Friday, June 25, 2010

అభినందన

మాస్టారు ఆ రోజు హాఫియర్లీ పరీక్ష పేపర్లు  ఇస్తున్నారు. పిల్లలంతా ఆసక్తిగా మార్కుల కోసం ఎదురుచూస్తున్నారు. మూడు సబ్జెక్టుల్లో మహేష్‌, మిగిలిన మూడు సబ్జెక్టుల్లో గోపి ఫస్ట్‌ వచ్చారు. మాస్టారు వారిద్దరిని పిలిచి అభినందించారు.
''మీరు చదువు విషయంలో ఇలా పోటీ పడటం నాకు చాలా ఆనందంగా ఉంది.ఏ విషయంలోనైనా పోటీ ఉన్నప్పుడే రాణిస్తారు.మీరిద్దరూ ఇలాగే శ్రద్ధగా చదువుకోండి.'' అన్నారు మాస్టారు.
'అలాగే' అన్నారు మహేష్‌, గోపి. మూడు సబ్జెక్టుల్లో ఫస్ట్‌ వచ్చినందుకు గోపి మహేష్‌ను అభినందించాడు. మహేష్‌ మాత్రం ముఖం అదోలా పెట్టి వెళ్ళిపోయాడు.
వాళ్ళిద్దరు కేవలం చదువులోనే కాకుండా క్విజ్‌,వ్యాసరచన పోటీ, చదరంగం లాంటి అన్ని విషయాల్లోను పోటిపడతారు. మహేష్‌ తనకు రాని ఆటల్లో కూడా గోపికి పోటిగా ఉండేవాడు. గోపీకి బహుమతి వస్తే సహించేవాడు కాదు.
వారం రోజుల తర్వాత జరిగే ఈతపోటిల్లో పాల్గొనేందుకు పేరు ఇచ్చాడు గోపి. గత రెండేళ్ళుగా గోపి ఈత పోటీల్లో ఫస్ట్‌ వస్తున్నాడు. మహేష్‌ కూడా తన పేరు ఇచ్చాడు. అది చూసి గోపి-
''మహేష్‌! నీకు ఈత రాదుకదా ఎలా ఈదుతావ్‌'' అన్నాడు.
''ఏం పరవాలేదు. వారం రోజుల్లో ఈత నేర్చుకుని ఈదుతా. నేను పాల్గొంటే నీకు భయంగా ఉందా?'' అన్నాడు మహేష్‌ ఎగతాళిచేస్తూ.
ఈతపోటీల రోజు రానే వచ్చింది. అందరూ ఒకరికొకరు 'విష్‌ యూ ఆల్‌ ది బెస్ట్‌' అని చెప్పుకున్నారు. మహేష్‌ మాత్రం గోపికి చెప్పలేదు.
పోటీి ప్రారంభమయ్యింది. పిల్లలందరు గమ్యం వైపు ఈదుతూ వెళుతున్నారు. కొంత దూరం తనతో సమానంగా వచ్చిన మహేష్‌ వెనకబడటం గమనించాడు. గోపి తనను దాటి వెళ్ళడంతో మహేష్‌ రొప్పుతూ ఈదబోయాడు. ఈలోగా దమ్ము పట్టడం కష్టమవడంతో నీళ్ళలో మునిగిపోయాడు.
ఒడ్డున ఉన్న వాళ్ళంతా 'మహేష్‌' అంటూ అరవసాగారు. ముందు వెళ్తున్న గోపి వెనకకు తిరిగి మహేష్‌ నీళ్ళలో మునిగి పోవడం చూసి తొందరగా మహేష్‌ దగ్గరికి వచ్చి అతడిని ఒడుపుగా పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. కాసేపు ప్రథమ చికిత్స చేసేసరికి మహేష్‌ మెల్లిగా తెప్పరిల్లాడు.
మహేష్‌ గోపికి కనీసం 'థాంక్స్‌' అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు జిల్లా జడ్జి విజేతలకు బహుమతులు అందచేశాడు. సాహసంతో మహేష్‌ను రక్షించినందుకు గోపికి ప్రత్యేక బహుమతిని ఇచ్చి మెచ్చుకున్నాడు.
గోపి మైక్‌ వద్దకువెళ్ళి 'మిత్రులారా! నేను చదువులో, ఆటల్లో శ్రద్ధ వహించడానికి మహేష్‌ పరోక్ష ప్రేరణ, అటువంటి మహేష్‌ వారం రోజుల్లో ఈత నేర్చుకుని నాకు పోటిగా ఎంతో సాహసంగా ఈదాడు. అతని పట్టుదల చూసి, నా ఈ బహుమతిని మహేష్‌కు ఇవ్వాలనిపిస్తున్నది. అంటూ మహేష్‌ను స్టేజి పైకి పిలిచి బహుమతిని మహేష్‌కు అందించాడు.
గోపి మాటలకు మహేష్‌ మనసు కదిలిపోయింది. 'తను ఈర్షతో గోపికి పోటిగా నిలబడితే గోపి దాన్ని మెచ్చుకుని తన బహుమతిని నాకు ఇస్తున్నాడు. దేనికైనా పోటీ పడాలి. కాని ఎదుటివాడిని కించ పరచేలా ఉండకూడదు. అలాగే పోటీలో గెలిచిన, ఓడిన సరదాగా తీసుకోవాలి. ఒకవేళ ఓడితే తర్వాత గెలిచేందుకు పట్టుదలతో కృషి చేయాలి. అంతేగాని ఈర్ష్య పడొద్దు' అనుకుంటూ స్టేజిపైన ఆనందంతో గోపిని కౌగిలించుకున్నాడు మహేష్‌.
-- యన్‌.యస్‌.శర్మ