కలకత్తాలో దుండగులు అపహరించుకు పోయిన పన్నెండేళ్ల అబ్బాయి గురించి కదిలించివేసే నాటకీయమైన కథ ఫతిక్ చంద్. ఒకవైపు సంపన్నుల హృదయం లేనితనాన్నీ, మరోవైపు పేదవాళ్ల ప్రగాఢమైన, అర్థవంతమైన సానుభూతినీ ఇది చిత్రిస్తుంది. జీవితానికి అద్దం పట్టిన ఈ అద్భుతమైన నవల మతిమరుపునకు గురై, తనను తాను ఫతిక్ చంద్ అని పిలుచుకొనే ఒక పిల్లవాడి గురించి ఆర్థ్రమైన చిత్రణను ఇస్తుంది. ఫతిక్ చిట్టచివరకు ఇంటికి చేరటానికి సాయపడిన గారడీ వాడైన హరున్ గురించీ అంత ఆర్థ్రంగా చిత్రిస్తుంది. పిల్లవాడికీ, గారడీ వాడికీ మధ్య పెరిగిన అనుబంధాన్ని నవలకు ఇతివృత్తంగా తీసుకొని ప్రేరణాత్మకంగా ఈ నవలలో వివరించారు. ఈ నవల ఆధారంగా తీసిన సినిమా బెంగాల్‌లో గొప్ప విజయాన్ని సాధించింది.
సత్యజిత్ రే బెంగాళీలో వ్రాసిన పుస్తకాన్ని లీలా రే ఆంగ్లం లోకి అనువదించారు. హరిపురుషోత్తమ రావు తెలుగులోకి అనువదించిన ఈ పుస్తకాన్ని 1991 లో బాల సాహితి బుక్ ట్రస్ట్ ప్రచురించింది. కాగా 2009వ సంవత్సరంలో పిల్లల పుస్తక ప్రచురణ సంస్థ 'పాల పిట్ట' ఈ పుస్తకాన్ని ప్రచురించింది.
