Saturday, July 24, 2010

నీళ్ళుగా మారిన షర్బత్‌

స్టేజిపైన మెజీషియన్‌ ఒక గ్లాసులోని షర్బత్‌ను ఇంకో ఖాళీ గ్లాసులోని పోశాడు. ఆశ్చర్యం! షర్బత్‌ నీళ్ళుగా మారిపోయింది. అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు.
ఈ మేజిక్‌ చెయ్యడానికి రెండు గాజు గ్లాసులు, ఎర్రసిరా, చిటికెడు బ్లీచింగ్‌ పౌడరు కావాలి. మొదటి గ్లాసులో సగం వరకు ఎర్రసిరా కలిపిన నీళ్ళు పోసి ఉంచు. పది చుక్కల నీళ్ళల్లో చిటెకెడు బ్లీచింగ్‌ పౌడరు (ఇది మెడికల్‌ షాప్‌లో దొరుకుతుంది) కరిగించి రెండవ గ్లాసులో పోసి ఉంచు. పైకి చూడటానికి రెండవ గ్లాసు ఖాళీగా కనిపిస్తుంది. మొదటి గ్లాసులో ఉన్న సిరా నీళ్ళను చూపించి, అది కొత్త రకం రోజ్‌ షర్బత్‌ అని మీ స్నేహితులకు చెప్పు. వాళ్ళు చూస్తూ ఉండగా మంత్రం వేస్తున్నట్లు నటించి ఆ షర్బత్‌ను రెండవ గ్లాసులో పొయ్యి. అంతే రంగు మాయమై షర్బత్‌ నీళ్ళలా మారి పోతుంది.
ఈ రకమైన మేజిక్‌ మీలో చాలామంది చాలాసార్లు చేసే ఉంటారు. కాని అది మేజిక్‌ అని గమనించి ఉండరు. బట్టలకయిన సిరా మరకుల పోగొట్టడానికి ఇదే పద్ధతి అవలంబిస్తారు.
అయితే ఈ మేజిక్‌ ఎలా జరుగుతుంది? బ్లీచింగ్‌ పౌడర్‌లో 'క్లోరిన్‌' అనే ధాతువు ఉంది. నీటి అణువులలో ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ అనే పరమాణువులు ఉన్నాయి. క్లోరిన్‌ వెళ్ళి నీటిలో ఉన్న హైడ్రోజన్‌తో కలుస్తుంది. మిగిలిపోయిన ఆక్సిజన్‌ పరమాణువులు బహు చురుకైనవి. అవి వెళ్ళి రంగులతో కలిసి, వాటిని వెలిసి పోయేటట్లు చేస్తాయి. బ్లీచింగ్‌ పౌడర్‌ రంగు పోగొట్టింది అనడం కంటే ఆక్సిజన్‌ పరమాణువులు రంగు పోగొట్టాయనడం సబబుగా ఉంటుందేమో!
-- మహీధర నళినీ మోహన్‌