Sunday, July 11, 2010

500 కోట్లు దాటిన సెల్ కనెక్షన్లు

కూడు, గూడు, గుడ్డ...సెల్‌ఫోన్! అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. సెల్ ఫోన్ కనీస అవసరాల జాబితాలో చేరిపోయినట్లే అయింది.  ప్రపంచ జనాభా సుమారు 685 కోట్లు కాగా, సెల్‌ఫోన్ కనెక్షన్ల సంఖ్య 500 కోట్లను దాటింది. ఈ వారంలోనే కొత్త రికార్డు నమోదైనట్లు 'ఎల్ఎం ఎరిక్‌సన్ ఏబీ' సంస్థ పేర్కొంది.

సెల్ కనెక్షన్ల సంఖ్య కొన్నాళ్లకు జనాభాను మించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే.. రెండేసి ఫోన్లు వాడుతున్నవాళ్లు, ఒకే ఫోన్‌లో డ్యుయల్ సిమ్‌లు పెట్టుకున్న వాళ్లు భారీ సంఖ్యలోనే ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పేరు పొందిన భారత్, చైనాల్లోనే భారీ స్థాయిలో సెల్‌ఫోన్ల వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది.  మొబైల్ ఫోన్ల వినియోగంలో చైనా, భారత్‌ల మధ్య పోటీ నెలకొంది. వందకోట్లు దాటిన భారత జనాభాలో దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరికి సెల్ ఉంది. రెండు మూడు వేల రూపాయలకే సకల సౌకర్యాలున్న మొబైల్ సెట్స్ అందుబాటులోకి రావడం సెల్ విస్తరణకు మరో కారణమైంది.దేశంలో ఈ ఏడాది మార్చి నెలలోనే ఏకంగా రెండు కోట్ల సెల్ కనెక్షన్లు పెరగడం విశేషం. మొబైల్ కనెక్షన్లలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే.