Tuesday, June 22, 2010

తెలియకచేసే పొరపాట్లు

మానవుడు జీవితంలో అనేకసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు కొంతమందిని వెనకనుండి చూసి తెలిసిన మనిషిగా భావించి చప్పట్లుకొట్టి తర్వాత సారీ చెప్పటం, కొందరిని చూసినపుడు పోలికల్ని బట్టి 'ఫలానవారు మీ బంధువులా?' అని అడిగాక తర్వాత పొరబడ్డామని గ్రహించటం, ఇలా అనేక రకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు. మానవులే కాక పక్షులు, జంతువులు మొదలైన జీవరాశులు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తాయని శాస్త్రవేత్తలు ఋజువులతో సహా చెబుతున్నారు.
ఉదాహరణకు ఆఫ్రిన్‌ ఆర్కిడ్‌ అనే మొక్క పువ్వు అచ్చం ఆడ తేనెటీగలా ఉంటుందిట. దీన్ని నిజంగా ఆడతేనెటీగని భావించి మగతేనెటీగలు ఆ  పూవుపై వాలతాయి. ఫలితంగా అవి పూవును తమ రెక్కలకంటుకున్న అదే జాతి పుప్పొడితో ఫలదీకరణం చేస్తాయి.
అలాగే ఓ కోడి పెట్ట నుండి పిల్లల్ని దూరం చేసినపుడు ఆకోడి పిల్లి పిల్లలనయినా తన పిల్లలేనని భావించి వాటిని తన రెక్కల కింద ఉంచుకొని కాపాడుతూ వస్తుందట. పిల్లి పిల్లలు కూడా కోడిని తమ తల్లిగానే భావించి మొదట్లో దాంతో ప్రేమగా ఆడుకొంటాయట. కొంతకాలానికి పిల్లి పిల్లలు కోడి తమ తల్లికాదని గ్రహించి కోడినుండి దూరంగా వెళ్ళిపోతాయి.
ఇదే విధంగా ఓ జాతికి చెందిన పక్షి తనగూడు నెవరయినా నాశనం చేసినప్పుడు తన పిల్లలకోసం తెచ్చే ఆహారాన్ని దగ్గర చెరువులో ఉండే చేపపిల్లలకు అందిస్తుందట. ఆ పిట్ట చెరువు ఒడ్డుకు రాగానే చేపపిల్లలు పిట్ట దగ్గరకు నోరు తెరుచుకుని వెళ్తాయి. చూశారా? తప్పులు మానవులేగాక జీవరాశులన్నీ చేస్తాయి.
-గిరిజానారాయణ్‌
పలు ప్రయోజనాల 'కోడిగుడ్డు'
ఒక కోడి ఏడాదికి దాదాపు 180 గుడ్లు పెడుతుంది. కోడి గుడ్డులో బి1,బి2 విటమిన్లే కాక ప్రొటీనులు కూడా ఉంటాయి. కోడిగుడ్డు తినడానికి గాక ఐవరీ పాలిష్‌, రంగులు, జిగురు, పుస్తకాల బైండింగ్‌, మందులు, పుస్తకాల ముద్రణకు ఉపయోగించే సిరా, సబ్బు, వార్నష్‌, వైన్‌, ఐస్‌క్రిమ్‌, రొట్టెల తయారీలలో కూడా వాడుతారు.