షించడం అవసరం. దీనివల్ల గ్రామాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అన్న గాంధీ సూత్రాలను కూడా పాటించినట్లవుతుంది'' అని పేర్కొంది.

వాతావరణ మార్పు వల్ల భారత్‌కే అధిక ముప్పు

వాతావరణ మార్పు వల్ల రానున్న 30 ఏళ్లలో అత్యధిక ముప్పు ఎదుర్కొనే దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉందని బ్రిటన్‌కు చెందిన మాప్లెక్రాఫ్ట్‌ సంస్థ తమ సర్వేలో వెల్లడించింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌ మొదటి స్థానంలో, నేపాల్‌ నాలుగు, పాకిస్థాన్‌ 16, అఫ్గానిస్థాన్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. 170 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో.. ఆసియా ప్రాంతంలోనే వాతావరణం అత్యంత దుర్భరంగా ఉన్నట్లు గుర్తించారు. జనాభా పెరుగుదల వల్ల వరదలు, తుఫాన్లు, అనావృష్టి ఏర్పడుతాయని తెలిపింది. వాతావరణంలో జరిగే స్వల్ప మార్పులు.. మానవులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పర్యావరణ పరిశోధకుడు అన్నామొస్‌ తెలిపారు. నీటి వసతులు, పంట దిగుబడిపై దుష్ప్రభావం చూపడంతో పాటు సముద్ర మట్టాలు పెరిగి భూభాగాన్ని కోల్పొతామని వివరించారు.

Thursday, October 14, 2010

ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు

సామెతలు...

తెలుగు సాహిత్యంలో సామెతల కేమీ కొదవ లేదు. నగర జీవి మరిచిపోయినా ఈ సామెతలు పల్లె జనం నోళ్లలో నేటికీ నానుతూ ఉన్నాయి. జంతువులు, చెట్లు, వ్యవసాయం..... ఇలా ఎన్నో విషయాల గురించి విలువైన సమాచారాన్ని సామెతల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు. అటువంటి సామెతల నుంచి కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాం.
  * 1 ఏకులా వచ్చి మేకులా తగులుకున్నట్టు
    * 2 ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు
    * 3 ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు
    * 4 ఏ చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షము
    * 5 ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం
    * 6 ఏడ్చే దానికి మొగుడొస్తే నాకూ వస్తాడన్నట్టు
    * 7 ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు
    * 8 ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చున్నట్లు
    * 9 ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే
    * 10 ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య
    * 11 ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు
    * 12 ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు
    * 13 ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే
    * 14 ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు
    * 15 ఏమండీ కరణం గారూ పాతర లో పడ్డారే అంటే, కాదు మషాకత్తు చేస్తున్నాను అన్నాడట
    * 16 ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది,అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి పడుంది
    * 17 ఏరు ఏడామడలుండగానే చీర విప్పి చంకన బెట్టుకొందట
    * 18 ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు

Sunday, October 10, 2010

చిన్నపాటి దెబ్బలే పిల్లలకు పెద్ద పాఠాలు

చిన్నపాటి దెబ్బలే పిల్లలకు పెద్ద పాఠాలు

లండన్,అక్టోబర్ 10: మీ పిల్లలు మోకాలి చిప్ప లు పగులగొట్టుకునో లేదా మోచేతులకు దెబ్బలు తగిలించుకునో వస్తే వాళ్లనేమీ అనకండి. ఎందుకంటే వా రి జీవితంలో 'నేర్చుకోవ డం' అనే ప్రక్రియలో అలా దెబ్బలు తగిలించుకోవడం కూ డా ఒక భాగమట. పిల్లలు చిన్న చిన్న రిస్కులు తీసుకుంటేనే మంచిదని 'హెల్త్ అండ్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్లే ఇంగ్లం డ్' నివేదిక చెబుతోంది. పైగా ఆట స్థలాల్లో వారికి మోకాళ్లకు, మోచేతులకు దెబ్బలు తగిలేలా కొన్ని ఏర్పాట్లు ఉండాలని కూడా సెలవిస్తోంది.

ఉదాహరణకు ఎగుడు దిగుడు నే లపై పిల్లలు సైకిల్ తొక్కడం నేర్చుకోవాలట. వారికి అన్నీ స్పూన్‌తో అందించి నిర్వీర్యులను చేయకుండా వారంతట వారు కొన్ని పనులు చేయడాన్ని ప్రోత్సహించాలని నిపుణుల అభిప్రాయం. ఆట స్థలాల్లో చిన్నపాటి రిస్కులు తీసుకునే అ వకాశం లేకుంటే.. బాలబాలికలు నిజజీవితంలో రిస్కులు తీసుకుని ప్రమాదంలో పడతారని వా రు హెచ్చరిస్తున్నారు.

సముద్రగర్భంలో భారత్ ఆర్‌వోవీ

సముద్రగర్భంలో భారత్ ఆర్‌వోవీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: మనుషుల అవసరం లేకుండానే సముద్రగర్భంలో ప్రయాణించే జలాంతర్గాములను మన దేశమూ రూపొందించి చూపింది. ఈ జలాంతార్గాములను రిమోట్‌లీ ఆపరబుల్ వెహికిల్(ఆర్‌వోవీ) అని పిలుస్తున్నారు. సముద్ర ఉపరితలంపై ఒక నౌక నుంచి వీటిని నియంత్రిస్తారు. వీటిని ఇప్పటి వరకూ అమెరికా, ఫ్రాన్స్, జపాన్, రష్యా, చైనా మాత్రమే రూపొందించాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డైరక్టర్ ఆత్మానంద్ చెప్పారు.

రష్యాకు చెందిన ఎక్స్‌పెరిమెంటల్ డిజైన్ బ్యూరో ఆఫ్ ఓషనాలజికల్ ఇంజనీరింగ్‌తో కలిసి ఎన్ఐవోటీ ఈ జలాంతర్గాములను రూపొందించిందని ఆయన తెలిపారు. సముద్రంలో 6000 మీటర్ల లోతున పరిశోధించే సామర్థ్యాన్ని భారత్ సంతరించుకోవడంతో, ఐక్యరాజ్య సమితి కేటాయించిన ప్రదేశంలో పాలీ మెటాలిక్ నాడ్యూల్స్‌లనే ఖనిజాలను వెతకడానికి మన దేశం ఉపక్రమించింది. అంతే కాక సముద్ర గర్భంలో ఆర్‌వోవీలు నిర్వహించే పరిశోధనల వలన అక్కడి భూమి, సాంద్రత, కరిగి ఉన్న ప్రాణవాయువు తదితర వివరాలు తెలుస్తాయి. త్వరలోనే కృష్ణా-గోదావరి బేసిన్‌లోనూ భారత్ తయారీ ఆర్‌వోవీ సర్వే నిర్వహిస్తుంది.

ప్రభుత్వ విభాగాల్లో అవినీతి

డబ్బులివ్వకుంటే ఏ పనీ కాదు!
ప్రభుత్వ విభాగాల్లో అవినీతి పెరుగుతోంది
సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాల్లో అవినీతి పెరిగిపోతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తంచేసింది. ''దేశంలో అవినీతిపై నియంత్రణ లేకపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా ఆదాయపు పన్ను, అమ్మకం పన్ను, ఎక్సైజ్‌ విభాగాల్లో అవినీతి విపరీతంగా ఉంది. డబ్బులివ్వకుంటే ఏ పనీ కాదు'' అని జస్టిస్‌ మార్కండేయ కట్జు, జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం తాజాగా వ్యాఖ్యానించింది. ఒక కేసులో ఆదాయపు పన్ను ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌లాల్‌ శర్మను పంజాబ్‌, హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ వేసిన అప్పీలును అనుమతిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సీబీఐ తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పీపీ మల్హోత్రా వాదనలు వినిపిస్తూ- ఓ పన్నుచెల్లింపుదారు నుంచి ఇన్‌స్పెక్టర్‌ రూ.10 వేలు లంచం తీసుకొన్నట్లు దిగువ కోర్టు నిర్ధరించిందని, హైకోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించిందని ఆక్షేపించారు. ఆయనకు దిగువ కోర్టు ఏడాది కారాగార శిక్ష విధించింది. చట్టబద్ధం చేయొచ్చుగా: అదనపు సొలిసిటర్‌ జనరల్‌ వాదన అనంతరం ధర్మాసనం స్పందిస్తూ- ''ప్రభుత్వం అవినీతిని ఎందుకు చట్టబద్ధం చేయకూడదు? అలా చేస్తే ఒక్కో పనికి ఒక మొత్తాన్ని నిర్ణయించవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఏదైనా పనిచేసిపెట్టాలంటే రూ.2,500 అడగొచ్చు. ఈ విధానంతో ప్రతీ వ్యక్తి తానెంత లంచం ఇవ్వాలో ముందే తెలుసుకోవచ్చు. ప్రభుత్వ అధికారులకూ బేరమాడాల్సిన అవసరం ఉండదు. అయినా, పాపం అధికారులనూ తప్పుబట్టలేం.. ద్రవ్యోల్బణం పెరుగుతోంది కదా''అని వ్యాఖ్యానించింది. కోర్టులో విచారణకు హాజరైన ఇన్‌స్పెక్టర్‌- తనపై సీబీఐ అభియోగాలను తోసిపుచ్చారు. తాను అవినీతికి పాల్పడలేదని, తనకేమీ తెలియదని, ఈ కేసులో ఇరికించారని చెప్పారు. ఆయన వాదనతో ధర్మాసనం సంతృప్తి చెందలేదు. అవినీతి ముఖ్యంగా ఆదాయపుపన్ను, అమ్మకం పన్ను, ఎక్సైజ్‌ పన్ను విభాగాల్లో తీవ్రస్థాయిలో ఉందని పునరుద్ఘాటించింది.

క్షీణిస్తున్న పరాగ సంపర్కం

క్షీణిస్తున్న పరాగ సంపర్కం
భారత్‌లో కూర'గాయాల'కు కారణమిదే కలకత్తా వర్సిటీ పరిశోధనలో వెల్లడి
తేనెటీగలు, సీతాకోకచిలుకలు వంటి కీటకాలు తగ్గిపోవడంతో భారత్‌లో కూరగాయల ఉత్పత్తి క్రమేణా క్షీణిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. గత 45 ఏళ్లలో సాగు విస్తీర్ణం పెరిగినా.. అనేక రకాల కూరగాయల దిగుబడుల తీరు ఆందోళనకరంగా ఉందని ఇందులో వెల్లడైంది. కీటకాలు కానరాకపోవడంతో మొక్కల్లో పరాగసంపర్కం తగ్గిపోయి.. దిగుబడులు క్షీణిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. పరాగసంపర్కం అనేది సహజసిద్ధమైన ప్రక్రియ. పువ్వులోని పుప్పొడి రేణువులను కీటకాలు రవాణాచేసి, ఫలదీకరణం చెందేలా దోహదపడతాయి. ఈ ప్రక్రియ అన్ని పంటలకూ అవసరం ఉండదు. పరాగసంపర్కం అవసరమైన దోసకాయలు, వంకాయలు, గుమ్మడికాయలు, టమోటా, సొరకాయలు వంటి 11 రకాల పంటల దిగుబడుల్లో వృద్ధి రేటును పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ కూరగాయల సాగు విస్తీర్ణం 340 శాతం మేర పెరిగినా.. దిగుబడి మాత్రం 63 శాతమే పెరిగింది. అధ్యయనంలో 1963ని ప్రామాణిక సంవత్సరంగా తీసుకున్నారు. ఇదే కాలానికి సంబంధించి.. పరాగ సంపర్కం అవసరంలేని దుంపలు, అల్లం, వెల్లుల్లి, కొన్నిరకాల పప్పు ధాన్యాల దిగుబడులు సాగు విస్తీర్ణం నిష్పత్తికి అనుగుణంగానే పెరగడం గమనార్హం. ''కీటకాలు తగ్గిపోవడం వల్ల పరాగ సంపర్కం అవసరమైన పంటల దిగుబడులు తగ్గిపోయాయనడానికి ఇదే సూచిక. పరాగ సంపర్కంపై ఆధారపడ్డ పంటల దిగుబడి తగ్గిపోవడాన్ని చూస్తే ఈ ప్రక్రియకు అవసరమైన కీటకాలు కనుమరుగు కావడాన్ని సూచిస్తోంది'' అని పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రతిభా బసు తెలిపారు.

'దండన లేని బోధన'

'దండన లేని బోధన' పేరిట 10.10.10వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌ లోని జూబ్లీ హాలులో హెచ్‌ఎం టీవీ ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సదస్సులో వ్యక్తమైన కొన్ని అభిప్రాయాలను ఇక్కడ అందజేస్తున్నాం.

'భయంతో బుద్ధి రాదు - బెత్తం చదువు చెప్పదు' అనే సందేశంతో రూపొందించిన పోస్టర్‌ను ప్రొఫెసర్‌ శాంతా సిన్హా ఆవిష్కరించారు. పిల్లలు, పెద్దలు సమానమేనని ఆమె ఈ సందర్భంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పిల్లలను ప్రేమించటంతో పాటు వారిని గౌరవించటం కూడా మనం నేర్చుకోవాలని ఆమె అన్నారు. పిల్లలను కొట్టే హక్కు పెద్దలకు లేదని ఆమె చెప్పారు. కార్పొరల్‌ పనిష్‌మెంట్‌ను విద్యా హక్కు చట్టం నిషేధించిందని ఆమె చెప్పారు.

1990 ప్రాంతాల్లో మానవ హక్కుల చట్టం వచ్చింది. అప్పటి నుంచే మహిళల హక్కులు, బాలల హక్కులు, దళితుల హక్కుల గురించి అందరూ మాట్లాడటం పెరిగింది. ఈ చట్టాలతో సమస్యలు తగ్గుతాయనుకొన్నాను. కానీ చట్టాలు వచ్చినప్పటి నుంచే సమస్యలు మరింతగా పెరిగాయి. ఇందుకు కారణం ఏమిటనేది మనమంతా ఆలోచించాలి.
మాణిక్య వర ప్రసాద్‌, విద్యా శాఖ మంత్రి

కొట్టక పోతే పిల్లలకు చదువు రాదని తల్లిదండ్రులు కూడ భావిస్తున్నారు. దండిస్తే పిల్లల మేధస్సు పెరగదు. దండనతో విద్యార్థులలో హింసా ప్రవృత్తి పెరుగుతుంది.
ప్రొఫెసర్‌ హర గోపాల్‌, జనరల్‌ సెక్రటరీ, సేవ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ

క్రమ శిక్షణ, శిక్షల మధ్య వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి.
బాల సుబ్రహ్మణ్యం, డైరెక్టర్‌, విద్యా శాఖ
లెర్నింగ్‌ డిజెబిలిటీ ఉన్న పిల్లలకు విద్య నేర్పే ఉపాధ్యాయులు మనకు లేరు. అలాగే పుట్టుకతోనే బహు ముఖ ప్రజ్ఞను కలిగి ఉన్న పిల్లలకు చదువు చెప్పగలిగే ఉపాధ్యాయులూ మనకు లేరు. ఈ రెండు రకాల పిల్లలను హాండిల్‌ చేయగలగటాన్ని ఉపాధ్యాయులు నేర్చుకోవాలి. విద్యార్థులందరికీ ఒకేలా మూస పద్థతిలో బోధించే విధానాన్నే మనం అనుసరిస్తున్నాం.
డాక్టర్‌ వీరేందర్‌, క్లినికల్‌ సైకాలజిస్ట్‌
ఇప్పటి విద్య పడగల క్రింద నడుస్తోంది. అది టీచర్లనీ, విద్యార్థులనీ కాటు వేస్తోంది. తల్లిదండ్రులు పిల్లలను కొడుతున్నారు. తల్లిని తండ్రి కొడుతున్నాడు. కొట్టటం అనేది కుటుంబంలో ఉంది, సమాజంలో ఉంది. అదే బడిలోకి వచ్చింది. దండన లేని సమాజం ఉన్నప్పుడు దండన లేని బడి ఉంటుంది. శిక్షణా? - శిక్షా అనేది హింస లేని సమాజాన్ని ఆవిష్కరించుకొన్నపుడు సాధ్యమవుతుంది.
బడిలో బడి వాతావరణం లేదు. వసతులూ లేవు. బడిని ఒక పూల తోటలా నిర్వహించాలి.
రాఘవాచారి, మోడల్‌ టీచర్‌

ఉపాధ్యాయులనే బాధ్యులను చేయటం సరికాదు
వెంకట రెడ్డి, అధ్యక్షుడు, పిఆర్‌టియు

ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి 1:30 ఉంటే సర్వ శిక్షా అభియాన్‌లో చెప్పినట్లు ఆటపాటలతో బోధించటం సాధ్యమవుతుంది. ఒకరిద్దరు ఉపాధ్యాయులే మొత్తం పాఠశాలను కంట్రోల్‌ చేయటం కష్టం. దండన వెనుక ఉన్న కారణాలను కనుగొనాలి. ప్రభుత్వమే పరిష్కార మార్గం వెతకాలి.
వెంకటేశ్వర రావు, కార్యదర్శి, ఎపి యుటిఎఫ్‌

కక్ష తోనో, కసి తోనో ఉపాధ్యాయులు విద్యార్థులను దండించాలని అనుకోరు. ప్రభుత్వ పరంగా సదుపాయాలు, సిబ్బందిని కల్పించక పోవటం ఒక కారణం. రాష్ట్రంలో 1100 మండలాలు ఉంటే 800 మండలాలలో ఎంఇఓలు లేరు.
కె.నర్సింహా రెడ్డి, అధ్యక్షుడు, ఎస్‌టియు

ఆరేడు సంవత్సరాల క్రితం ఉపాధ్యాయుల వద్ద పనిష్‌మెంట్‌ రిజిస్టర్‌ కూడా ఉండేది. విద్యార్థులను ఎలా దండించాలి? ఎక్కడ కొట్టాలి? ఎలా కొట్టాలి వంటి వివరాలను ఉపాధ్యాయులకు తెలియజేసేవారు. అంటే దండించటం అనే దానికి చట్టబద్ధత అప్పట్లో ఉన్నట్లే కదా?
సుబ్బారెడ్డి, అధ్యక్షుడు, ఎపిటిఎఫ్‌ (1938)
ఈ పరిస్థితులకు సినిమా, మీడియా, మనం కారణం. మనం ప్రాసెస్‌ను ఎంజాయ్‌ చేయకుండా కేవలం రిజల్ట్‌ను మాత్రమే ఎంజాయ్‌ చేస్తున్నాం. సమస్యలకు ఇది ఒక కారణం.
వసతులు లేకపోవటం వల్లనే పిల్లలను కొడుతున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు అనటం ఒకరకంగా సోషల్‌ బ్లాక్‌ మెయిలింగ్‌తో సమానం.
ప్రస్తుతం ఎవరిని రోల్‌ మోడల్‌గా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే రోల్‌ మోడల్‌గా నిలవాలి.
సునీల్‌ కుమార్‌, నంది అవార్డు గ్రహీత, సొంత ఊరు చిత్ర దర్శకుడు

Saturday, October 9, 2010

Google Code in

Google announced Google Code-in, an open source development and outreach contest targeted at 13-18 year old students around the world.
Be sure to check out  Frequently Asked Questions about the contest for answers to your questions about participating.Google is hopes to get pre-university students from all over the world involved.  Google will announce the mentoring organizations that are participating on November 5. The contest starts on November 22, 2010!

Thursday, October 7, 2010

భాగ్యనగరంలో తగ్గుతున్న గాలి నాణ్యత

కాలుష్యం కోరల్లో భాగ్యనగరం  చిక్కుకొంది. రోజురోజుకూ తగ్గుతున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది.వాయు కాలుష్యం హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగిపోతున్నదని  సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరానిమెంట్‌ (సీఎస్‌ఈ)  పేర్కొంది. నగరంలోని వాయు నాణ్యతతోపాటు, రవాణ గణాంకాలను సీఎస్‌ఈ విశ్లేషించింది. చిన్నపాటి ధూళి కణాలు (పీఎం) ఎక్కువగా ఉన్నాయని గుర్తించింది.  కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం హైదరాబాద్‌లో వాయు నాణ్యత అధమ స్థాయికి చేరిందని సీఎస్‌ఈ పేర్కొంది. ''పాత నిబంధనల ప్రకారం నగరంలోని కొన్ని ప్రాంతాలు ఒక మోస్తరు స్థాయి కాలుష్య ప్రాంతాలుగా వర్గీకరించారు. మారిన నిబంధనల నేపథ్యంలో ఇవి తీవ్రమైన కాలుష్య ప్రాంతాలుగా మారిపోయాయి. తక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాలు అధిక కాలుష్య స్థాయికి చేరాయి'' అని నివేదిక వివరించింది. అక్టోబర్ 7 గురువారం నాడు  జరిగిన ఒక రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీఎస్‌ఈ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. 2003లో సరాసరి వార్షిక పీఎం10 స్థాయి 66 ఎంజీ/సీయూఎం మేర ఉండేది. 2009లో అది 80 ఎంజీ/సీయూఎంకు పెరిగిందని నివేదిక వెల్లడించింది. అత్యధిక కాలుష్య ప్రాంతంలో ఉండాల్సిన ప్రమాణం కన్నా ఇది 1.3 రెట్లు ఎక్కువని సీఎస్‌ఈ అసోసియేట్‌ డైరెక్టర్‌ అనుమితా రాయ్‌ చౌధరి తెలిపారు. ప్రస్తుతం నగరంలో 26లక్షల వాహనాలు ఉన్నాయి. ఏటా 2లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. దానితో నగరంలో సరాసరి ప్రయాణ వేగం కూడా తగ్గుతోందని చెప్పారు. 1981లో గంటకు 17 కిలోమీటర్ల మేర వేగం ఉండేదని, 2006లో అది 12 కిలోమీటర్లకు పడిపోయిందని వివరించారు. వాహనాల సంఖ్య పెరగడం వల్లే నగరంలో కాలుష్యం పెరుగుతోందని తెలిపారు.

200 కోట్ల ఏళ్ల క్రితం భూమ్మీద బిగ్‌బ్యాంగ్‌

200 కోట్ల ఏళ్ల క్రితం భూమ్మీద బిగ్‌బ్యాంగ్‌
బహుకణజీవులు పుట్టింది అప్పుడే
ఐర్లాండ్‌ శాస్త్రవేత్తల వెల్లడి
లండన్‌: మన శరీరం కొన్ని కోట్ల కణాల నిర్మితం. భూమ్మీదున్న అన్ని సంక్లిష్ట జీవరాశలదీ ఇదే తీరు. కోట్లకొద్ది కణాలు ఒక దానికొకటి కలిసి బహుకణ జీవుల ఆవిర్భావానికి అంకురార్పణ జరిగిందెప్పుడు? అసలు భూమ్మీద రెండు కణాలు కలిసిందెప్పుడు? ఈ మౌలిక ప్రశ్నకు ఐర్లాండ్‌ శాస్త్రవేత్తలు సమాధానం కనుక్కున్నారు. దాదాపు 200 కోట్ల ఏళ్ల క్రితం రెండు ఏకకణజీవులు కలిసి ఒకే కేంద్రకంతో కూడిన బహుకణజీవిగా ఏర్పడ్డాయని వారు అంచనా కట్టారు. విశ్వ ఆవిర్భావాన్ని సూచించే బిగ్‌బ్యాంగ్‌ మాదిరిగా దీన్ని 'ప్రకృతి బిగ్‌బ్యాంగ్‌' అని అభివర్ణిస్తున్నారు. ఐర్లాండ్‌ జాతీయ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ మెక్‌ఎల్‌నెర్నీ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం సంగర్‌ సంస్థకు చెందిన జేమ్స్‌ కాటన్‌తో కలిసి పదేళ్లపాటు పరిశోధించి ప్రకృతి బిగ్‌బ్యాంగ్‌ను కనుక్కున్నారు. వీరి ప్రతిపాదన ప్రకారం.. 200 కోట్ల ఏళ్ల క్రితం ఏకకణ బ్యాక్టీరియా, ఏకకణ ఆర్కియెన్‌ కలిసి ఒకే కేంద్రకమున్న ఈస్ట్‌కు (శిలీంధ్రం) జన్మనిచ్చాయి. దీన్నించే పరిణామక్రమంలో కీటకాలు, వృక్షాలు, జంతువులు ఉద్భవించాయి. మనిషి పుట్టిందీ ఈ క్రమంలోనే. ఈ సంక్లిష్ట బహుకణ జీవరాశులను 'యూకరైట్లు' అని శాస్త్రీయ పరిభాషలో పిలుస్తారు. ఈస్ట్‌ జన్యుక్రమం విశ్లేషణ ఆధారంగా నెర్నీ, కాటన్‌ల బృందం భూమ్మీద జరిగిన మొట్టమొదటి కేంద్రక సంలీనాన్ని గుర్తించింది. 'ఏ జీవజాతి డీఎన్‌ఏ సమాచారమైనా దాని కేంద్రకంలో ఉంటుంది. అసలు ఒక కేంద్రకం మొదటిసారిగా ఎలా ఏర్పడిందన్నది ఇప్పటివరకూ రహస్యంగానే ఉంది. ప్రస్తుతం మనకు ఆ విషయం తెలిసింది' అని మెక్‌ఎల్‌నెర్నీ చెప్పారు.

ఆర్కిటిక్‌ మంచుమాయం


ఆర్కిటిక్‌లో మంచు పొర తగ్గుతోంది. ఆర్కిటిక్‌ సముద్ర మంచు వేసవిలో కరుగుతుంది.  శీతాకాలంలో మళ్లీ పేరుకోవటం  సాధారణమే. అయినా, గత 30 ఏళ్లుగా ప్రమాదకర స్థాయిలో మంచు పొర తగ్గుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వేసవిలో మూడో అత్యల్ప స్థాయికి చేరింది. రాబోయే 20-30 ఏళ్లలో వేసవి సమయంలో ఆర్కిటిక్‌ మంచురహిత ప్రాంతంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో వేసవి సీజన్‌లో మంచు కరిగే ముప్పు పెరుగుతోందని కొలరాడోలోని జాతీయ మంచు గణాంక కేంద్రం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

Tuesday, October 5, 2010

రైలు ప్రమాద నిరోధక పరికరం సిద్ధం


పట్టాలపై ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఢీకొనకుండా నిరోధించే పరికరం సిద్ధమైందని  రైల్వేశాఖ మంత్రి మమతా బెనర్జీ తెలిపారు. త్వరలో దానిని అందుబాటులోకి తేనున్నామని మమతా బెనర్జీ తెలిపారు. దీంతోపాటు అత్యాధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థనూ ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. ఇవి రెండూ అందుబాటులోకి వస్తే రైలు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అక్టోబర్ 7 వ తేదీన ఆమె ఒక సమావేశంలో వెల్లడించారు.

Sunday, October 3, 2010

జాబిల్లిపైకి చైనా ఉపగ్రహం

చంద్రుడిపైకి చైనా మరో ఉపగ్రహాన్ని పంపింది. ఛాంగే-2 అనే ఈ ఉపగ్రహాన్ని సిచువన్‌ ప్రాంతంలోని జిచాంగ్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రంనుంచి ప్రయోగించారు. ఉపగ్రహం ప్రయోగించిన 20 నిమిషాల్లో కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఐదు రోజుల్లో చంద్రుని కక్ష్యా వేగాన్ని అందుకుంటుందన్నారు. ఉపగ్రహాన్ని 54.84 మీటర్ల పొడవు, 345 టన్నుల బరువున్న 3సీ రాకెట్‌తో ప్రయోగించినట్లు చెప్పారు. 2013లో చంద్రుడిపైకి మానవుడిని పంపాలని చైనా లక్ష్యంగా నిర్ణయించింది.

ప్రతి పంచాయతీలో 17 వేల మొక్కలు

మూడేళ్లలో 31 కోట్ల మొక్కల్ని నాటాలన్న లక్ష్యంతో, రూ.500 కోట్లతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్ని పచ్చగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధంచేసింది. మూడేళ్లలో ప్రతి గ్రామ పంచాయితీలో 17 వేల మొక్కలను నాటే కార్యక్రమం కార్యరూపం దాల్చబోతోంది. మొత్తంమీద 31 కోట్ల మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖలు చేపట్టబోతున్నాయి. రాష్ట్రంలోని 65 లక్షల హెక్టార్ల అడవుల్లో దాదాపు 30 లక్షల హెక్టార్లలో అడువులు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడి పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పచ్చని వనాలను పెంపొందించేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అటవీ శాఖకు రూ.500 కోట్లను కేటాయించారు.  మహాత్మాగాంధీ గ్రామీణ నర్సరీ  పేరిట ప్రతి మండలంలో నాలుగు నర్సరీల చొప్పున మొత్తం 4,604 నర్సరీలను ఏర్పాటుచేస్తారు.  ప్రతి నర్సరీలో 70 వేల నుంచి 80 వేల మొక్కల్ని పెంచుతారు. టేకు, నీలగిరి, వెదురు, నేరేడు, తుమ్మ, ఎర్రచందనం, ఉసిరి, కానుగ, వేప, సుబాబుల్‌ మొక్కలను పెంచుతారు. ప్రతి నర్సరీకి ఒక వనసేవక్‌, 20 నర్సరీలకు ఒక పోగ్రాం అసిస్టెంటెంట్‌లను నియమించనున్నారు. నిర్ణయించిన కొలతలతో గొయ్యి తీసి బంజరు భూముల్లో గానీ, రోడ్డు పక్కన గానీ మొక్కలు ఎవరు నాటినా ఉపాధి హామీ పథకం కింద నిధులను వీరికి అందజేయనున్నారు. చెరువుల పూడికతీతతో పాటు ఇతరత్రా ఉపాధి పనుల్లాగే దీన్ని కూడా ఉపాధి పథకంలోకి తీసుకువచ్చి మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మొక్కలు నాటాక వీటి సంరక్షణ బాధ్యతను డివిజనల్‌ ఫారెస్టు అధికారులతో పాటు జిల్లా నీటిపారుదల యాజమాన్య సంస్థ అధికారులు చేపడతారు.

క్రీడా సంబరం 'కామన్‌వెల్త్‌'

భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ చేతుల మీదుగా కామన్వెల్త్‌ క్రీడల ఆరంభ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ అద్భుత ఘట్టానికి ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం వేదికగా నిలిచింది. 28 ఏళ్ల కింద ఆసియా క్రీడలను నిర్వహించిన భారత్‌ ఇపుడు కామన్వెల్త్‌ క్రీడల ప్రారంభ వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించింది. ౩ అక్టోబరు సాయంత్రం వేళ జవహర్లాల్‌ నెహ్రూ స్టేడియంలో రూ.44 కోట్లతో ఏర్పాటుచేసిన బెలూన్‌ ఆకారపు ఏరోస్టాట్‌ తెరను ఆకాశంలోకి ఎత్తగానే ప్రాంగణమంతా స్వర్ణకాంతులు పరచుకున్నాయి.  కామన్‌వెల్త్‌ దేశాల అధినేత ఎలిజబెత్‌ రాణి తరఫున బ్రిటన్‌ యువరాజు ఛార్లెస్‌, భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ స్టేడియంలోని 60 వేలమంది ప్రేక్షకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఆరంభించారు. ఈ క్రీడల్ని బ్రిటిష్‌ రాణి ప్రారంభించకపోవడం గత 44 ఏళ్ల కాలంలో ఇదే మొదటిసారి. యువరాజు ఛార్లెస్‌, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఏకకాలంలో ఈ క్రీడల్ని ప్రారంభించాలన్న దౌత్యపరమైన ఒప్పందం మేరకు ఆదివారం ఒకే వేదికపై నుంచి ఇరువురూ క్రీడల ప్రారంభ సూచకంగా ప్రకటన చేశారు.
ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌, అంతర్జాతీయ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జాక్విస్‌ రోగ్‌, భారత్‌ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు సురేశ్‌ కల్మాడీ, వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. సంస్కృతి, ఆధునికత కలగలిసిన కార్యక్రమాలు 2 గంటలపాటు ప్రేక్షకుల్ని కట్టిపారేశాయి. 70 వేల కోట్ల రూపాయల ఈ మెగా కార్యక్రమం ఇది.  పన్నెండు రోజులపాటు జరిగే క్రీడా పండుగలో 71 దేశాలకు చెందిన ఏడువేల మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు.
1050 మంది పాఠశాల విద్యార్థుల నమస్తే నృత్య ప్రదర్శనను 23 భారతీయ భాషల్లో ఏరోస్టాట్‌లో ఆవిష్కరించారు. క్రీడాకారుల పెరేడ్‌ 71 మంది మహిళలతో ప్రారంభమైంది. అంతా చీరలు కట్టుకొని భారతీయతను, చీరల రంగుల్లో వారివారి దేశాల పతాకాలను ప్రతిబింబించారు. ఒలింపిక్‌ పతకాన్ని గెలుచుకున్న అభినవ్‌ బింద్రా సారథ్యంలో 619 మంది సభ్యుల భారత బృందం ప్రాంగణంలోకి వచ్చినపుడు కేరింతలు కొట్టారు.   71 దేశాల క్రీడాకారుల మార్చ్‌ సాగింది. హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ తార సైనా నెహ్వాల్‌, బాక్సింగ్‌ వీరుడువిజేందర్‌సింగ్‌, కుస్తీ యోధుడు సుశీల్‌ కుమార్‌లు బ్యాటన్‌ను మోసిన వారిలో ఉన్నారు. అనంతరం అన్ని దేశాల పతాకాలు ప్రాంగణంలోకి రాగా, భారత కెప్టెన్‌ బింద్రా ప్రమాణస్వీకారం చేశారు. 816 మంది ప్రదర్శనకారులు చేసిన సూర్య నమస్కారాలు, క్లిష్టమైన ఆసనాలు అలరించాయి.