Saturday, July 31, 2010

శంకర్‌

పిల్లలంటే ఆయనకు ప్రేమ!
పిల్లలందరికీ అతనంటే ఇష్టం!
పిల్లలకోసం మొట్టమొదటిసారిగా పెయింటిగ్‌ పోటీలు పెట్టి దేశ విదేశాల పిల్లల మధ్య స్నేహం పెంపొందేలా చేసిన ఘను డాయన. పిల్లలకోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పిల్లల హృద యాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి ఆయన! ఆయనే 'శంకర్‌' గా అందరికి ఆప్తుడైన 'కేశవ శంకర్‌ పిళ్ళై'.
శంకర్‌ జులై 31, 1902 లో కాయంగుళం అనే చిన్న ఊరులో జన్మించారు. ఆయన చదువుకునే రోజుల్లోనే కార్టూన్లు వేసేవాడు. తన కార్టూన్లతో గాంధీ, జిన్నా, నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలగు ఎందరో నాయకుల వ్యంగ్య చిత్రాలు గీసి వారి చేత 'సెహబాష్‌ శంకర్‌' అనిపించుకున్న అద్భుత ప్రజ్ఞాశాలి ఆయన. శంకర్‌ ఎందరో నాయకుల తప్పులను వ్యంగ్య చిత్రాలుగా గీసి వారి తప్పును బయటపెట్టాడు. 1948 లో శంకర్స్‌ వీక్లిని ప్రారంభించి తన విజయకేతన మెగుర వేశాడు. అప్పట్లో 'శంకర్స్‌ వీక్లి' ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఒకవైపు పెద్దల అభిమానాన్ని పొందుతూనే మరోవైపు తన కిష్టమైన పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు.
పిల్లలకోసం అతడు 1965లో దేశ విదేశాల నుండి బొమ్మలను సేకరించి ఢిల్లీలో ఒక డాల్స్‌ మ్యూజియం ఏర్పాటు చేశాడు. ఈ మ్యూజియంలో దేశ దేశాలకు చెందిన దాదాపు అయిదువేల బొమ్మలు మనకు కనువిందు చేస్తాయి. అలాగే బాలల కోసం బాలల పుస్తకసంస్థ (సిబిటి), చిల్డ్రన్స్‌ వరల్డ్‌ అనే పిల్లల గ్రంథాలయాన్ని నెహ్రూ నివాసంలో ఈయన నెలకొల్పారు. ఇలా పిల్లలకోసం, పిల్లల మధ్య ఆనందంగా శంకర్‌ డిసెంబర్‌ 26న మరణించారు. శంకర్‌ ఇప్పుడులేకున్నా ఆయన పిల్లల హృదయాల్లో ఎప్పటికి సజీవంగా నవ్వుతూనే ఉంటారు. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికి సజీవంగా పిల్లల మనస్సుల్లో మెదులుతూనే ఉంటాయి.

Wednesday, July 28, 2010

కంగారు

కంగారు!
ఇది ఆస్ట్రేలియా జంతువు.
1770 వరకు ఈ జంతువు విషయం ప్రపంచానికే తెలియదు. ఆస్ట్రేలియా అడవులకు వెళ్ళిన 'కెప్టెన్‌ కుక్‌' అనే అతను మీటరున్నర ఎత్తుకలిగి, అందంగా, గమ్మత్తుగా కనిపించిన ఒక జంతువును చూసి దాని పేరేమిటో కనుక్కోవాలి అనుకున్నాడు. అక్కడి ప్రజలకు ఆ జంతువును చూపించి 'దాని పేరేమిటి?' అని అడిగాడు. వారు తమ భాషలో ''నీకు ఎంతచెప్పినా ప్రయోజనం లేదు'' అనే అర్థం ఇచ్చే పదమైన ''కంగారు'' అని అన్నారు. ఆ జంతువు పేరే 'కంగారు' అనుకొని అతడు ఆపేరు పెట్టాడు. అప్పటినుండి 'కంగారు' పేరు ప్రచారంలోకి వచ్చింది.
ఇది ఆకర్షణీయమైన కళ్ళు, మెరిసే చిన్న ముక్కు, జింక మెడ వంటి మెడతో, చూసేవారిని ఇట్టే ఆకర్షిస్తుంది. 'కంగారు' మనిషికన్నా పొడవు ఎదుగుతుంది. ఇది దాదాపు మూడు వందల కిలోగ్రాముల బరువు ఉంటుంది. దీని బరువుకు తగ్గట్టు ఉండే తోక, 130 సెం.మీ. కంటే పొడవుగా ఉంటుంది. తోకే దీనికి గొప్ప ఆకర్షణ. ఈ తోక సహాయంతోనే ఇది కూర్చుంటుంది. కంగారు ముందు కాళ్ళు పొట్టిగాను, వెనుక కాళ్ళు పొడవుగాను బలంగాను ఉంటాయి. దీని పాదానికి నాలుగు వేళ్ళున్నప్పటికి, అందులో మూడు ఎదుగుదల లేక ముడుచుకుపోయి ఉంటాయి. ఒకే ఒక్కవేలు మాత్రం ఎదిగి పొడవుగా, బలంగా ఉంటుంది. కంగారులలో కూడా చాలా రకాలున్నాయి.

కంగారు జీవన విధానం, పెరుగుదల చిత్రంగా ఉంటుంది. మనిషికంటే ఎత్తుగా ఉండే ఈ జంతువు పుట్టినప్పుడు రెండు సెంటీ మీటర్లే ఉంటుంది. తల్లి శరీరంలో ఉన్న ప్రత్యేక అవయవం పిల్లలకు పాలు తాగించడంలో సాయపడుతుంది.
కంగారు శాకాహారి. ఉదయం వేళల్లోనే ఇవి గడ్డి మేస్తాయి. సాయంత్రం విశ్రాంతి తీసుకోవడమో లేక గుంపులుగా కలిసి ఆడుకోవడమో చేస్తాయి. అప్పుడప్పుడు సాయంత్రం కూడా గడ్డి మేస్తాయి. కంగారు ఒక్క అంగలో ఇరవై ఎనిమిది మీటర్ల దూరం వరకు గెంతగలుగుతుంది. అలాగే గంటకు సుమారు అరవై కిలో మీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. ఆడ కంగారు కడుపు వెనుక, కాళ్ళకు మధ్య ఒక సంచి ఉంటుంది. కంగారు పిల్లలు పెద్దవయ్యే వరకు ఈ సంచిలోనే ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలున్న కంగారు అంటే ఆస్ట్రేలియా ప్రజలకు చాలా ప్రేమ. అందుకే వారిని 'కంగారూన్‌' అని పిలుస్తుంటారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం 'కంగారు'ను జాతీయ జంతువుగా ప్రకటించింది.

నక్క-ముతాయిరాజు

చాలాకాలం క్రితం చైనాలో ముతాయి అనే ఒక పేదరైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న గుడిసె, కొద్దిపాటి పొలం మాత్రం ఉండేది. అతని పొలంలో ఒక దానిమ్మ చెట్టు ఉండేది. ఆ చెట్టు విరగ కాసినప్పుడు అతను సంతోషంతో గంతులు వేసేవాడు.
ఒకసారి అతని దానిమ్మచెట్టు బాగా కాసింది. ముతాయి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. అయితే అతని సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. రోజూ రెండు దానిమ్మ పండ్లు చెట్టునుంచి మాయమవసాగాయి. ముతాయికి ఏమీ అంతు పట్టలేదు. ఎలాగయినా సరే దానిమ్మ పళ్ళని ఎవరు కాజేస్తున్నారో తెలుసు కోవాలనుకున్నాడు. అందుకే రాత్రంతా మేలుకొని చెట్టు వైపే చూస్తూ కూర్చున్నాడు. దొంగను పట్టుకోవాలనుకున్నాడు. మరునాడు ఆ చెట్టు చుట్టూ జిగురు చల్లాడు. మామూలుగా పళ్ళను దొంగలించడానికి వచ్చిన నక్క కాళ్ళు జిగురుకు అతుక్కు పోయాయి. తనను చంపవద్దనీ, తనను వదిలేస్తే, అతనికి ఒక రాజకుమార్తెతో వివాహం జరిగేటట్లు చూస్తాననీ నక్క బతిమాలింది. ఒక వారం రోజుల్లో మాట నిలబెట్టుకోవాలని హెచ్చరించి ముతాయి నక్కను వదిలి పెట్టాడు.
 తరవాత ఆ నక్క ఒక చక్రవర్తి ధనాగారంలో జొరబడి కొన్ని ముత్యాలను దొంగిలించింది. మరునాడు ఆ చక్రవర్తి సభకు వెళ్ళింది. తను ముతాయి చక్రవర్తి బంటునని, ఆయన దగ్గర లెక్క లేనన్ని మణి మాణిక్యాలున్నాయని, వాటిని  వేరుచేయడానికి ఒక జల్లెడ కావాలని అడిగింది. చక్రవర్తి దానికి ఒక జల్లెడ ఇచ్చాడు. రెండు రోజుల తర్వాత నక్క తిరిగి చక్రవర్తి సభకు వెళ్ళింది. జల్లెడతో పని అయిపోయిందని చెబుతూ జల్లెడను, సభలో నేలమీద పెడుతూ, ఎనిమిది ముత్యాలను కావాలని వదిలేసింది. రాజసేవకులు జల్లెడను చక్రవర్తి చేతికి ఇచ్చినపుడు అందులో ఉన్న ఎనిమిది ముత్యాలు చక్రవర్తి ఒడిలో పడ్డాయి. ఆ ముత్యాలను చూసి  చక్రవర్తి ఆశ్చర్యపడ్డాడు. ముతాయి చక్రవర్తి వద్ద ఇలాంటి ముత్యాలు, రత్నాలు, మణులు లెక్కలేనన్ని ఉన్నాయని, జల్లెడలో ఉండి పోయిన ముత్యాలు చాలా చిన్నవి కావడం వల్ల వాటిని తను పట్టించుకోలేదని చక్రవర్తి ముందు నక్క దర్పం ఒలకబోసింది. ఆ ముత్యాలను చక్రవర్తికి కానుకగా ఇచ్చేసింది.
చక్రవర్తి నక్కను పక్కకు తీసుకువెళ్ళి రహస్యంగా మాట్లాడాడు. ''నేను ముసలి వాణ్ణయి పోతున్నాను. నా కూతురుకి ఇంకా పెళ్ళి కాలేదు. అదొక్కటే నా విచారం. నువ్వు మధ్యవర్తిగా ఉండి నా కూతురుకీ మీ ముతాయి చక్రవర్తికీ పెళ్ళి జరిపించు'' అన్నాడు. నక్క సంతోషంతో ఒప్పుకుంది. చక్రవర్తి కూతురుకి తమ ముతాయి చక్రవర్తి సరియైన జోడి అనీ, పెళ్ళి తప్పక కుదురుస్తాననీ చెప్పింది. అంతే కాదు ఒక వారం లోపలే తను వచ్చి వివాహ వేడుకలలో స్వయంగా పాల్గొంటానని చెప్పి వెళ్ళిపోయింది.
నక్క తెచ్చిన వార్త విని ముతాయి సంతోషంతో తలమునకల య్యాడు. వెంటనే విచారం కూడా అతన్ని ఆవరించింది. అతని దగ్గర రాజకుమార్తెకు ఇవ్వడానికి ఏ విలువైన కానుకలు లేవు. కనీసం పెళ్ళినాడు వేసుకోవడానికి కొత్త బట్టలైనా లేవు. చివరికి మంచి చెప్పులు కూడా లేవు. అయితే నక్క అతనికి ధైర్యం చెప్పింది. అంతా సవ్యంగా జరిగిపోతుందని ఒక వారం రోజులలోగా పెళ్ళికి వెళ్ళడానికి తయారుగా ఉండమనీ చెప్పి వెళ్ళిపోయింది.
వారం రోజుల తర్వాత నక్క ఒక కంబళి తీసుకుని ముతాయి దగ్గరికి వచ్చింది. ముతాయీ, నక్కా పెళ్ళికి బయలుదేరారు. చక్రవర్తి నగరం దగ్గరకు రాగానే నక్క, ముతాయిని అక్కడే ఉన్న ఒక సరస్సులో దూకమంది. నక్క చెప్పినట్లుగా ముతాయి సరస్సులో దూకాడు. చలిలో గజగజ వణుకుతూ ముతాయి సరస్సులోనుంచి బయటకు రాగానే, నక్క అతని చిరిగిన దుస్తులను విప్పించి దూరంగా విసిరేసి తను తెచ్చిన కంబళి అతని ఒంటిమీద కప్పింది. తరవాత ఇద్దరూ రాజధానికి వెళ్ళారు.

రాజసభలో కంబళి కప్పుకొని చలికి వణుకుతూ నిలుచుని ఉన్న ముతాయిని చూపిస్తూ ''మహారాజా, నేను, ముతాయి చక్రవర్తిని తీసుకు వచ్చాను.'' అని నక్క చక్రవర్తికి చెప్పింది. ''మాకు మార్గంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, పట్టుబట్టలు, విలువైన నగలు, వెలలేని మణులు నలభై ఒంటెలమీద పెట్టుకుని మేము పెళ్ళికి బయలుదేరాము. మీ నగరం అవతల ఉన్న నది మీద వంతెన దాటుతుంటే, మా ఒంటెల బరువుకు ఆ వంతెన కూలి అందరం నదిలో పడిపోయార. మా సామానులు, ఒంటెలు నదిలో కొట్టుకు పోయాయి. మేము మాత్రం ఎలాగో ప్రాణాలతో బయట పడ్డాం'' అంది.
నలభై ఒంటెల మీద విలువైన సామానులు నింపుకు వచ్చామని నక్క చెప్పిన వార్త చక్రవర్తిని తబ్బిబ్బు చేసింది. వెంటనే అతను దర్జీ వాళ్ళను పిలిపించి, ముతాయికి రాచఠీవికి తగినట్లు దుస్తులు కుట్టమని ఆదేశించాడు. ఆ రోజు సాయంత్రమే ముతాయికి, చక్రవర్తి కూతురుకి వైభవంగా పెళ్ళి జరిగిపోయింది. అంత సంతోషంలోనూ ముతాయి గుండెల్లో పుట్టెడు దిగులు నిండి ఉంది. చుట్టూ ఎవరూ లేకుండా చూసి నక్కతో తన బాధను చెప్పుకున్నాడు.
''పెళ్ళి చేసుకోవడం, అందరి చేతా చక్రవర్తి అనిపించుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ నా భార్య నా యింటికి వచ్చి నా పేదరికాన్ని చూసినప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు'' అన్నాడు.
నక్క అతని భయాలను కొట్టిపారేసి, అతనికి ధైర్యం చెప్పింది. మరునాడు విందు ముగిశాక, ముతాయి భార్యతో తన యింటికి బయలుదేరాడు. వారివెంట గుర్రాలు, గాడిదలు, బళ్ళు ఎన్నో ఉన్నాయి. ముతాయికి భయంతో ముచ్చెమటలు పోశాయి. సలహా కోసం నక్కను పిలిచాడు. కానీ నక్క ఎక్కడా కనిపించలేదు.

నక్క, ముతాయి బృందం కంటే చాలా ముందుగా పరిగెత్తుతూ వెళ్ళిపోయింది.అలా వెళ్ళిన నక్క ముప్పయి ఒంటెలమీద సామానులు వేసుకుని వస్తున్న వ్యాపారస్తుల బృందం ముందు ఆగింది. కళ్ళనిండా భయం నింపుకుని, ముతాయి బృందం వస్తున్న దిక్కుకేసి చూపిస్తూ-
''అటునుండి ఒక పెద్ద దొంగల ముఠా వస్తోంది. మీరు వెనక్కి తిరిగి పారిపోతే తప్ప మీ ప్రాణాలు మీకు దక్కవు'' అంది.
వ్యాపారస్తులు నక్క చూపించినవైపు చూశారు. గుర్రాల సకిలింపులు వినిపించాయి. గుర్రాల పరుగు వల్ల గాలిలో లేచిన ధూళి వారికి కనిపించింది. ఆ దొంగల ముఠానుంచి తప్పించుకొని పారిపోవడం సాధ్యం కాదని వారికి తెలిసిపోయింది. తమను ఎలాగయినా కాపాడమని నక్కను బతిమాలారు.
''మీరు ప్రాణాలతో బయటపడాలంటే ఒకే మార్గముంది. ఆ దొంగల గుంపు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ తలలు వంచుకుని, 'మేమంతా ముతాయి చక్రవర్తి సేవకులం' అనాలి. - అని నక్క వ్యాపారస్తులకు సలహా ఇచ్చింది. వాళ్ళు అలాగే అన్నారు. వ్యాపారస్తులు తనను చూసి 'మేమంతా ముతాయి చక్రవర్తి సేవకులం' అనడం ముతాయికి ఆశ్చర్యం కలిగించింది.

తరవాత నక్క ముందుకు పరుగెత్తి పశువుల కాపరులను కలుసుకుంది. దూసుకు వస్తున్న దొంగల గుంపు గురించి చెప్పింది. వాళ్ళు భయంతో గజగజ వణికిపోయారు. తమను కాపాడమని నక్కను వేడుకున్నారు. ''మీరు బతికి ఉండాలంటే ఒకటే ఉపాయముంది. ఆ దొంగల గుంపు మీ దగ్గరకు రాగానే 'మేమేంతా ముతాయి చక్రవర్తి గుర్రాలను, పశువులను కాస్తున్నాం' అని అరవండి. మీ ప్రాణాలకు ఢోకా ఉండదు.'' అంది. ముతాయి బృందం దగ్గరకు రాగానే వాళ్ళంతా నక్క చెప్పినట్టుగానే అరిచారు. ఇలా ముతాయి బృందం ముందుకు సాగుతున్నంత సేపు రైతులు, వ్యాపారస్తులు, బిచ్చగాళ్ళు ముతాయి చక్రవర్తికి జయజయ ధ్వానాలు పలికారు.

పాపం! రోజంతా పరిగెత్తిన నక్క ఆయాసంతో రొప్పుతోంది. అలా రొప్పుతున్న నక్కకు ముతాయి ఇంటికి సమీపంలోనే ఒక పర్వతంలో మలచబడిన రాజ భవనం కపిపించింది. ఆ రాజ భవనం ఒక దయ్యానిది. ఆ కాపలా భటులకు టోకరావేసి నక్క, ఆ దయ్యం పడుకునే గదిలోకి దూరింది. దయ్యం ఉన్న పరుపు మీదకు ఒక్క గెంతులో దూకి దయ్యాన్ని నేలపైకి లాగి వేసింది.
''దయ్యపు రాజా! నీ ప్రాణాల మీదకు ముంచుకు వచ్చింది. నీ భవనం బయట వందల మంది దొంగలు ఉన్నారు. వాళ్ళంతా గోడలు పగలగొట్టుకొని లోపలికి వస్తున్నారు. నిన్ను చంపి తీరు తామని వాళ్ళు శపథం పట్టారు. నువ్వు బతికి బయటపడాలంటే నీ పొయ్యి వెనుక గూటిలో దాక్కో'' అంది నక్క.
దయ్యం ఎలాగో పొగ గూటిలో ఇరుక్కుని కూచుంది. వెంటనే  నక్క పొయ్యి నిండా కట్టెలు పెట్టి పెద్ద మంట వేసింది. ఆ మంటలు దయ్యాన్ని కాల్చి వేయసాగాయి. తనను కాపాడమని దయ్యం బొబ్బలు పెట్టింది. నక్క ఆ పెడబొబ్బలు పట్టించుకోకుండా మంటను ఇంకా ఎక్కువ చేసింది. చివరికి ఆ దయ్యం మంటల్లో కాలిపోయి బూడిద అయింది. నక్క, బూడిద అయిన దయ్యాన్ని కిటికీలోంచి అవతలికి విసిరి వేసింది.
తరవాత నక్క, బయటికి వచ్చి దయ్యం చచ్చిపోయిందని, కొద్ది సేపట్లోనే కొత్త చక్రవర్తి వస్తున్నాడని కాపలా వాళ్ళతో చెప్పింది. రాజభవనం సేవకులందరు, రెండు వైపులా బారులు తీర్చి నిలబడి ముతాయి చక్రవర్తికి స్వాగతం చెప్పారు. ముతాయి, దయ్యపు రాజ్యానికి కొత్త చక్రవర్తి అయినాడు. నక్కను తన ముఖ్యమంత్రిగా చేసుకున్నాడు. ముతాయి చక్రవర్తి ప్రజలను కన్నబిడ్డల వలె పాలిస్తూ అందరిచేత మంచి అనిపించు కున్నాడు. ముతాయి చక్రవర్తి నక్కను అడగకుండా ఏ నిర్ణయం తీసుకునేవాడు కాదు.
పది సంవత్సరాల తరవాత నక్క చచ్చి పోయింది. ముతాయి చక్రవర్తి, తన ఆప్త మిత్రుడి జ్ఞాపకాలు ఎప్పటికి నిలిచిపోవాలనే ఉద్దేశంతో నక్క వెంట్రుకలతో ఒక టోపి తయారు చేయించాడు. ఆ టోపి ప్రజలందరికీ నచ్చింది. అందుకే ఇప్పటికీ అక్కడి ప్రజలు, నక్క చనిపోగానే దాని బొచ్చుతో టోపి తయారు చేస్తారు.
-సురేశ్‌ ఆత్మరామ్‌

Saturday, July 24, 2010

చిట్టెలుక

ఒక చిన్న ఎలుక బయట ప్రపంచం ఎలా ఉంటుందో ఒకసారి చూసి వద్దామని సరదాగా బయటికి వెళ్ళి తిరిగి తిరిగి తన తల్లి దగ్గరికి వచ్చి సంతోషంగా తను చూసిన విశేషాలు చెప్పటం ప్రారంభించింది.
'అమ్మా! అమ్మా! ఈ ప్రపంచం ఎంత సుందరంగా ఉందో' అంది ఆనందంగా చప్పట్లు చరుస్తూ.
బిడ్డ ఆనందానికి తల్లి ఎలుక సంతోషిస్తూ - 'ఇంతకీ ఏమేం చూశావ్‌' అంది.
'మరేమో, నేను రెండు జంతువుల్ని చూశాను. అందులో ఒకటి భయంకరంగా ఉంది. రెండోదేమో చాలా చక్కగా ఉంది' అంది.
'ఇంతకీ అవి ఎలా ఉన్నాయో చెప్పు' అంది తల్లి ఎలుక.
'ఒకదానికి నల్లని కాళ్ళు, తలపై ఎర్రటి కుచ్చు, వాడిగా ఉండే ముక్కు ఉన్నాయి. శరీరమంతా ఈకలతో నిండి ఉంది. నేను దగ్గరికి వెళ్ళగానే గట్టిగా అరిచింది. నాకు భయమేసి పరుగెత్తుకొచ్చా' అంది.
'అది కోడిపుంజు, దాన్ని చూసి భయపడనవసరం లేదు. మరి రెండవది ఎలా ఉంది?' అని ప్రశ్నించింది తల్లి.
'రెండో జంతువుకి తెల్లమెడ, మెత్తని పాదాలు ఉన్నాయి. శరీరమంతా దూదిలా ఉంది. ముక్కుపైన మీసాల్లాంటి వెంట్రుక లున్నాయి. అది నావైపే తేరిపార చూసింది. అబ్బా అది ఎంత బాగుందో' అని చెప్పింది.
అది విని వెంటనే తల్లి ఎలుక కంగారు పడుతూ-
'ఓసి వెర్రిదానా! అది పిల్లి. అదే మన శత్రువు. ఎప్పుడైనా ఆకారాన్ని బట్టి మంచిది. చెడ్డది అని నిర్ణయించుకోవద్దు తెలిసిందా. ఇంకా నయం అది నిన్ను తినలేదు' అంటూ అక్కున చేర్చుకుంది అమాయకపు చిట్టి ఎలుకను.
--  లియో టాల్‌స్టాయ్‌ కథ.

నీళ్ళుగా మారిన షర్బత్‌

స్టేజిపైన మెజీషియన్‌ ఒక గ్లాసులోని షర్బత్‌ను ఇంకో ఖాళీ గ్లాసులోని పోశాడు. ఆశ్చర్యం! షర్బత్‌ నీళ్ళుగా మారిపోయింది. అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు.
ఈ మేజిక్‌ చెయ్యడానికి రెండు గాజు గ్లాసులు, ఎర్రసిరా, చిటికెడు బ్లీచింగ్‌ పౌడరు కావాలి. మొదటి గ్లాసులో సగం వరకు ఎర్రసిరా కలిపిన నీళ్ళు పోసి ఉంచు. పది చుక్కల నీళ్ళల్లో చిటెకెడు బ్లీచింగ్‌ పౌడరు (ఇది మెడికల్‌ షాప్‌లో దొరుకుతుంది) కరిగించి రెండవ గ్లాసులో పోసి ఉంచు. పైకి చూడటానికి రెండవ గ్లాసు ఖాళీగా కనిపిస్తుంది. మొదటి గ్లాసులో ఉన్న సిరా నీళ్ళను చూపించి, అది కొత్త రకం రోజ్‌ షర్బత్‌ అని మీ స్నేహితులకు చెప్పు. వాళ్ళు చూస్తూ ఉండగా మంత్రం వేస్తున్నట్లు నటించి ఆ షర్బత్‌ను రెండవ గ్లాసులో పొయ్యి. అంతే రంగు మాయమై షర్బత్‌ నీళ్ళలా మారి పోతుంది.
ఈ రకమైన మేజిక్‌ మీలో చాలామంది చాలాసార్లు చేసే ఉంటారు. కాని అది మేజిక్‌ అని గమనించి ఉండరు. బట్టలకయిన సిరా మరకుల పోగొట్టడానికి ఇదే పద్ధతి అవలంబిస్తారు.
అయితే ఈ మేజిక్‌ ఎలా జరుగుతుంది? బ్లీచింగ్‌ పౌడర్‌లో 'క్లోరిన్‌' అనే ధాతువు ఉంది. నీటి అణువులలో ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ అనే పరమాణువులు ఉన్నాయి. క్లోరిన్‌ వెళ్ళి నీటిలో ఉన్న హైడ్రోజన్‌తో కలుస్తుంది. మిగిలిపోయిన ఆక్సిజన్‌ పరమాణువులు బహు చురుకైనవి. అవి వెళ్ళి రంగులతో కలిసి, వాటిని వెలిసి పోయేటట్లు చేస్తాయి. బ్లీచింగ్‌ పౌడర్‌ రంగు పోగొట్టింది అనడం కంటే ఆక్సిజన్‌ పరమాణువులు రంగు పోగొట్టాయనడం సబబుగా ఉంటుందేమో!
-- మహీధర నళినీ మోహన్‌

సాహస వనిత దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌

''తమపై తమకు నమ్మకమున్న కొందరు వ్యక్తుల చరిత్రే, ఆ దేశ చరిత్ర అవుతుంది'' అని స్వామి వివేకానంద ఒక సందర్భంలో చెప్పారు. ఆ కోవకు చెందిన వ్యక్తి దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌.
దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఒక ఆదర్శ వనిత. స్వాతంత్య్ర సమర యోధురాలు. ఆమె జీవిత కాలం ఒక ఉత్తేజపూరితమైన వనితగా జీవించారు. ఇప్పటికీ ఆమె జీవితం యువతరాన్ని ఉత్తేజపరుస్తూనే ఉంది. బాల్యంలో ఆమె పేరు దుర్గ. పెద్దయ్యాక దుర్గాబాయమ్మ గాను, వివాహం జరిగిన తర్వాత దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ గాను మారింది. చిన్ననాట దుర్గ బాగా అల్లరి చేసేది. ఆటపాటలందు శ్రద్ధ చూపేది. చేసే ప్రతి పని లోను పట్టుదల చూపేది. పని పూర్తయ్యే వరకు ఆ పని కొనసాగించేది. అదే శ్రద్ధ, అదే పట్టుదల ఆమె జీవితాంతం కొనసాగించారు. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను ఆమె పొందారు. భారత మహిళకు ఆమె ఒక గుర్తింపు కల్పించారు. ఉపాధి అవకాశాలను కల్పించారు. వ్యక్తిత్వం కల్పించారు. అంతటి ప్రతిభాశాలి ఆమె. 
'సాహస వనిత దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌' పుస్తకం ఆమె జీవితాన్ని సంక్షిప్తంగా మన ముందు ఆవిష్కరిస్తుంది. తేలికయిన భాష, మృదువైన రీతిలో వ్రాసిన ఈ పుస్తకం ఆ మహోన్నత వనిత జీవితగాధను మన ముందుంచుతుంది.
మాదిరాజు గోవర్థన రావు సాధారణ ప్రజానీకానికి, ముఖ్యంగా పిల్లల కోసం అనేక పుస్తకాలను రచించారు. 'సాహస వనిత దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌' పుస్తకాన్ని ఆయన కేవలం పిల్లల కోసమే రచించారు.
ఈ పుస్తకాన్ని పబ్లికేషన్స్‌ డివిజన్‌, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురించింది. పుస్తకం వెల 70 రూపాయలు.

Thursday, July 22, 2010

అతడే అతడే చాచా నెహ్రూ!

ఎదపై ఎర్రని గులాబి పువ్వు
పెదవుల చెరగని చిరునవ్వు
ఆ మహనీయుడు ఎవరనుకున్నావు?
అతడే అతడే చాచా నెహ్రూ!
చాచానెహ్రూ చేతుల లోనిది
శాంతికి చిహ్నం తెల్లపావురం!
ప్రపంచ శాంతికి ...... శ్రమించిన
మన నెహ్రూజి మహామనీషి!
సమతా మమతా పెంచెను మనలో
చాచా లక్ష్యం దేశాభ్యుదయం
ఔన్నత్యంలో హిమగిరి అతడు
చిన్నారులకూ నేస్తం అతడు
కులం మతం అను కుటీలత్వాన్నీ
తొలగించాడీ 'భారతరత్న'!
ఆ మహనీయుడు ఎవరనుకున్నావు
అతడే అతడే మన చాచాజీ!
'చాచా చెప్పిన మాటలు మరువం,
తూచా తప్పక పాటిస్తాం' అని
మన నెహ్రూజి పుట్టిన రోజున
మనమందరమూ ప్రతినలు చేద్దాం!
-ఈదుపల్లి వెంకటేశ్వరరావు

ఆర్కిటిక్‌లో మంచు మాయం

వాతావరణ మార్పుల వల్ల 2050 నాటికి ఆర్కిటిక్‌ సముద్రంలో మంచు ఇక  కనిపించదని రష్యా నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.  ''మరో 30-40 ఏళ్లలో ఉత్తర ధ్రువం సహా ఆర్కిటిక్‌ సముద్రవ్యాప్తంగా వేసవికాలంలో మంచు జాడలు కనిపించకపోవచ్చు'' అని రష్యా వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ ఫ్లోరోవ్‌ తెలిపారు. వాతావరణ మార్పులపై ప్రభుత్వ నివేదికను ఆయన ఉటంకిస్తూ 2007 సమాచారంతో పోలిస్తే 2010లో మంచు పరిమాణం తగ్గిందని అన్నారు. ''మంచు సగటు స్థాయి తగ్గుతోంది. గతంలో 11 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆవరించి ఉన్న మంచు ప్రస్తుతం 10.8 మిలియన్‌ చదరపు కిలోమీటర్లకు తగ్గింది. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం తేలింది'' అని తెలిపారు.

Tuesday, July 20, 2010

ప్రాచీన మానవుడి ఆధారాలు

'మంచుయుగంలోనూ మనిషి బతికాడు' అనేందుకు ఆధారాలు లభించాయి.మానవుడు తీవ్రస్థాయి ప్రతికూల వాతావరణంలోనూ మనుగడ సాగించాడని తాజా అధ్యయనం వెల్లడించింది. మంచుయుగంలో ఉండే అతి  శీతల వాతావరణాన్ని తట్టుకుని మనిషి జీవించాడని గుర్తించారు. ఆఫ్రికా దక్షిణ కోస్తా ప్రాంతంలోని  గార్డెన్‌ ఆఫ్‌ ఈడెన్‌ లో భూమి తేలిన ప్రాంతంలో ప్రాచీన మానవుడి అవశేషాలు లభ్యమయ్యాయి. దక్షిణాఫ్రికా నగరం కేప్‌టౌన్‌కు 240 మైళ్ల దూరంలోని సంచారం లేని గుహల్లో ప్రాచీన మానవుడికి సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. మంచుయుగం కాలంలో అదొక నివాస ప్రాంతం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

Sunday, July 18, 2010

అఖిల భారత ఫోటోగ్రఫీ పోటీ

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ, ఎన్‌సిఇఆర్‌టి అఖిల భారత ఫోటోగ్రఫీ పోటీలను బాలల కోసం నిర్వహిస్తోంది. 12 నుంచి 18 సంవత్సరాల వయస్సులో వున్న బాలలు ఈ పోటీలలో పాల్గొనవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఎవరైన పోటీల్లో పాల్గొనేందుకు అర్హులే.
పోటీలకు పంపిన అన్ని ఫోటోలను సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు. ఉత్తమంగా ఉన్న 100 ఎంట్రీలకు మెరిట్‌ సర్టిఫికెట్‌ను ఇస్తారు.
ఎంట్రీలను పంపించేందుకు చివరి తేదీ 30 సెప్టెంబర్‌ 2010. పోటీలలో పాల్గొనేందుకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఎంట్రీలను పంపించవలసిన చిరునామా:
జాయింట్‌ డైరెక్టర్‌
సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ,
ఎన్‌సిఇఆర్‌టి
చాచా నెహ్రూ భవన్‌, శ్రీ అరబిందో మార్గ్‌
న్యూ ఢిల్లీ 110 016

Saturday, July 17, 2010

మన పిల్లల పాటలు

డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్య సంపాదకుడుగా వెలువడిన పిల్లల జానపద గేయ సర్వస్వం ఈ పుస్తకం. తెలుగు వారి సంస్కృతి విజయ పరంపరకు నిదర్శనమైన ....
  • తెలుగు పిల్లలు పాడుకుని ఆనందించే పండుగ పాటలు, ఆటల పాటలు, ఎగతాళి పాటలు, వినోద గేయాలు
  • పిల్లలలో పద సంపదను పెంచే తొక్కు పల్కులు
  • అభినయ ప్రధానమై, ఆసక్తి కలిగించే నవ రసాల గేయ కథలు
  • సంప్రదాయమైన జోల పాటలు, లాలి పాటలు, ఊయల పాటలు
  • తెలుగు పలుకుబడిని పెంచే సామెతలు
  • అవగాహనా శక్తిని, చురుకుదనాన్ని పెంచే పొడుపు కథలు
'మన పిల్లల పాటలు' పుస్తకంలో ఉన్నాయి. పిల్లలు తమ బాల్యాన్ని ఆనందించేందుకే ఈ గేయ విపంచి.
డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్య తెలుగు బాలల రచయితల సంఘ ప్రధాన కార్యదర్శిగా దాదాపు నలభై సంవత్సరాల పాటు సాహితీ లోకానికి సేవలను అందించారు.
పుస్తకం వెల: 130 రూపాయలు.
కాపీలకు :
డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్య
4-22-27, ఐతానగరం
తెనాలి 522 201

Friday, July 16, 2010

కంప్యూటర్‌ గేమ్స్‌

కంప్యూటర్‌లో ఆటలు ఆడటం ఇపుడు సాధారణమై పోయింది. పట్టణాలు, నగరాల్లో పిల్లలు బయట ఆటల కంటే ఎక్కువ సేపు కంప్యూటర్‌లో ఆటలు ఆడేందుకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇది అంత మంచిది కాదు. కంప్యూటర్‌లో ఎక్కువ సేపు ఆటలు ఆడటం వలన మున్ముందు పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లలూ - జాగ్రత్త పడండి. కంప్యూటర్‌తో ఆటలు ఆడండి. కానీ కేవలం కొద్ది సమయం మాత్రమే. అదీ మనం కొత్త విషయాలు నేర్చుకొనేందుకు ఉపయోగపడే ఆటలు ఆడండి. చరిత్ర, శాస్త్ర సాంకేతిక విషయాలు, ఇంగ్లీష్‌ గ్రామర్‌, చిత్ర లేఖనం వంటివి నేర్చుకొనేందుకు ఉపయోగపడే ఆటలు ఆన్‌లైన్‌లో ఎన్నో ఉన్నాయి. మరి మీరు అటువంటి ఆటలు ఆడుతున్నారా? మీరు ఆడుతున్న ఆటల గురించి మాకు వ్రాసి పంపండి. మిగిలిన బాల నేస్తాలకు కూడా ఈ విషయాలను తెలియజేద్దాం.

మనం మరిచి పోతున్న ఆటలు

క్రికెట్టూ, కంప్యూటర్‌ గేమ్స్‌ రాక ముందు మన ఊళ్లలో పిల్లలు ఎన్నో రకాల ఆటలు ఆడేవాళ్లు. ఆ ఆటలకు హద్దే ఉండేది కాదు. ఎగరటం, దూకటం, పరిగెత్తటం, కుందటం, పాకటం ఇలా ఎన్నో రకాలుగా శారీరక వ్యాయామాన్ని ఇచ్చే ఎన్నో ఆటలను అప్పట్లో ఆడేవాళ్లు. కాని ఇప్పుడు క్రమంగా ఈ ఆటలన్నీ కనుమరుగై పోతున్నాయి.
పిల్లలూ, మీ అమ్మా నాన్నలు తమ చిన్నతనంలో ఏయే ఆటలు ఆడేవాళ్లో అడిగి తెలుసుకోండి. ఆ ఆటల నియమాలు ఏమిటి? ఆడేందుకు ఏమేం కావాలి? వంటి విషయాలను కూడా తెలుసుకొని మాకు వ్రాసి పంపండి. 'బాల చెలిమి' లో ప్రచురిస్తాం.

పంచతంత్రం

పంచతంత్రం కథలు తెలియని వాళ్లంటూ ఉండరు. ఇవి అనేక రూపాలుగా జనాదరణ పొందాయి. ప్రజల నాలుకలలో నిలిచాయి. క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో వీటిని విష్ణు శర్మ చెప్పాడు. పాటలీ పుత్ర రాజు ముగ్గురు కొడుకులను రాజ్య పాలనలో సమర్థులు, విజ్ఞులుగా తయారు చేయటానికి జంతువులతో కూడిన ఈ కథలను విష్ణు శర్మ చెప్పాడు. పంచతంత్రంలో అయిదు భాగాలు ఉన్నాయి. సంస్కృతంలో ఉన్న ఈ కథలను మొదట పరవస్తు చిన్నయ సూరి (1809-1862) 'నీతి చంద్రిక' పేరుతో తెలుగు లోకి అనువదించారు. ఆ తర్వాత ఎందరో వీటిని తిరిగి రాశారు. తరాలు గడిచినా వన్నె తగ్గని ఈ కథలను 'మిత్ర భేదం', 'మిత్ర లాభం' పేరిట రెండు పుస్తకాలను బుజ్జాయి వేసిన బొమ్మలతో  పిల్లల పుస్తక ప్రచురణ సంస్థ 'పాల పిట్ట' ప్రచురించింది.
బుజ్జాయి పుస్తకాలలో 'పంచ తంత్రం' కలికితురాయి వంటిది. 1960 లో 'ద ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ'లో ధారావాహికంగా పంచతంత్రం ప్రచురితమైనప్పుడు లక్షలాది పాఠకులను అలరించింది. ఇప్పుడు తెలుగుతో సహా ఇది అనేక భాషలలోకి అనువాదమయ్యింది.
బుజ్జాయిగా పేరు పొందిన దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి కుమారుడు. బుజ్జాయి తన 17 వ ఏటనే 'బానిస పిల్ల' అన్న బొమ్మల పుస్తకం ప్రచురించారు. ఆ విధంగా 'కామిక్‌ స్ట్రిప్‌' పుస్తకాలకు భారత దేశంలో ఆద్యుడిగా నిలిచారు.  మిత్ర భేదం పుస్తకం వెల 75 రూపాయలు కాగా మిత్ర లాభం పుస్తకం వెల 40 రూపాయలు.

మేం పిల్లలం

కవికాకి కోగిర జై సీతారామ్‌ రచించిన పుస్తకం ఇది. పిల్లల పాటల పేరుతో ఎన్నో పుస్తకాలు వచ్చి ఉండవచ్చు. కానీ జై సీతారామ్‌ పాటలు మాత్రం పిల్లలు, పిల్లల్ని ప్రేమించే వారి హృదయాలలో చిరకాలం ఉండి పోతాయి. ఈ పాటలలో అనంతపురం జిల్లా మాండలికం గుభాళిస్తుంది. ఇక్కడి భాషను ఇంత సృజనాత్మకంగా, ఇంత లయబద్ధంగా మరో రచయిత తీర్చిదిద్దలేదంటే అతిశయోక్తి కాదు.
అనంతపురం జిల్లా లోని కోగిర గ్రామంలో జై సీతారామ్‌ జన్మించారు. ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి ఉపాధ్యాయుడు గాను, ఏకోపాధ్యాయుడు గాను పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు వాచకాలు, పాఠాలు రాశారు. అష్టావధానాలు, శతావధానాలలో పాల్గొన్నారు.
జై సీతారామ్‌ పాటలు పిల్లలు, పెద్దల నోట విస్తృతంగా ప్రచారం పొందినా ఈనాటికీ ఆయనకు తగినంత గుర్తింపు రాలేదు. చదువు చెప్పటమంటే పిల్లల్ని కొట్టడమనే అర్థం ఉన్న రోజుల్లోనే ఆట, పాటలతో కూడిన చదువును ఆయన ప్రవేశపెట్టారు. స్వయంగా పాటలు రాసి పిల్లలతో ఆడి పాడేవారు. పాటలకు, పుస్తకాలకు తగిన రీతిలో బొమ్మలు వేసేవారు. తిట్టకుండా, కొట్టకుండా అపారమైన ప్రేమ, స్నేహాలతో పిల్లలను పెంచటం ఎలాగో తల్లిదండ్రులకూ, ఉపాధ్యాయులకూ తెలియాలి. జీవితానికీ, నేర్చుకొనే విద్యకూ సంబంధం లేకుండా పిల్లల్ని యంత్రాలుగా కాకుండా సృజనశీలురుగా, చైతన్యమూర్తులుగా తయారు చేసే ప్రయత్నాలకు జై సీతారామ్‌ పాటలు స్ఫూర్తినిస్తాయి.
'మేం పిల్లలం' పుస్తకాన్ని పిల్లల పుస్తక ప్రచురణ సంస్థ 'పాల పిట్ట' ప్రచురించింది. వెల వంద రూపాయలు.

Thursday, July 15, 2010

ఉండవల్లి గుహలు

 ఉండవల్లి గుహలు కొండలను తొలిచి నిర్మించిన గుహాలయాలకు ఒక ఉదాహరణ. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం లోని ఉండవల్లి గ్రామంలో కృష్ణా నదికి దక్షిణంగా ఈ గుహలు ఉన్నాయి. 4 - 5 శతాబ్థాల కాలంలో ఇక్కడ చిన్న చిన్న గుహలను తొలిచారు. అయితే వీటిలో పెద్ద గుహ నాలుగు అంతస్తులను కలిగి ఉంది. రెండవ అంతస్తులో ఒకే గ్రానైట్‌ రాతితో చెక్కిన అతి పెద్ద అనంత పద్మనాభుడి విగ్రహం ఉంది. తొలుత ఈ గుహలను బౌద్ధ ఆరామాల రీతిలో నిర్మించినట్లు కనిపిస్తుంది.
ఉండవల్లి గుహలను క్రీ.శ. 420 నుంచి 620 సంవత్సరాల మధ్య పరిపాలించిన విష్ణుకుండిన రాజుల కాలంలో నిర్మించారు.
ఉండవల్లి హైదరాబాద్‌ నుంచి 280 కిలో మీటర్ల దూరంలో ఉంది. విజయవాడనుంచి 6 కిలో మీటర్ల దూరం లోను, గుంటూరు నుంచి 22 కిలో మీటర్ల దూరంలోను ఉండవల్లి ఉంది. మంగళగిరి, అమరావతి ఇక్కడకు దగ్గరలో ఉన్న దర్శనీయ స్థలాలు.

ఇక మన రూపాయికి కొత్త గుర్తు


భారతీయ రూపాయికి ఇన్నాళ్లకు గుర్తు లభించనుంది. దేవనాగరి లిపినుంచి 'ర' రోమన్‌ గుర్తు 'ఆర్‌' ను కలిపి ఈ గుర్తును రూపొందించారు. బోంబే ఐఐటీ విద్యార్థి ఉదయ్‌కుమార్‌ దీన్ని రూపొందించారు.  ఈ గుర్తుకోసం దేశవ్యాప్తంగా 3వేల డిజైన్లు తుది పోటీకి రాగా ఉదయ్‌కుమార్‌‌ డిజైన్‌ను ఎంపికచేశారు. కేంద్ర మంత్రివర్గం 15 జూలై న ఈ గుర్తును ఆమోదించింది. దీంతో ఇక యు.ఎస్‌.డాలర్‌, యూరో, బ్రిటిష్‌ పౌండ్‌, జపనీస్‌ 'యెన్‌' తరహాలో మన రూపాయకూ ప్రత్యేకమైన గుర్తు ఉంటుంది. అయితే దీన్ని కరెన్సీ నోట్‌పై మాత్రం ముద్రించరు. త్వరలో అమల్లోకి రానున్న యునిక్‌కోడ్‌, ప్రపంచస్థాయి వ్యాపారలావాదేవీలు, వ్యాపార, ప్రింట్‌ మీడియాలో డిస్‌ప్లేల సందర్భంగా ఈ గుర్తును వాడతారు. మరో 6 నెలల్లో మన దేశంలోను రెండేళ్లలోను ప్రపంచవ్యాప్తంగాను ఈ గుర్తు అమల్లోకి వస్తుందని కేంద్రమంత్రి అంబికాసోనీ తెలిపారు.  


ప్రత్యేక గుర్తుతో ఇదీ లాభం...
  • గుర్తు రావటం వల్ల రూపాయికి బ్రాండ్‌ ఏర్పడి అంతర్జాతీయంగా దీని గుర్తింపు సులువవుతుంది. 
  • మున్ముందు డాలర్‌, పౌండు, యూరో, యెన్ల తరహాలోనే మన కరెన్సీలోనూ ట్రేడింగ్‌ మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి. 
  • అంతర్జాతీయ ప్రాచుర్యంతో భారత్‌లోకి మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు ఆస్కారముంటుంది.
రూపాయికి కొత్త గుర్తు రావడమైతే వచ్చింది కానీ దాన్ని అమల్లోకి తేవటం మాత్రం అంత తేలికేమీ కాదు. ఎందుకంటే కొత్త కరెన్సీ సింబల్‌ను అమల్లోకి తేవటానికి చాలా ఖర్చవుతుందంటున్నారు నిపుణులు. దీనికి ఉదాహరణగా యూరోను చూపిస్తున్నారు. విభిన్న కరెన్సీలు వాడే యూరోపియన్‌ దేశాలు 1999లో ఉమ్మడి కరెన్సీ యూరోను అమల్లోకి తెచ్చాయి. అప్పుడే యూరోకు ఒక గుర్తును కూడా నిర్ణయించాయి.
దీంతో యూరప్‌లోని పెద్దపెద్ద కంపెనీలన్నీ తమ కంప్యూటర్‌ సిస్టమ్స్‌లో సింబల్‌కి చోటు కల్పించేందుకు 50 బిలియన్‌ డాలర్లకు పైగా వెచ్చించాల్సి వచ్చింది. ఇప్పుడు రూపాయి గుర్తుకి కూడా ఇదే కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కంప్యూటర్‌లో తీసుకుంటే సాఫ్ట్‌వేర్‌లో కొత్త గుర్తును కూడా చేర్చాలి. పైపెచ్చు కీ బోర్డులో ఈ గుర్తుతో కూడిన కీని చేర్చాలి. అలాగే టైప్‌ రైటర్స్‌లోను, మొబైల్‌ పోన్లలోను కూడా దీనికి చోటు కల్పించాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్లే యూనికోడ్‌, బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌లు రూపాయి గుర్తును ఎన్‌కోడ్‌ చేశాక ఐటీ సంస్థలు తమ ఆపరేటివ్‌ సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్‌లాగా కానీ, కొత్త ప్రోగ్రాం ద్వారా గానీ దానికి చోటు కల్పించేలా నాస్కామ్‌ చొరవ తీసుకుంటుందని ప్రభుత్వం తెలిపింది.
కరెన్సీపై మాత్రం గుర్తు ఉండదు..
ప్రస్తుతం డాలరు, యూరో, యెన్‌ మొదలైన కరెన్సీలకు ప్రత్యేక గుర్తులు ఉన్నా వాటిని ఆయా నోట్లపై మాత్రం ముద్రించడం లేదు. నోట్లపై అక్షరాల్లో రాస్తున్నారంతే. ఒక్క పౌండ్‌ స్టెర్లింగ్‌ గుర్తును మాత్రమే నోట్లపై ముద్రిస్తున్నారు. మిగతా వాటి తరహాలోనే కరెన్సీ నోట్లపై గానీ నాణేలపై కానీ రూపాయి గుర్తు ముద్రణ ఉండదని, ఇప్పట్లానే అక్షరాల్లో రాయటాన్నే కొనసాగిస్తామని ప్రభుత్వం తెలియజేసింది.
రూపాయిని ఇప్పటిదాకా దేశంలో వివిధ భాషల్లో వివిధ రకాలుగా పలుకుతున్నారు. రాసేటపుడు కూడా వివిధ రకాలుగా రాస్తున్నారు. హిందీలో రూప్యా, గుజరాతీలో రూపియో, తమిళంలో రుబాయి.. త్రిపురా, మిజోరాం, ఒరిస్సా, అసోం రాష్ట్రాల్లో టంకా, బెంగాలీలో టాకా అని పిలుస్తున్నారు. రాసేటప్పుడు కూడా ఇంగ్లీషులోని ఆర్‌ఎస్‌, ఆర్‌ఈ, టి వంటి అక్షరాలతోను, తెలుగులో రూ.. అని రాస్తున్నారు. ఇకపై వాడుక భాషలో రూపాయి, రుబాయి, రూప్యా అంటూ మాట్లాడినా, రాసేటపుడు మాత్రం అందరూ ఒకే గుర్తును రాసే అవకాశముంది. కాకుంటే దీనికి కొంత సమయం పట్టొచ్చు.  
రూపాయి గుర్తుకు రూపమిచ్చిన డి.ఉదయ్‌కుమార్‌ పుట్టింది తమిళనాడులో. ప్రస్తుతం ఐఐటీ-ముంబైలో పీహెచ్‌డీ చేస్తున్నారు. డిజైన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉన్న ఉదయ్‌కుమార్‌ చిప్‌ అనే కంప్యూటర్స్‌ మ్యాగజైన్‌లో డిజైన్‌ హెడ్‌గా కూడా పనిచేశారు. తాజాగా ఆయన ఐఐటీ-గౌహతిలోని డిజైన్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరబోతున్నారు కూడా. రూపాయి గుర్తు ఎంపిక ప్రకటన వెలువడగానే ఉదయకుమార్‌కు మీడియా నుంచి కాల్స్‌ వెల్లువెత్తాయి. "నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నేను రూపొందించిన గుర్తులో త్రివర్ణ పతాకం కూడా ప్రతిబింబించాలని అనుకున్నాను. భారతీయ లిపిలో అక్షరాలకు పైన గీత అనేది దేవనాగరిలోనే ఉంటుంది. అందుకే ఆ లిపిలోని ర అక్షరం, రోమన్‌ అక్షరం ఆర్‌లు, పైన రెండు గీతలు మధ్యలో తెల్లని వ ర్ణం కలబోతతో రూపాయి గుర్తు రూపొందించాను' అని ఉదయ్‌కుమార్‌ చెప్పారు.  ఈ గుర్తును రూపొందింఛి  నందుకు గాను ఉదయ్‌కుమార్‌కి రెండున్నర లక్షల నగదు బహుమతి లభిస్తుంది. 

గిరిజనుల వ్యవసాయం

గిరిజనులు తాము నివసించే ప్రాంతాల్లో దొరికే వాటితోనే రకరకాల వస్తువులను తయారు చేస్తారు. ఏ పనికైనా స్వయంగా తామే ఓ కొత్త పద్దతిని కనుగొంటారు. ఉత్తరాంధ్ర లోని చింతపల్లి, జి.కె.వీధి, పాడేరు, అరకు, హుకుంపేట ప్రాంతాలలో పర్యటించినప్పుడు  మేము తెలుసుకొన్న ఆసక్తికరమైన  విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నాము.

 దోనె
పశువులకు కావలసిన నీటిని అందించేందుకు దోనెలను గిరిజనులు ఉపయోగిస్తున్నారు. బాగా లావుగా ఉన్న కర్రను తీసుకొని మధ్యలో కలపను తొలగించి తొట్టెలాగ చేస్తారు. దీని పొడవుగు తగినట్లుగా, రెండు ప్రక్కల రెండు రాటలు వేసి, దానిపైన చెక్కిన ఈ కర్ర దోనెను ఉంచుతారు. దీనిలో నీళ్లు పోసి ఉంచుతారు. పశువులు నీటిని దీనిలో నుంచి తాగుతాయి.

పంట పొలాలకు దోనె
ఏజెన్సీ గ్రామాలలో పంట పొలాలకు నీరు పెట్టేందుకు కూడా దోనెను ఉపయోగించటం జరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలను పెంచుతున్నప్పుడు దీనిని వాడుతున్నారు. పెద్ద కర్రను తీసుకొని, ఆ చివర నుంచి ఈ చివర వరకు మధ్యలో ఖాళీ వచ్చేలా చెక్కుతారు. ఒక వైపు ఎత్తు ఎక్కువగా ఉన్న రాటను ఉంచి, నీరు వెళ్లేందుకు అనువుగా మరొక వైపు ఎత్తు తక్కువగా ఉండేలా రాటను అమర్చుతారు. ఈ రాటల పైన దోనెను ఉంచుతారు. ఇపుడు నీటిని ఎత్తుగా ఉన్నవైపు పోస్తే నీరు క్రిందికి జారి పొలంలో అవసరమైన చోట పడుతుంది. ఇలా శారీరక శ్రమను తగ్గించుకొనేందుకు గిరిజనులు కనుగొన్న పద్ధతి ఇది.
- జి. ఉదయ్‌

మేకల దుర్రి

చదువు కొన్న వాళ్లకే గొప్ప తెలివి తేటలు ఉంటాయనుకోవటం పెద్ద పొరపాటు. అక్షర జ్ఞానం లేకుండా అడవులలో నివసించే గిరిజనులకు ప్రకృతిలో సహజంగా లభించే వస్తువులతో తమ అవసరాలను తీర్చుకొనటం ఎలాగో తెలుసు. విశాఖపట్నం జిల్లా లోని చింతపల్లి పరిసర గిరిజన గ్రామాలలో ప్రజలు అనుసరించే ఈ పద్ధతులే ఇందుకు ఉదాహరణ. ఉత్తరాంధ్ర లోని చింతపల్లి, జి.కె.వీధి, పాడేరు, అరకు, హుకుంపేట ప్రాంతాలలో పర్యటించినప్పుడు ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను మేము తెలుసుకొన్నాం.

మేకల దుర్రి
కర్రలు, వెదురు, గడ్డి వంటి వాటితో మేకల దుర్రిని తయారు చేస్తారు. కర్రలతో నాలుగు రాటలు వేసి, వెదురు లేదా కర్రలతో దడిలా చేసి దానిపైన గడ్డిని కప్పుతారు. ఈ గదిలో మేకలను ఉంచుతారు. క్రింద పేరుకున్న మేకల గత్తముని ఎరువుగా ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని ఎక్కువగా పి.టి.జి (ప్రిమిటివ్‌ ట్రైబ్‌ గ్రూపు)  లు పాటిస్తున్నట్లు స్థానికులు చెప్పారు.

గడ్డి పందిరి
దీనిని గిరిజన ప్రాంతాలలో ఎక్కువగానే ఉపయోగిస్తున్నారు. ఆవులు, ఎద్దులు, గేదెల వంటి పెంపుడు జంతువులకు ఆహారంగా ఉపయోగపడే ఎండు గడ్డిని నిల్వ చేసేందుకు గడ్డి పందిరిని తయారు చేస్తారు. ముందుగా నాలుగు రాటలను వేసి, వాటి పైన కర్రలతో పందిరిలాగ కడతారు. దానిపైన వరి గడ్డిని పరుస్తారు. ఇలా గడ్డిని నిల్వ చేయటం వలన వానలు వచ్చినా క్రింద గడ్డి తడిసి పాడై పోకుండా ఉంటుంది.
- జి. ఉదయ్‌

Tuesday, July 13, 2010

తిండి దొంగ





Monday, July 12, 2010

అవతార్‌

''మేం మేధా సంపన్నులం. మేమేమైనా చేయగలం. ఏమైనా సాధించగలం. తుపాకులు, అణ్యాయుధాలతో దేనినైనా అంతం చేయగలం.'' అనే భావనతో ప్రపంచాన్నంతటినీ పాదాక్రాంతం చేసుకొనేందుకు చేసే ప్రయత్నాలతో మనిషి చిట్టచివరికి భూమిని నివాస యోగ్యం కాకుండా మార్చేస్తాడు. ప్రకృతిలో సహజంగా జరిగే చర్యలన్నిటికీ అడ్డుపడి సహజ వనరులను కోల్పోతాడు. అయినా అతడు మారడు. ఇక విశ్వాంతరాల్లోకి అన్వేషణ మొదలవుతుంది. ఇతర గ్రహాల మీది వనరుల మీదా దాడి మొదలవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? అనే ప్రశ్నకు జవాబు 'అవతార్‌'.
ఇటీవల విడుదలైన 'అవతార్‌' చిత్రం హాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అలియన్స్‌, టెర్మినేటర్‌, టైటానిక్‌ వంటి సంచలనాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన జేమ్స్‌ కామెరన్‌ అత్యద్భుతంగా పర్యావరణ సందేశాన్ని ప్రపంచానికి అందిస్తూ తీసిన అవతార్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోవటం ఓ మంచి పరిణామమే.
కథ 2154లో మొదలవుతుంది. అప్పటికి భూమి మీద ఉన్న సహజ వనరులన్నీ కనుమరుగై పోతాయి. భూమికి 4.4 కాంతి సంవత్సరాల దూరంలో పచ్చగా కళకళలాడుతున్న 'పండోరా'కు చక్రాల కుర్చీకి పరిమితమైన మెరైనర్‌ జాక్‌ సల్లీ కూడా చేరుకొంటాడు. మిలిటరీ సహాయంతో 'రీసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌' నేతృత్వంలో అప్పటికి మూడు దశాబ్ధాలుగా పండోరాపై వలస ఏర్పర్చుకుని, అరుదైన ఖనిజం 'యునొబ్టానియం' ని మానవులు వెలికి తీస్తూ ఉంటారు. భూమి మీద శక్తిని ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడే ఖనిజం అది. వనరుల మీద ఆధిపత్యం సాధించేందుకు, వాళ్లను నియంత్రించేందుకు పండోరా వాసులతో సన్నిహిత సంబంధం ఏర్పర్చుకోవాలని అడ్మినిస్ట్రేషన్‌ ప్రయత్నిస్తూ ఉంటుంది. పండోరా వాసులు నీలి వర్ణంలో పొడవుగా ఉండే యోధులు. వాళ్లను నవీలని పిలుస్తారు. అయితే పండోరా వాతావరణం మానవులకు విషతుల్యం. కనుక అక్కడి బయోస్ఫియర్‌ను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు మానవ జన్యువులను ఆధారంగా చేసుకొని అవతార్‌లను సృష్టిస్తారు. జాక్‌ కు అవతార్‌గా మారే అవకాశం లభిస్తుంది. నవీల సమాచారాన్ని సేకరించి శాస్త్రవేత్తలకు అతడు అందించాలి. ఆ క్రమంలో జాక్‌ నవీ యువరాణి నేత్యిరి సహాయంతో పండోరా గురించి పూర్తిగా తెలుసుకొంటాడు. పండోరాలో ప్రాణకోటికి ఆయువుపట్టుగా నిలిచిన ఐవా, ప్రకృతితో సహ జీవనం చేసే నవీలు, అక్కడ చరాచర జీవ కోటి పట్ల అతడికి గౌరవం పెరిగిపోతుంది. చివరకు అతడే నవీగా మారిపోయి పండోరాను రక్షించే బాధ్యతను తీసుకొంటాడు.
ఈ సినిమాను చూస్తున్నంత సేపు మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో ఖనిజ వనరుల కోసం చేపడుతున్న గనుల తవ్వకాలు, గిరిజనుల ఆందోళనా కళ్ల ముందు నిలుస్తాయి.
కేవలం స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ కోసం కాకుండా, వినోదం కోసం కాకుండా మరొక్కసారి ఈ సినిమాను చూడండి.

పీఎస్‌ఎల్‌వీ సీ-15 ప్రయోగం విజయవంతం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 12 వ తేదీ ఉదయం చేపట్టిన  పీఎస్‌ఎల్‌వీ సీ -15 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతం అయ్యింది. మొదటి మూడు దశలను పూర్తి చేసిన పీఎస్‌ఎల్‌వీ నాలుగోదశలో సెకనుకు 7.5 కి.మీ. వేగంతో ప్రయాణించింది. అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసిన వాహకనౌక 5 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ వాహకనౌక 694 కిలోల బరువుగల కార్డోశాట్‌-2బి, 116 కిలోల బరువుగల అల్‌శాట్‌-ఏ, కెనడా, స్విట్జర్లాండ్‌లకు చెందిన రెండు ఉపగ్రహాలు , ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక విద్యార్థులు తయారు చేసిన స్టడ్‌ శాట్‌లను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.
పట్టణ ప్రణాళిక, రింగ్‌ రోడ్లు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కార్టోశాట్‌ దోహదపడుతుంది. ఇందులో అత్యాధునిక పాన్‌క్రొమాటిక్‌ కెమెరా ఉంది. 9.6 కిలోమీటర్ల ప్రాంతంలోని దృశ్యాలను 0.8 మీటర్ల రిజల్యూషన్‌తో చిత్రీకరించగలదు. గ్రామస్థాయిలో వనరుల అంచనా, సూక్ష్మ వాటర్‌షెడ్‌ అభివృద్ధి పథకాలు, పంటల పరిశీలన వంటివి దీనిద్వారా చేపట్టవచ్చు. ఇప్పటికే కక్ష్యలో కార్టోశాట్‌-2, కార్టోశాట్‌-2ఎలు ఉన్నాయి.
పీఎస్‌ఎల్‌వీ 'కోర్‌ ఎలోన్‌' వర్షన్‌ను ఈసారి ప్రయోగిస్తున్నారు. 44 మీటర్ల పొడవుండే ఈ వాహకనౌక.. పైకిలేచే సమయంలో 230 టన్నుల బరువును కలిగి ఉంటుంది. ఇప్పటి వరకూ ఇది 17 భారత, 22 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందులో భారత తొలి చంద్రమండల అన్వేషక ఉపగ్రహం చంద్రయాన్‌-1 కూడా ఉంది. 

భూమి వయస్సు ఎంత?

భూమి వయస్సు గురించి వేసిన అంచనాలన్నీ తప్పేనని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తేల్చారు. గతంలో పేర్కొన్న దానికన్నా భూమి వయస్సు తక్కువేనని నిర్ధరించారు. 456 కోట్ల సంవత్సరాల కిందట సౌర కుటుంబం ఆవిర్భవించిందని, ఆ తరువాత చాలా కాలానికి భూమి పుట్టిందని వారు అన్నారు. భూమి మ్యాంటిల్‌ భాగంలోని రసాయన ఐసోటోపులను రోదసి నుంచి వచ్చిపడ్డ ఉల్కలతో పోల్చి చూసిన శాస్త్రవేత్తలు ఈ మేరకు నిర్ధరించారు. ప్రస్తుత పరిమాణానికి చేరుకోవడానికి భూమికి 446 కోట్ల సంవత్సరాలు పట్టిందని తేల్చారు. వాయువులు, ధూళి, ఇతర పదార్థాలు కలగలసి భూమిగా ఏర్పడడానికి మూడు కోట్ల సంవత్సరాలు పట్టిందని శాస్త్రవేత్తలు గతంలో పేర్కొన్నారు. అయితే తాజా పరిశోధనలో ఇందుకు 10 కోట్ల సంవత్సరాలు పట్టి ఉంటుందని తేల్చారు. ప్రస్తుత పరిమాణంలో 60 శాతం మేర చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదని అన్నారు. ఆ తరువాత పెరుగుదల మందగమనంలో సాగిందని, ఫలితంగానే 10 కోట్ల సంవత్సరాలు పట్టిందని వారు అన్నారు. 

Sunday, July 11, 2010

ఆకులున్న చెట్టుకే నీడ

సామెతలు...
తెలుగు సాహిత్యంలో సామెతల కేమీ కొదవ లేదు. నగర జీవి మరిచిపోయినా ఈ సామెతలు పల్లె జనం నోళ్లలో నేటికీ నానుతూ ఉన్నాయి. జంతువులు, చెట్లు, వ్యవసాయం..... ఇలా ఎన్నో విషయాల గురించి విలువైన సమాచారాన్ని సామెతల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు. అటువంటి సామెతల నుంచి కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాం.
  • ఆకులున్న చెట్టుకే నీడ
  • ఆకు నలిపి నపుడే అసలు వాసన బయట పడేది
  • ఆ పప్పు ఈ నీళ్లకు ఉడకదు
  • ఆముదపు విత్తులు ఆణిముత్యాలగునా?
  • ఆరికకు చిత్తగండం
  • ఆరుద్ర కురిస్తే దారిద్య్రం లేదు
  • ఆవులు ఆవులు పోట్లాడుకొని దూడల కాళ్లు విరిగినట్లు
  • ఆవు ఎక్కడ తిరిగితేనేమి మన ఇంటికొచ్చి పాలిస్తే చాలు అన్నట్లు
  • ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
  • ఆవు పాడి ఎన్నాళ్లు? ఐశ్వర్యమెన్నాళ్లు? బర్రె పాడి ఎన్నాళ్లు? భాగ్యమెన్నాళ్లు?
  • ఆవు ముసలిదైతే పాల రుచి తగ్గుతుందా?
  • ఆవు మేత లేక చెడితే పైరు చూడక చెడింది
  • ఆవులలో ఆబోతై తినాలి

ఇటువంటి సామెతల గురించి మీ ఇంట్లో అమ్మానాన్నలనీ, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలనీ అడగండి. ఆ సామెతల వెనుక దాగిన అర్థం ఏమిటో తెలుసుకోండి. మీరు తెలుసుకున్న సామెతల గురించి వివరంగా మాకు వ్రాసి మీ ఫోటోతో పాటుగా పంపండి. 'బాల చెలిమి'లో వాటిని ప్రచురిస్తాం.

వంకర టింకర మాను

1
వంకర టింకర మాను
వయ్యారి మాను
రాజు లెక్కే మాను
మా ఊరొచ్చే మాను
కాపు లెక్కే మాను
కష్ట జీవుల మాను
ఎత్తుకు తిరిగే మాను
ఇంతల పెండ్లి కానూ!!

2

అంతులేని చెట్టుకు అరవై ఆరు కొమ్మలు
కొమ్మ కొమ్మకు కోటి పూలు

పొడుపు కథలు. పొడుపు కథలకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇవి పిల్లలు, పెద్దలలో ఆలోచనలను రేకెత్తించేవిగా ఉంటాయి. వినోదాన్నీ ఇస్తాయి. మానసిక వికాసాన్నీ కలిగిస్తాయి. చాలా పొడుపు కథలు కనుమరుగై పోయినా, కాల గర్భంలో కలిసి పోయినా, ఇప్పటికీ పల్లె ప్రాంతాలలో వీటికి ఆదరణ ఎంతో ఉంది.

మీ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న పొడుపు కథలను వ్రాసి బాల చెలిమికి పంపండి. మీ పేరు, ఫోటో కూడా జత చేసి పంపండి. వెంటనే బాల చెలిమిలో ప్రచురిస్తాం.   



జవాబులు : పల్లకీ, ఆకాశం-చుక్కలు

పిఠాపురం చిన్నవాడా!

పొడుపు కథ:


1
పిఠాపురం చిన్నవాడా! 
పిట్టల వేటకాడా !
వేటకైతే పోతు
న్నావు కానీ అడవికి పోరాదు
పోతే తుపాకీ మందు కూరరాదు
కూరితే గురి చూడారాదు
చూసినా తుపాకి పేల్చరాదు
పేల్చినా పిట్టను కొట్టరాదు
నీచు లేకుండా రారాదు
ఇదేమిటో చెప్పుకో చూద్దాం !!
2
రాజమండ్రి వారి ఆడపడుచా
రఘుపతి కోడలా
నీళ్లకు పోతున్నావు కానీ
నూతి దగ్గరకు వెళ్లకూడదు
వెళ్లినా చేద విప్పకూడదు
విప్పినా నూతిలో వేయకూడదు
వేసినా నీళ్లు తోడకూడదు
తోడినా బిందెలో పోయకూడదు
అలా అని నీళ్లు లేకుండా రానూ కూడదు
ఈ పొడుపు కథేమిటో విప్పు చూద్దాం.

పొడుపు కథలు. పొడుపు కథలకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇవి పిల్లలు, పెద్దలలో ఆలోచనలను రేకెత్తించేవిగా ఉంటాయి. వినోదాన్నీ ఇస్తాయి. మానసిక వికాసాన్నీ కలిగిస్తాయి. చాలా పొడుపు కథలు కనుమరుగై పోయినా, కాల గర్భంలో కలిసి పోయినా, ఇప్పటికీ పల్లె ప్రాంతాలలో వీటికి ఆదరణ ఎంతో ఉంది.

మీ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న పొడుపు కథలను వ్రాసి బాల చెలిమికి పంపండి. మీ పేరు, ఫోటో కూడా జత చేసి పంపండి. వెంటనే బాల చెలిమిలో ప్రచురిస్తాం.  



జవాబులు : కోడి గుడ్డు, కొబ్బరి కాయ

500 కోట్లు దాటిన సెల్ కనెక్షన్లు

కూడు, గూడు, గుడ్డ...సెల్‌ఫోన్! అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. సెల్ ఫోన్ కనీస అవసరాల జాబితాలో చేరిపోయినట్లే అయింది.  ప్రపంచ జనాభా సుమారు 685 కోట్లు కాగా, సెల్‌ఫోన్ కనెక్షన్ల సంఖ్య 500 కోట్లను దాటింది. ఈ వారంలోనే కొత్త రికార్డు నమోదైనట్లు 'ఎల్ఎం ఎరిక్‌సన్ ఏబీ' సంస్థ పేర్కొంది.

సెల్ కనెక్షన్ల సంఖ్య కొన్నాళ్లకు జనాభాను మించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే.. రెండేసి ఫోన్లు వాడుతున్నవాళ్లు, ఒకే ఫోన్‌లో డ్యుయల్ సిమ్‌లు పెట్టుకున్న వాళ్లు భారీ సంఖ్యలోనే ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పేరు పొందిన భారత్, చైనాల్లోనే భారీ స్థాయిలో సెల్‌ఫోన్ల వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది.  మొబైల్ ఫోన్ల వినియోగంలో చైనా, భారత్‌ల మధ్య పోటీ నెలకొంది. వందకోట్లు దాటిన భారత జనాభాలో దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరికి సెల్ ఉంది. రెండు మూడు వేల రూపాయలకే సకల సౌకర్యాలున్న మొబైల్ సెట్స్ అందుబాటులోకి రావడం సెల్ విస్తరణకు మరో కారణమైంది.దేశంలో ఈ ఏడాది మార్చి నెలలోనే ఏకంగా రెండు కోట్ల సెల్ కనెక్షన్లు పెరగడం విశేషం. మొబైల్ కనెక్షన్లలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే.

Saturday, July 10, 2010

గుడ్డంత బంగారం కొండంత ధీమా

Thursday, July 8, 2010

గగనంలోకి సౌర విమానం


పేయెర్నె, స్విట్జర్లాండ్‌లో సౌర ఇంధనంతో నడిచే ప్రయోగాత్మక విమానం తొలిసారిగా గగనంలోకి ఎగిరింది. పశ్చిమ స్విట్జర్లాండులోని పేయెర్నె రన్‌వే నుంచి 8 జూలై 2010 వ తేదీ తెల్లవారు జామున ఈ విమానం గాల్లోకి లేచింది. గంటకు 35 కి.మీ. వేగంతో పయనించే ఈ విమానానికి ఆండ్రీ బోర్చ్‌బెర్గ్‌ ఏకైక పైలట్‌. ఇతరత్రా ఎలాంటి ఇంధనం సాయం లేకుండా విమాన ప్రయాణం చేయాలన్నదే తమ లక్ష్యమని బృంద నాయకుడు బెట్రండ్‌ పికార్డ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 
63 మీటర్ల పొడవైన రెక్కలతో విచిత్రంగా కనిపిస్తున్న ఈ విమానం పేరు హెచ్‌బీ-సియా. పూర్తిగా సౌరవిద్యుత్‌తో నడుస్తుంది.  రెక్కలపై అమర్చిన 12000 సోలార్ సెల్స్.. సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చి బ్యాటరీల్లో నిక్షిప్తం చేస్తాయి.

ప్రయోగాత్మకంగా.. రాత్రివేళల్లో కూడా బ్యాటరీల్లో నిల్వ వున్న విద్యుత్‌తో ఈ విమానాన్ని 25గంటలపాటు నిరంతరాయంగా నడిపేందుకు పిచర్డ్ బృందం సిద్ధమైంది. బుధవారం ఉదయం 4.51 నిమిషాలకు పేయెర్న్ ఎయిర్‌బేస్ నుంచి ఈ విమానం ప్రయాణం ప్రారంభించింది. నాలుగు మోటార్లు కలిగిన ఈ విమానం పొడవు 21.85 మీటర్లు, ఎత్తు 6.40 మీటర్లు, బరువు 1,600 కిలోలు. గరిష్ఠంగా 9100 మీటర్ల ఎత్తుకు చేరుకోగల ఈ విమానం గరిష్ఠ వేగం గంటకు 40.2కిలోమీటర్లు. 

Sunday, July 4, 2010

మానవ హక్కులు అంటే ?

భూమ్మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కులం, మతం, భాష, ప్రాంతం, రంగు వంటి తరతమ భేదాలు లేకుండా  కొన్ని హక్కులు సంక్రమించాయి. ఆ హక్కులు ఉన్నందునే మనం బతుకుతున్నాం. ఏ పనులైన మనకున్న మానవ హక్కులకు లోబడి చేయగలుగుతున్నాం. ఈ హక్కులు మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి. ఏ వ్యక్తులైనా మనపై దాడిచేసి, హింసించడం వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు సుఖంగా, కలిసిమెలిసి జీవించడానికి ఈ హక్కులు ఉపయోగపడుతున్నాయి. 10 డిసెంబర్‌ 1948లో ఐక్యరాజ్య సమితి ఈ హక్కులను మానవాళికి 'ప్రపంచ మానవ హక్కుల ప్రకటన' ద్వారా అందించింది. ఐక్యరాజ్యసమితిలోని 192 సభ్య దేశాలు ఈ హక్కులకు కట్టుబడి ఉన్నాయి. అన్ని దేశాలు డిసెంబర్‌ 10 మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాయి.  మానవ హక్కుల గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో చైతన్యం తీసుకువస్తాయి. మన మానవ హక్కులకు భంగం కలిగించకూడదనుకుంటే మనం ఇతరుల హక్కుల పట్ల కూడా అంతే బాధ్యతతో మెలగాలి. ముఖ్యంగా యువతీయువకులలో సరైన అవగాహన కల్పించడానికి అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.  మన దేశం 1993లో మానవ హక్కుల కమీషన్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రాలలో రాష్ట్ర కమీషన్‌లు పనిచేస్తున్నాయి.
మన రాష్ట్రంలో భోలక్‌పూర్‌ సంఘటనప్పుడు, తెలంగాణ ఉద్యమం సందర్భంగా మరోమారు మానవహక్కుల కమీషన్‌ పేరు మారు మ్రోగింది.

హక్కులు
1. మనుషులందరూ పుట్టుకతోనే స్వేచ్ఛతో పుట్టారు. అందరికీ సమాన హక్కులు, గౌరవం ఉన్నాయి. మనుషులందరూ తమ ఆలోచనా, విజ్ఞతతో పరస్పరం అన్నదమ్ముల్లా మెలగాలి.
2. జాతి, వర్ణం, లింగం, మతం, రాజకీయ లేదా ఇతర కారణాలతో ఎటువంటి వివక్ష వంటి ఏ విధమైన భేద భావాలు లేకుండా అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. (వివక్ష చూపవద్దు)
3. ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు, స్వేచ్ఛ, భద్రత
4. బానిసలుగా పట్టుకోవడం కూడదు
5. ఎవరినీ చిత్రహింసలపాలు చేయకూడదు, కౄరత్వం, శిక్షించడం చేయ కూడదు
6. చట్టపరంగా ప్రతి ఒక్కరికి గుర్తింపు హక్కు ఉంది
7. చట్టం ముందు అందరూ సమానమే! అందరికీ సమానంగా రక్షణ కల్పించాలి
8. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్టయితే వాటికి న్యాయ స్థానం నుంచి న్యాయం పొందవచ్చు
9. ఎవరినీ సరైన కారణం లేకుండా నిర్భంధించకూడదు
10. పక్షపాతరహిత విచారణ హక్కు
11. నేరస్తులుగా అనుమానిస్తున్నా, నిందితులని తేలే వరకు నిరపరాధులే!
12. ఏకాంతంగా జీవించే హక్కు
13. స్వేచ్ఛగా తన రాష్ట్రంలో, సొంత దేశంలో లేదా విదేశాలలో తిరిగే హక్కు, నివసించే హక్కు
14. జీవించడానికి సురక్షిత ప్రాంతం కలిగి ఉండడం
15. జాతీయత హక్కు (జాతీయతను మార్చుకోవచ్చు)
16. వివాహం, కుటుంబం ఏర్పాటు చేసుకునే హక్కు
17. వ్యకిగతంగా, ఇతరులతో కలిసి సంయుక్తంగా ఆస్తిని పొందే హక్కు
18. మత స్వేచ్ఛ
19. భావస్వాతంత్య్ర హక్కు
20. శాంతియుతంగా బహిరంగా సమావేశం, సభను ఏర్పాటు చేయడం, సంస్థలో చేరమని బలవంతపెట్టకూడదు
21. ప్రజాస్వామ్యం హక్కు, పౌరులందరికీ ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండే హక్కు
22. సాంఘిక భద్రత హక్కు
23. పనిచేసే హక్కు, కార్మికుల హక్కులు (సమాన పనికి సమాన వేతనం)
24. ఆడుకునే హక్కు
25. కుటుంబంలో అందరూ ఆరోగ్యంతో జీవించడం, ఆహారం, నీడ
26. విద్య హక్కు
27. కాపీరైట్‌ హక్కు
28. మానవ హక్కులను ప్రకటించిన విధంగా అమలు చేయడం, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం
29. సమాజం పట్ల బాధ్యతలు ఉన్నాయి (ఇతరుల హక్కులను దృష్టిలో పెట్టుకుని మీ హక్కులను పరిరక్షించుకోవాలి)
30. ప్రకటించిన మానవ హక్కులను ఏ రూపంలోనైనా కాలరాచే అధికారం ఎవరికీ లేదు

కనుక మనందరం బాధ్యతతో మెలుగుదాం. మన పక్కవారి హక్కులను, మన హక్కులను రక్షించుకుందాం.
-- అరుణ కాట్రగడ్డ .. Credits to www.YouthforHumanRights.org

Saturday, July 3, 2010

నకిలీ మాత్రలు పట్టించు

కేంద్ర ఔషధాలు, ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో) ఇటీవల దేశవ్యాప్తంగా ఔషధాలు, సౌందర్య సాధనాల నమూనాలను సేకరించి నాణ్యతను పరిశోధించగా 8 శాతం మందులు నకిలీవి లేదా నిర్ణీత ప్రమాణాల్లో లేనివని తేలింది. దాంతో ఈ సంస్థ దేశవ్యాప్తంగా నకిలీ మందుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది.  ఆంధ్రప్రదేశ్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉండటంతో శంషాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేసింది. సీడీఎస్‌సీఓ ప్రాంతీయ పర్యవేక్షక అధికారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నకిలీ మందుల ఏరివేత జరుగుతుంది. ఇందులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నకిలీ మందుల్ని పట్టించే వారికి బహుమతుల పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏడుగురు ప్రభుత్వ శాఖల అధికారులు, ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కలిసి బహుమతులను నిర్ధరిస్తారు. సాధారణ ప్రజలకు సీజ్‌ చేసిన మందులు/వైద్య పరికరాల విలువలో 20 శాతాన్ని రివార్డుగా ఇస్తారు. గరిష్ఠ పరిమితి రూ.25 లక్షలు. ప్రభుత్వోద్యోగులకు గరిష్ఠ పరిమితి రూ.5 లక్షలు. ఉద్యోగి సర్వీసు కాలంలో రివార్డుల మొత్తం గరిష్ఠ పరిమితి రూ.30 లక్షలు. రివార్డు మొత్తాన్ని విడతల వారీగా ఇస్తారు. తొలివిడత 25% ఛార్జిషీటు దాఖలైన వెంటనే, మలివిడత 25% కోర్టులో సాక్ష్యాధారాలు నిరూపణ అయ్యాక, తుదివిడత 50%తీర్పు వచ్చాక ఇస్తారు.

ఎవరికి సమాచారం ఇవ్వాలి?
ఎ.సి.ఎస్‌.రావు, సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ సబ్‌జోనల్‌ కార్యాలయం, యూనిట్‌ నెం.18, రెండో అంతస్తు, కార్డో శాటిలైట్‌ బిల్డింగ్‌, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్‌

ఫోన్‌ నెంబర్లు: 91-40- 24008270, 24008236
మొబైల్‌ నెంబరు: 94401 15452, 96187 27439
ఫ్యాక్స్‌ : 040- 24008270
మెయిల్‌: adchyderabad@gmail.com

Friday, July 2, 2010

కార్బన్‌ డై ఆక్సైడ్‌తో పెట్రోలు తయారీ

పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని చేసే కార్బన్‌ డై ఆక్సైడ్‌ (సీఓ2) నుంచి సూర్యరశ్మి సహాయంతో పెట్రోలును తయారు చేసే పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి పరుస్తున్నారు. ఈ పరిజ్ఞానం ప్రపంచ ఇంధన అవసరాలు తీర్చడంలో ఉపయోగపడటంతోబాటు కార్బన్‌ ఉద్గారాలను కనిష్ఠ స్థాయికి తీసుకురావడంలో సహకరిస్తుందని వారు పేర్కొంటున్నారు. న్యూమెక్సికోలో అల్‌బుక్యుర్‌క్యూలోని శాండియా జాతీయ పరిశోధనశాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ బృహత్తర ఆవిష్కరణకు కృషి చేస్తోంది. ఈ ఇంధనం ప్రస్తుతం కార్లు, ఇతర ఇంజిన్లు వంటి వాటిలో వినియోగిస్తున్న ఇంధనాలకు సరి సమానమైన దని పరిశోధకులు చెబుతున్నట్టు 'న్యూ సైంటిస్ట్‌' పత్రిక పేర్కొంది. కాలుష్య ఉద్గారాలతో భూతాపం పెరిగిపోతోందంటున్న వారికి కొంత ఉపశమనం కలిగే ఆవిష్కరణ అవుతుంది ఇది.

Thursday, July 1, 2010

2015 నాటికి చైనా జనాభా 139 కోట్లు

చైనా జనాభా అంతకంతకూ పెరిగి  రాబోయే ఐదేళ్లనాటికి 139 కోట్లకు చేరుతుందని తాజా అధ్యయనంలో తేలింది. పెరుగుతున్న పట్టణ జనాభానే దీనికి కారణం. ఆశ్చర్యకరంగా మొదటిసారిగా గ్రామ జనాభాలో తగ్గుదల కనిపిస్తోంది. 2015 ముగిసేసరికి దేశ జనాభా 139 కోట్లకు చేరుతుందని, వీరిలో60 ఏళ్లకు మించి వయసున్న వారి సంఖ్య 20 కోట్లకుపైగా ఉంటుందని చైనాలోని ప్రధాన జనాభా సేకరణ సంస్థ తెలిపింది. చైనా అధికారిక లెక్కల ప్రకారం 2008లో ఆ దేశ జనాభా 132 కోట్లు. జనాభాకు అడ్డుకట్ట వేయడానికి చైనా 1970ల్లో 'ఒక్కరు చాలు' విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని కఠినంగా అమలుచేయడం ద్వారా 1949-1978తో పోలిస్తే 1978-2008 మధ్య చైనాలో 40% తక్కువ పెరుగుదల నమోదైంది.