Monday, July 12, 2010

పీఎస్‌ఎల్‌వీ సీ-15 ప్రయోగం విజయవంతం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 12 వ తేదీ ఉదయం చేపట్టిన  పీఎస్‌ఎల్‌వీ సీ -15 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతం అయ్యింది. మొదటి మూడు దశలను పూర్తి చేసిన పీఎస్‌ఎల్‌వీ నాలుగోదశలో సెకనుకు 7.5 కి.మీ. వేగంతో ప్రయాణించింది. అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసిన వాహకనౌక 5 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ వాహకనౌక 694 కిలోల బరువుగల కార్డోశాట్‌-2బి, 116 కిలోల బరువుగల అల్‌శాట్‌-ఏ, కెనడా, స్విట్జర్లాండ్‌లకు చెందిన రెండు ఉపగ్రహాలు , ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక విద్యార్థులు తయారు చేసిన స్టడ్‌ శాట్‌లను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.
పట్టణ ప్రణాళిక, రింగ్‌ రోడ్లు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కార్టోశాట్‌ దోహదపడుతుంది. ఇందులో అత్యాధునిక పాన్‌క్రొమాటిక్‌ కెమెరా ఉంది. 9.6 కిలోమీటర్ల ప్రాంతంలోని దృశ్యాలను 0.8 మీటర్ల రిజల్యూషన్‌తో చిత్రీకరించగలదు. గ్రామస్థాయిలో వనరుల అంచనా, సూక్ష్మ వాటర్‌షెడ్‌ అభివృద్ధి పథకాలు, పంటల పరిశీలన వంటివి దీనిద్వారా చేపట్టవచ్చు. ఇప్పటికే కక్ష్యలో కార్టోశాట్‌-2, కార్టోశాట్‌-2ఎలు ఉన్నాయి.
పీఎస్‌ఎల్‌వీ 'కోర్‌ ఎలోన్‌' వర్షన్‌ను ఈసారి ప్రయోగిస్తున్నారు. 44 మీటర్ల పొడవుండే ఈ వాహకనౌక.. పైకిలేచే సమయంలో 230 టన్నుల బరువును కలిగి ఉంటుంది. ఇప్పటి వరకూ ఇది 17 భారత, 22 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందులో భారత తొలి చంద్రమండల అన్వేషక ఉపగ్రహం చంద్రయాన్‌-1 కూడా ఉంది.