Friday, June 25, 2010

కుడి ఎడమైతే

రోజు ఆదివారం!
పాఠశాలకు సెలవు.
పొద్దున్నే లేచి స్నానం చేసి తయారయ్యాను. ఆ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్న కూడా ఇంటి దగ్గరే ఉన్నారు.
    తొందరగా తయారయి, అమ్మ టిఫిన్‌ తినమని పిలుస్తున్నా వినక పరిగెత్తుకొచ్చి దొడ్లో ఉన్న సైకిల్‌ తీశాను.
    నేను ఈ మధ్యనే సైకిల్‌ తొక్కడం నేర్చుకున్నాను. సైకిల్‌ తొక్కడం కొద్దిగా వచ్చు. నడిచేటప్పుడూ లేదా ఏదైనా వాహనం నడిపేటప్పుడు 'ఎడమ నుండి వెళ్ళాలని' మాష్టారు చెప్పిన మాటలు నాకు చాలా గుర్తు.
    సైకిల్‌ తీసి రోడ్డుపైకి వచ్చి తొక్కడం ప్రారంభించాను. ''నాకు సైకిల్‌ తొక్కడం వచ్చు'' అని పక్క వీధిలోని మా మామయ్యకు చూపెట్టేందుకు నా తొందర. మెల్లిగా రోడ్డుకు ఎడమ వైపు నుండి సైకిలు తొక్కుతూ ఎలాగైతేనేం మా మామయ్య ఇంటికి వెళ్ళాను.
    ''నాకు సైకిల్‌ తొక్కడం వచ్చు'' అని చెప్పగానే మా మమయ్య, అత్తమ్మ చాలా సంతోషించారు. నాకు కాస్త గర్వం అనిపించింది. వాళ్ళింట్లో టిఫిన్‌ చేసి మళ్ళీ సైకిల్‌పై మా ఇంటికి బయలుదేరాను. నాకు ఎదురుగా ఓ వ్యక్తి సైకిల్‌ పై వస్తున్నాడు.
    'రోడ్డుకు ఎడమ వైపు నుండి వెళ్ళండి' అని అన్నాను.
    ఆ వ్యక్తి నా వైపు వింతగా చూసుకుంటూ వెళ్ళాడు. కాసేపటికి ఇంకో వ్యక్తి అలాగే రావటం చూసి మళ్ళీ అదే మాట అన్నాను.
    అతను కూడా నావైపు అదోలా చూసి వెళ్ళిపోయాడు. నాకేం అర్థం కాలేదు.
    ఎదురుగా మా నాన్నగారు సైకిల్‌పై వస్తున్నారు.
    మళ్ళీ అదే మాట అన్నాను.
    మా నాన్న సైకిల్‌ ఆపి ''ఏరా నీ కుడిచేయి, ఎడమ చేయి మరిచిపోయావా. కుడిచేయి వైపు వస్తూ నాకే చెపుతున్నావ్‌'' అని అడిగారు.
    అప్పుడు గానీ నాకు అర్థం కాలేదు.
    నేను వెళ్ళేటప్పుడు ఎడమ వైపే వెళ్ళాను. కానీ మళ్ళీ వచ్చేటప్పుడు అదే ఎడమవైపు అనుకుని అలాగే వస్తున్నాను.
---- (గోదావరి ఖని నుంచి వంశీకృష్ణ పంపిన కథ)