Friday, June 25, 2010

సంతృప్తి

కరుణ పుస్తకాల దుకాణం ముందు ఆగింది. దుకాణం రద్దీగా ఉంది. అయినప్పటికీ కరుణ ఆగడానికి లేదు. ఇంటికి త్వరగా వెళ్ళవలసి ఉంది.
    అయిదు రూపాయల నోటును దుకాణదారుడికి ఇచ్చి, ''రెండు వందల పేజీల రూళ్ళ నోటు పుస్తకం ఇవ్వండి'' అంది.
    దుకాణదారుడు అయిదు రూపాయల నోటు తీసుకున్నాడు. కరుణ అడిగిన నోటుపుస్తకం ఇచ్చి గళ్ళాపెట్టె వెతికి, మిగతా చిల్లర ఇవ్వబోయాడు.
    మరో కొనుగోలుదారుడు అతడికి పది రూపాయల నోటు ఇచ్చి తనకి కావలసిన పుస్తకాల జాబితా చెప్పాడు.
    దుకాణదారుడు ఓర్పుగా అతడికి కావలసిన పుస్తకాలను ఎంచి ఇచ్చాడు. ఆ కొనుగోలుదారుడు వెళ్ళిపోయాడు.
    ''నాకు చిల్లర ఇవ్వలేదండి'' అంది కరుణ
    దుకాణదారుడు ఒక్కక్షణం పాటు గుర్తుకు తెచ్చుకుని, కరుణ చేతిలో ఆరు రూపాయలుంచాడు.
    కరుణ బిత్తరపోయింది.
    తాను ఇచ్చింది అయిదు రూపాయల నోటే! తనకు తిరిగి ఒక రూపాయి మాత్రమే ఇవ్వవలసిన దుకాణదారుడు పొరబాటు పడ్డాడు.
    రద్దీలోంచి ఇవతలికి వచ్చింది కరుణ.
    ఆమెలో ఒక్క పక్క ఆనందం, మరోపక్క గాభరా...దుకాణదారుడు తన తప్పు గ్రహించి తిరిగి పిలవడు కదా!
    త్వరత్వరగా ఇల్లు చేరుకుంది కరుణ.
    తనకి అయిదు రూపాయల లాభం ఎంత అదృష్టం. అయిదు రూపాయలతో ఎన్నో కొనుక్కోవచ్చు.
     ఆ రాత్రంతా కరుణకు నిద్ర పట్టలేదు.
    మరుసటి రోజు కరుణ ఆ దుకాణం ముందు నుండి వెళ్తోంది. దుకాణదారుడిని చూసి అనుకోకుండా వణికింది. ఆ రోజు సాయంకాలం పాఠశాల నుండి తిరిగి వస్తూంటే అదే వణుకు.
    దుకాణదారుడు తన కొడుకును దండిస్తున్నాడు.
    కరుణకు క్రమంగా అర్థమవుతోంది.
    నిన్న కొడుకు దుకాణంలో కొద్దిసేపు మాత్రమే కూర్చున్నాడట. ఉండవలసిన సొమ్ములో అయిదు రూపాయలు తగ్గాయి.
    కరుణకు తెలుసు.
    దుకాణదారుడి పరాకు వల్ల తగ్గిపోయిన డబ్బే అది. ఆ డబ్బు తన వద్ద ఉంది.
    కరుణ చప్పున ఇంటికి పరుగెత్తి అయిదు రూపాయల నోటుతో తిరిగి వచ్చింది. సంగతి చెప్పి దుకాణదారుడికి ఆ నోటుని అందించింది. ఆమెలో కొత్త సంతృప్తి కలిగింది.
    అయిదు రూపాయలతో అనుభవించే సంతృప్తి కన్నా ఆ డబ్బు తిరిగి దుకాణదారుడికి ఇవ్వడం వల్ల ఎక్కువ సంతృప్తి కలిగింది. అంతేకాదు. ఆమెలో అటు తర్వాత వణుకు పుట్టలేదు.
    - ఎం.వి.వి సత్యనారాయణ