Friday, June 25, 2010

సాధన

జ్యోతికి చాలా కోపంగా ఉంది!
బుంగమూతి పెట్టి కుర్చీలో కూర్చుంది. తన పక్కన కూర్చుని తన వైపే తోక ఆడిస్తూ కూర్చున్న కుక్కపిల్లను అకారణంగా ఒక్కటి కొట్టింది. అది కుయ్‌మంటూ బయటకు పరిగెత్తింది. తన ఎదురుగా టేబుల్‌పై ఉన్న రిబ్బన్లను, బూట్లను చూస్తుంది కోపంగా.
    జ్యోతికి ఆరేళ్ళ వయస్సు ఉంటుంది. స్కూలుకు వెళ్తుంది. బుద్ధిగా చదువుకుంటుంది. ఈ రోజు మాత్రం తనపై తనకే చాలా కోపంగా ఉంది. ఎవరితోనూ మాట్లాడడం లేదు.
    'నిన్నటి నుండి రిబ్బన్‌తో కుచ్చులు వేయడం నేర్చుకోవాలని ప్రయత్నిస్తుంది కానీ రావటం లేదు. తనకు రిబ్బనుతో ముడి వేయవచ్చును. కాని కుచ్చు వేయటమే రావటం లేదు.'' ఇదే జ్యోతి కోపానికి కారణం. ప్రొద్దుటి నుండి మాట్లాడక కుర్చీలో కూర్చున్న జ్యోతిని చూసి వాళ్ళ నాన్న
''మళ్ళీ ఓసారి ప్రయత్నించమ్మ' అన్నాడు.
    'సాధన చెయ్యి అదే వస్తుంది' అంది అమ్మ.
    'ఇది చాలా సులువు' అన్నాడు వాళ్ళ అన్నయ్య.
    జ్యోతికి వాళ్ళందరు ఎగతాళి చేస్తున్నట్లు అనిపించింది. మళ్ళీ టేబుల్‌ పైన ఉన్న రిబ్బను తీసుకొని కుచ్చులు వేయటం ప్రారంభించింది. ఉహు! రావట్లేదు. కాసేపటికి అలసిపోయింది. కుచ్చులు వేయటం మాత్రం రాలేదు. సాయంత్రం వాళ్ళ నాన్న బయటి నుంచి వచ్చి
    'కొద్దిగా టైమ్‌ తీసికొని నిదానంగా వెయ్యి' అన్నాడు.
    'మళ్ళీ ప్రారంభించు' అంది వాళ్ళ అమ్మ.
    'కుచ్చులు వేయడం చాలా సులువు' అన్నాడు నవ్వుతూ వాళ్ళ అన్నయ్య. తను అలాగే ప్రయత్నిస్తే కుచ్చు వేయగలుగుతాననుకుంది. మరుసటి రోజు స్కూల్లో తన బూట్లకున్న  దారాలు విప్పి సాధన చేసింది. అయినా రాలేదు. చాలా కోపం వచ్చింది. ముందున్న బెంచిని అసహనంగా ఒక్క తన్ను తన్నింది.
    సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ ప్రారంభించింది.
    'నీవు అలసిపోయినట్టున్నావ్‌' అంది వాళ్ళ  అమ్మ.
    'రేపు మళ్ళీ ప్రయత్నించు' అన్నాడు వాళ్ళ నాన్న.
    'ఇది చాలా సులువు' అన్నాడు వాళ్ళ అన్నయ్య.
    జ్యోతికి వాళ్ళ మాటలు పట్టుదలను పెంచాయి. కోపంగా రిబ్బన్లు తీసికొని మంచం పైకి వెళ్ళింది.
     ఆ రాత్రి చాలా సేపటివరకు కుచ్చులు వేసేందుకు ప్రయత్నించింది.
     ఆ ప్రొద్దున్నే జ్యోతి వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్యలు లేచి చూసి ఆశ్చర్యపోయారు. గదంతా కుచ్చులు వేసి ఉన్నాయి. కుర్చీలకు, టేబుల్‌కు, వాళ్ళ నాన్న, అన్నయ్యల బూట్లకు, కుక్క పిల్ల మెడకు అన్నింటికీ కుచ్చులు వేసి ఉన్నాయి. జ్యోతి అలసిపోయినట్లుగా మంచం పైన పడుకుని ఉంది.
    ''నాకు తెలుసు జ్యోతికి తప్పకుండా కుచ్చులు వేయడం వస్తుందని'' అన్నాడు వాళ్ళ నాన్న.
    ''సాధన చేస్తే ఏ పనైనా సులువుగా చేయవచ్చు. మన జ్యోతి చాలా కష్టపడింది'' అంది వాళ్ళ అమ్మ.
    అప్పుడే లేచిన జ్యోతి - 'ఇది చాలా సులువు' అంది వాళ్ళ అన్నయ్య వైపు నవ్వుతూ ఆనందంగా చూస్తూ.
    -డా|| కృష్ణకుమారి