Thursday, July 8, 2010

గగనంలోకి సౌర విమానం


పేయెర్నె, స్విట్జర్లాండ్‌లో సౌర ఇంధనంతో నడిచే ప్రయోగాత్మక విమానం తొలిసారిగా గగనంలోకి ఎగిరింది. పశ్చిమ స్విట్జర్లాండులోని పేయెర్నె రన్‌వే నుంచి 8 జూలై 2010 వ తేదీ తెల్లవారు జామున ఈ విమానం గాల్లోకి లేచింది. గంటకు 35 కి.మీ. వేగంతో పయనించే ఈ విమానానికి ఆండ్రీ బోర్చ్‌బెర్గ్‌ ఏకైక పైలట్‌. ఇతరత్రా ఎలాంటి ఇంధనం సాయం లేకుండా విమాన ప్రయాణం చేయాలన్నదే తమ లక్ష్యమని బృంద నాయకుడు బెట్రండ్‌ పికార్డ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 
63 మీటర్ల పొడవైన రెక్కలతో విచిత్రంగా కనిపిస్తున్న ఈ విమానం పేరు హెచ్‌బీ-సియా. పూర్తిగా సౌరవిద్యుత్‌తో నడుస్తుంది.  రెక్కలపై అమర్చిన 12000 సోలార్ సెల్స్.. సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చి బ్యాటరీల్లో నిక్షిప్తం చేస్తాయి.

ప్రయోగాత్మకంగా.. రాత్రివేళల్లో కూడా బ్యాటరీల్లో నిల్వ వున్న విద్యుత్‌తో ఈ విమానాన్ని 25గంటలపాటు నిరంతరాయంగా నడిపేందుకు పిచర్డ్ బృందం సిద్ధమైంది. బుధవారం ఉదయం 4.51 నిమిషాలకు పేయెర్న్ ఎయిర్‌బేస్ నుంచి ఈ విమానం ప్రయాణం ప్రారంభించింది. నాలుగు మోటార్లు కలిగిన ఈ విమానం పొడవు 21.85 మీటర్లు, ఎత్తు 6.40 మీటర్లు, బరువు 1,600 కిలోలు. గరిష్ఠంగా 9100 మీటర్ల ఎత్తుకు చేరుకోగల ఈ విమానం గరిష్ఠ వేగం గంటకు 40.2కిలోమీటర్లు.