Saturday, July 31, 2010

శంకర్‌

పిల్లలంటే ఆయనకు ప్రేమ!
పిల్లలందరికీ అతనంటే ఇష్టం!
పిల్లలకోసం మొట్టమొదటిసారిగా పెయింటిగ్‌ పోటీలు పెట్టి దేశ విదేశాల పిల్లల మధ్య స్నేహం పెంపొందేలా చేసిన ఘను డాయన. పిల్లలకోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పిల్లల హృద యాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి ఆయన! ఆయనే 'శంకర్‌' గా అందరికి ఆప్తుడైన 'కేశవ శంకర్‌ పిళ్ళై'.
శంకర్‌ జులై 31, 1902 లో కాయంగుళం అనే చిన్న ఊరులో జన్మించారు. ఆయన చదువుకునే రోజుల్లోనే కార్టూన్లు వేసేవాడు. తన కార్టూన్లతో గాంధీ, జిన్నా, నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలగు ఎందరో నాయకుల వ్యంగ్య చిత్రాలు గీసి వారి చేత 'సెహబాష్‌ శంకర్‌' అనిపించుకున్న అద్భుత ప్రజ్ఞాశాలి ఆయన. శంకర్‌ ఎందరో నాయకుల తప్పులను వ్యంగ్య చిత్రాలుగా గీసి వారి తప్పును బయటపెట్టాడు. 1948 లో శంకర్స్‌ వీక్లిని ప్రారంభించి తన విజయకేతన మెగుర వేశాడు. అప్పట్లో 'శంకర్స్‌ వీక్లి' ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఒకవైపు పెద్దల అభిమానాన్ని పొందుతూనే మరోవైపు తన కిష్టమైన పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు.
పిల్లలకోసం అతడు 1965లో దేశ విదేశాల నుండి బొమ్మలను సేకరించి ఢిల్లీలో ఒక డాల్స్‌ మ్యూజియం ఏర్పాటు చేశాడు. ఈ మ్యూజియంలో దేశ దేశాలకు చెందిన దాదాపు అయిదువేల బొమ్మలు మనకు కనువిందు చేస్తాయి. అలాగే బాలల కోసం బాలల పుస్తకసంస్థ (సిబిటి), చిల్డ్రన్స్‌ వరల్డ్‌ అనే పిల్లల గ్రంథాలయాన్ని నెహ్రూ నివాసంలో ఈయన నెలకొల్పారు. ఇలా పిల్లలకోసం, పిల్లల మధ్య ఆనందంగా శంకర్‌ డిసెంబర్‌ 26న మరణించారు. శంకర్‌ ఇప్పుడులేకున్నా ఆయన పిల్లల హృదయాల్లో ఎప్పటికి సజీవంగా నవ్వుతూనే ఉంటారు. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికి సజీవంగా పిల్లల మనస్సుల్లో మెదులుతూనే ఉంటాయి.