Saturday, July 3, 2010

నకిలీ మాత్రలు పట్టించు

కేంద్ర ఔషధాలు, ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో) ఇటీవల దేశవ్యాప్తంగా ఔషధాలు, సౌందర్య సాధనాల నమూనాలను సేకరించి నాణ్యతను పరిశోధించగా 8 శాతం మందులు నకిలీవి లేదా నిర్ణీత ప్రమాణాల్లో లేనివని తేలింది. దాంతో ఈ సంస్థ దేశవ్యాప్తంగా నకిలీ మందుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది.  ఆంధ్రప్రదేశ్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉండటంతో శంషాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేసింది. సీడీఎస్‌సీఓ ప్రాంతీయ పర్యవేక్షక అధికారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నకిలీ మందుల ఏరివేత జరుగుతుంది. ఇందులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నకిలీ మందుల్ని పట్టించే వారికి బహుమతుల పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏడుగురు ప్రభుత్వ శాఖల అధికారులు, ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కలిసి బహుమతులను నిర్ధరిస్తారు. సాధారణ ప్రజలకు సీజ్‌ చేసిన మందులు/వైద్య పరికరాల విలువలో 20 శాతాన్ని రివార్డుగా ఇస్తారు. గరిష్ఠ పరిమితి రూ.25 లక్షలు. ప్రభుత్వోద్యోగులకు గరిష్ఠ పరిమితి రూ.5 లక్షలు. ఉద్యోగి సర్వీసు కాలంలో రివార్డుల మొత్తం గరిష్ఠ పరిమితి రూ.30 లక్షలు. రివార్డు మొత్తాన్ని విడతల వారీగా ఇస్తారు. తొలివిడత 25% ఛార్జిషీటు దాఖలైన వెంటనే, మలివిడత 25% కోర్టులో సాక్ష్యాధారాలు నిరూపణ అయ్యాక, తుదివిడత 50%తీర్పు వచ్చాక ఇస్తారు.

ఎవరికి సమాచారం ఇవ్వాలి?
ఎ.సి.ఎస్‌.రావు, సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ సబ్‌జోనల్‌ కార్యాలయం, యూనిట్‌ నెం.18, రెండో అంతస్తు, కార్డో శాటిలైట్‌ బిల్డింగ్‌, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్‌

ఫోన్‌ నెంబర్లు: 91-40- 24008270, 24008236
మొబైల్‌ నెంబరు: 94401 15452, 96187 27439
ఫ్యాక్స్‌ : 040- 24008270
మెయిల్‌: adchyderabad@gmail.com