Friday, June 25, 2010

జీవనదాత సూర్యుడు

సూర్యుడు ప్రపంచానికి వెలుగును, వేడిని ఇస్తాడు. అంత వేడి వెలుగు సూర్యునిలో ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అణుశక్తి, పరమాణు శక్తి, అణుబాంబు, హైడ్రోజన్‌ బాంబు గురించి మీరు విన్నారు కదా. చిన్నదిగా ఉండే అణువులో ఎంతో శక్తి దాగి ఉంటుంది. అణువును ఛేదించగలిగితే ఆ శక్తి బయటకు వస్తుంది. అలా అణువును ఛేదించి విపరీతమైన శక్తిని వెలువరించే పరికరమే అణుబాంబు. అణువుల్లో చిన్నది పరమాణువు. ఇందుకు ఉదాహరణ హైడ్రోజన్‌ పరమాణువు. ఇందులో మరింత శక్తి ఉంటుంది. అందుకే హైడ్రోజన్‌ బాంబు అణుబాంబు  కన్నా శక్తివంతమైంది. అణువును ఛేదించడం చాలా కష్టమైన పని. దానికి ఎంతో శాస్త్రవిజ్ఞానం, సున్నితమైన శాస్త్రపరికరాలు కావాలి. ఇవన్నీ ఉన్నా కూడా అణువును ఛేదించడం చాలా కష్టం.
    మనం ఇక్కడ ఇంత కష్టపడినా సాధ్యం కాని అణువిచ్ఛేదనం సూర్యునిలో దానంతట అదే జరుగుతుంది. మండే సూర్యునిలో ఉన్న మూలకాలు గాలి రూపంలో ఉంటాయి. వాటిలో హైడ్రోజన్‌ పరమాణువులు ఎల్లప్పుడు విడిపోతూ ఎంతో వేడిని, వెలుతురును వెదజల్లుతుంటాయి. ఆ వేడి, వెలుతురులే  భూమిపైకి కాంతికిరణాల రూపంలో ప్రసరిస్తున్నాయి. ఇందులోని వేడిని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమలో నిల్వ చేసుకుంటాయి. ఆ మొక్కల భాగాలను జీవకోటి స్వీకరించడం ద్వారా ఆ వేడిని మనుషులతో సహా ఇతర జంతువులు కూడా వినియోగించుకొంటున్నాయి.
    మనుషుల్లో జంతువుల్లో జరిగే జీవన వ్యాపారాలన్నింటికి సూర్యశక్తే మూలాధారం అన్నది అర్థమైంది కదా. మొక్కల్లో ఆహారం సూర్యరశ్మి వలన ఉత్పన్నమవుతుందని, సూర్యకిరణాల సాయంతో మానవ శరీరంలో 'డి' విటమిన్‌ ఉత్పత్తవుతుందని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. అందుకే వైద్యులు చంటిపిల్లల్ని లేత ఎండలో పడుకోబెట్టాలని చెప్తుంటారు. ప్రకృతి వైద్యులు సూర్యరశ్మిని అనేక చర్మ వ్యాధులను నయం చేయడానికి వినియోగిస్తున్నారు. విదేశాల్లో సూర్యరశ్మి కోసం 'సూర్య స్నానాలు' (సన్‌బాత్‌) చేస్తారు. మన దేశంలో ఆరోగ్యపరంగా సూర్య నమస్కారాలని అనాదిగా ఉన్నాయి. ఇన్ని రకాలుగా సూర్యుడు మన జీవితంలో ముడిపడి ఉన్నాడు.
    భూమి నుండి చూస్తే సూర్యుడు ఫుట్‌బాల్‌ అంత పరిమాణంలో కనిపిస్తాడు. కాని సూర్యగ్రహం భూమి కన్నా కొన్ని వందల రెట్లు పెద్దదిగా ఉంటుంది. దాని వ్యాసం 14 లక్షల కిలోమీటర్లు. ఇది భూమి వ్యాసం కన్నా 109 రెట్లు ఎక్కువ. భూమి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడి నుండి చూస్తే అంత చిన్నగా కన్పిస్తున్నాడు. అంత దూరంనుండే నిప్పులు కురిపించే ఎండను వెదజల్లుతున్నాడు. అక్కడికి వెళితే ఎంత వేడి ఉంటుందో ఊహించండి. అమ్మో! మాడి మసైపోము! ఊహించడానికే భయం వేయటం లేదూ...?!
    సూర్యుడి కన్నా భూమి చిన్నది. భూమి కన్నా చందమామ మరింత చిన్నది. చందమామ కురిపించే చల్లని వెన్నెల వెలుతురు కూడా సూర్యుడిదే. ఇది ఎట్లాగంటే సూర్య కిరణాలు చంద్రుని మీద పడి అవి పరావర్తనం చెంది భూమి పైకి వస్తాయి. ఈ క్రమంలో ఆ కిరణాలలోని వేడిని కాస్త చంద్రుడు భరిస్తాడు. మనకు చల్లని కిరణాలను ఇస్తాడు. అందుకే చందమామ మంచివాడు. పిల్లలకు మామ వాడు.