Saturday, June 26, 2010

సైకిల్‌కు పాతికేళ్ల గ్యారంటీ


మనం ఏదైనా సైకిల్‌ను కొంటే  దానికి మహా అయితే ఏడాది గ్యారంటీ ఇస్తారు. కానీ దీనికి భిన్నంగా, 25 ఏళ్లు పాటు సైకిల్‌కు  గ్యారంటీ ఇస్తానంటూ ఓ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ తరహా గ్యారంటీ దేశంలోనే ప్రప్రథమం. అయితే ఇందుకు కొంత అదనంగా చెల్లించాలని చెప్తోంది. ఈ కంపెనీ 'బుల్‌పవర్‌' పేరుతో కొత్త సైకిళ్ల శ్రేణిని మార్కెట్లోకి తీసుకువచ్చిన  హై బర్డ్‌. ఇది లూధియానా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ.
''సాధారణ శ్రేణికి చెందిన సైకిళ్ల ధరలు రూ.2,500 నుంచి రూ.3,000 మధ్య ఉంటాయి. బుల్‌పవర్‌ సైకిల్‌ ధర రూ.4,000 ఉంటుంది. సైకిల్‌లో కీలకమైన భాగాలైన ఫ్రేమ్‌, ఫోర్క్‌లకు ఈ గ్యారంటీ వర్తిస్తుంది. ఈ సైకిల్‌ను కొనుగోలు చేసిన తరువాత 25 సంవత్సరాల్లో ఎపుడైనా ఫ్రేమ్‌, ఫోర్క్‌లలో లోపం తలెత్తితే మేం వాటిని మార్చి కొత్తవి వేసి ఇస్తాం. ఈ మోడల్‌కు వాడిన ముడిపదార్థాలను ప్రత్యేక క్వాలిటీ లోహంతో రూపొందించాం. భారీ బరువును తట్టుకొనేటట్లు దీనికి విశిష్ట డిజైన్‌ను అందించాం.'' అని కంపెనీ ఛైర్మన్‌ అంటున్నారు. 

నాట్యం చేసే సబ్బు బుడగలు

సబ్బు బుడగలను తయారు చేసే పద్ధతి అందరికీ తెలిసినదే. చిక్కని సబ్బు ద్రవంలో బొబ్బాసి గొట్టం ముంచి, గొట్టపు రెండో కొన నోట్లో పెట్టుకొని నెమ్మదిగా ఊదితే సబ్బు బుడగలు తయారవుతాయి. ఈ బుడగల చేత నాట్యం చేయించే కిటుకు ఒకటి ఉంది. అదిప్పుడు మీకు చెపుతాను.
లోతైన విశాలమైన గాజు గిన్నెలో నాలుగైదు చెమ్చాల కార్బన్‌ టెట్రా క్లోరైడ్‌ ద్రవం పోసి, ఆ గిన్నెను వేడి నీళ్ళు పోసిన పళ్ళెంలో ఉంచాలి. అయిదు, పది నిమిషాలు పోయాక ఆ గాజు గిన్నెలోకి మూడు, నాలుగు సబ్బు బుడగలు నింపాదిగా విడిచి చూడండి. ఆ సబ్బు బుడగలు పైకీ, కిందికీ తమాషాగా నాట్యం చేస్తాయి. సబ్బు బుడగలు తేలిక అయినప్పటికీ గాలి కన్నా బరువైనవి కావడం చేత నిశ్చలమైన గాలిలో నెమ్మదిగా కిందికి దిగుతాయి. కానీ, కార్బన్‌ టెట్రాక్లోరైడ్‌ ఆవిరి గాలి కన్నా సుమారు ఐదు రెట్లు బరువైనది కావడం చేత గాలితో నిండిన సబ్బు బుడగలు ఈ ఆవిరిలో పైకి తేలుతాయి, హైడ్రోజన్‌ నింపిన రబ్బరు బుడగలు గాలిలో పైకి తేలినట్లే. అయితే గాజు గిన్నెలో మట్టు దగ్గర ఈ ఆవిరి ఎక్కువ దట్టంగాను, పైకి వెళ్ళిన కొద్దీ పలుచ గానూ ఉండటం చేత సబ్బు బుడగలు కిందికి దిగుతూ మట్టు దగ్గరకి రాగానే కనిపించని చిత్రమైన 'కుషన్‌' ఏదో ఉన్నట్లు పైకి గెంటబడుతాయి. బుడగలు పైకి వెళ్ళిన కొద్దీ వాటి బరువును నిలబెట్ట గలిగినంత దట్టమైన ఆవిరి లేకపోవడం చేత అవి మళ్ళీ కిందికి దిగుతాయి.
    గాజు గిన్నెలోని కార్బన్‌ టెట్రా క్లోరైడ్‌ పూర్తిగా ఆవిరి అయిపోయేదాకా సబ్బు బుడగలు చూస్తున్న వారికి ఈ విధంగా నృత్య వినోదంతో కాలక్షేపం కలిగిస్తాయి.

Friday, June 25, 2010

ఉడుత - తోడేలు

    అడవిలో ఒక ఉడుత ఉండేది. అది రోజూ అడవిలో దొరికే పండ్లు, లేత చిగుళ్ళు తిని ఆనందంగా ఒక చెట్టు మీది నుండి ఇంకో చెట్టు మీదికి దుముకుతూ ఉండేది.
    ఒక రోజు ఉడుత ఒక చెట్టు మీది నుండి ఇంకో చెట్టు మీదికి దుముకుతూ పట్టు తప్పి ఆ చెట్టు కింద నిద్రిస్తున్న తోడేలుపై పడింది. తోడేలుకు నిద్ర చెడింది.
    వెంటనే అది కోపంగా ఉడుతను పట్టుకుని ''నా నిద్ర చెడగొడతావా? నిన్నిప్పుడు ఏం చేస్తానో చూడు. నమలకుండా, గుటుక్కున మింగేస్తాను'' అంది.
    ''దయచేసి నన్ను ఒదిలిపెట్టు'' అని బతిమాలింది ఉడుత.
    ''సరే నిన్ను ఒదిలిపెడతాను. కానీ నేనడిగే ప్రశ్నకు జవాబు చెప్పు'' అంది తోడేలు.
    ''సరే'' అన్నది ఉడుత.
    'మీరు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు. ఆడుతూ, గంతులేస్తూ ఏ చీకూ చింత లేకుండా ఉంటున్నారు. మేము ఎప్పుడూ ఏదో అశాంతితో చికాకుగా ఉంటాము. ఎందుకో చెప్పు' అంది
    దానికి ఉడుత....
'నిన్ను చూస్తుంటే భయమేస్తుంది. నన్ను ఒదిలిపెట్టు. చెట్టుపైకి వెళ్ళి చెబుతా' అంది.
'సరే'నని తోడేలు ఉడుతను ఒదిలిపెట్టింది.
ఉడుత వెంటనే చెట్టు కొమ్మ పైకి వెళ్ళి 'మా మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచనలుండవు. ఎవరికీ హాని చేయాలనే తలంపే రాదు. మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుంటే సంతోషంగా ఉండొచ్చు. మీ మనసులో ఎప్పుడూ ఏవో చెడ్డ ఆలోచనలుంటాయి. అవి మీ మనస్సుకు శాంతి లేకుండా చేస్తాయి. అందుకే మీరు ఎప్పుడూ అలా అశాంతితో ఉంటారు' అంది.
    అది విని తోడేలు నిజం తెలుసుకొని సిగ్గు పడింది.
(లియో టాల్‌స్టాయ్‌ కథ ఆధారంగా)

సాధన

జ్యోతికి చాలా కోపంగా ఉంది!
బుంగమూతి పెట్టి కుర్చీలో కూర్చుంది. తన పక్కన కూర్చుని తన వైపే తోక ఆడిస్తూ కూర్చున్న కుక్కపిల్లను అకారణంగా ఒక్కటి కొట్టింది. అది కుయ్‌మంటూ బయటకు పరిగెత్తింది. తన ఎదురుగా టేబుల్‌పై ఉన్న రిబ్బన్లను, బూట్లను చూస్తుంది కోపంగా.
    జ్యోతికి ఆరేళ్ళ వయస్సు ఉంటుంది. స్కూలుకు వెళ్తుంది. బుద్ధిగా చదువుకుంటుంది. ఈ రోజు మాత్రం తనపై తనకే చాలా కోపంగా ఉంది. ఎవరితోనూ మాట్లాడడం లేదు.
    'నిన్నటి నుండి రిబ్బన్‌తో కుచ్చులు వేయడం నేర్చుకోవాలని ప్రయత్నిస్తుంది కానీ రావటం లేదు. తనకు రిబ్బనుతో ముడి వేయవచ్చును. కాని కుచ్చు వేయటమే రావటం లేదు.'' ఇదే జ్యోతి కోపానికి కారణం. ప్రొద్దుటి నుండి మాట్లాడక కుర్చీలో కూర్చున్న జ్యోతిని చూసి వాళ్ళ నాన్న
''మళ్ళీ ఓసారి ప్రయత్నించమ్మ' అన్నాడు.
    'సాధన చెయ్యి అదే వస్తుంది' అంది అమ్మ.
    'ఇది చాలా సులువు' అన్నాడు వాళ్ళ అన్నయ్య.
    జ్యోతికి వాళ్ళందరు ఎగతాళి చేస్తున్నట్లు అనిపించింది. మళ్ళీ టేబుల్‌ పైన ఉన్న రిబ్బను తీసుకొని కుచ్చులు వేయటం ప్రారంభించింది. ఉహు! రావట్లేదు. కాసేపటికి అలసిపోయింది. కుచ్చులు వేయటం మాత్రం రాలేదు. సాయంత్రం వాళ్ళ నాన్న బయటి నుంచి వచ్చి
    'కొద్దిగా టైమ్‌ తీసికొని నిదానంగా వెయ్యి' అన్నాడు.
    'మళ్ళీ ప్రారంభించు' అంది వాళ్ళ అమ్మ.
    'కుచ్చులు వేయడం చాలా సులువు' అన్నాడు నవ్వుతూ వాళ్ళ అన్నయ్య. తను అలాగే ప్రయత్నిస్తే కుచ్చు వేయగలుగుతాననుకుంది. మరుసటి రోజు స్కూల్లో తన బూట్లకున్న  దారాలు విప్పి సాధన చేసింది. అయినా రాలేదు. చాలా కోపం వచ్చింది. ముందున్న బెంచిని అసహనంగా ఒక్క తన్ను తన్నింది.
    సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ ప్రారంభించింది.
    'నీవు అలసిపోయినట్టున్నావ్‌' అంది వాళ్ళ  అమ్మ.
    'రేపు మళ్ళీ ప్రయత్నించు' అన్నాడు వాళ్ళ నాన్న.
    'ఇది చాలా సులువు' అన్నాడు వాళ్ళ అన్నయ్య.
    జ్యోతికి వాళ్ళ మాటలు పట్టుదలను పెంచాయి. కోపంగా రిబ్బన్లు తీసికొని మంచం పైకి వెళ్ళింది.
     ఆ రాత్రి చాలా సేపటివరకు కుచ్చులు వేసేందుకు ప్రయత్నించింది.
     ఆ ప్రొద్దున్నే జ్యోతి వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్యలు లేచి చూసి ఆశ్చర్యపోయారు. గదంతా కుచ్చులు వేసి ఉన్నాయి. కుర్చీలకు, టేబుల్‌కు, వాళ్ళ నాన్న, అన్నయ్యల బూట్లకు, కుక్క పిల్ల మెడకు అన్నింటికీ కుచ్చులు వేసి ఉన్నాయి. జ్యోతి అలసిపోయినట్లుగా మంచం పైన పడుకుని ఉంది.
    ''నాకు తెలుసు జ్యోతికి తప్పకుండా కుచ్చులు వేయడం వస్తుందని'' అన్నాడు వాళ్ళ నాన్న.
    ''సాధన చేస్తే ఏ పనైనా సులువుగా చేయవచ్చు. మన జ్యోతి చాలా కష్టపడింది'' అంది వాళ్ళ అమ్మ.
    అప్పుడే లేచిన జ్యోతి - 'ఇది చాలా సులువు' అంది వాళ్ళ అన్నయ్య వైపు నవ్వుతూ ఆనందంగా చూస్తూ.
    -డా|| కృష్ణకుమారి

సంతృప్తి

కరుణ పుస్తకాల దుకాణం ముందు ఆగింది. దుకాణం రద్దీగా ఉంది. అయినప్పటికీ కరుణ ఆగడానికి లేదు. ఇంటికి త్వరగా వెళ్ళవలసి ఉంది.
    అయిదు రూపాయల నోటును దుకాణదారుడికి ఇచ్చి, ''రెండు వందల పేజీల రూళ్ళ నోటు పుస్తకం ఇవ్వండి'' అంది.
    దుకాణదారుడు అయిదు రూపాయల నోటు తీసుకున్నాడు. కరుణ అడిగిన నోటుపుస్తకం ఇచ్చి గళ్ళాపెట్టె వెతికి, మిగతా చిల్లర ఇవ్వబోయాడు.
    మరో కొనుగోలుదారుడు అతడికి పది రూపాయల నోటు ఇచ్చి తనకి కావలసిన పుస్తకాల జాబితా చెప్పాడు.
    దుకాణదారుడు ఓర్పుగా అతడికి కావలసిన పుస్తకాలను ఎంచి ఇచ్చాడు. ఆ కొనుగోలుదారుడు వెళ్ళిపోయాడు.
    ''నాకు చిల్లర ఇవ్వలేదండి'' అంది కరుణ
    దుకాణదారుడు ఒక్కక్షణం పాటు గుర్తుకు తెచ్చుకుని, కరుణ చేతిలో ఆరు రూపాయలుంచాడు.
    కరుణ బిత్తరపోయింది.
    తాను ఇచ్చింది అయిదు రూపాయల నోటే! తనకు తిరిగి ఒక రూపాయి మాత్రమే ఇవ్వవలసిన దుకాణదారుడు పొరబాటు పడ్డాడు.
    రద్దీలోంచి ఇవతలికి వచ్చింది కరుణ.
    ఆమెలో ఒక్క పక్క ఆనందం, మరోపక్క గాభరా...దుకాణదారుడు తన తప్పు గ్రహించి తిరిగి పిలవడు కదా!
    త్వరత్వరగా ఇల్లు చేరుకుంది కరుణ.
    తనకి అయిదు రూపాయల లాభం ఎంత అదృష్టం. అయిదు రూపాయలతో ఎన్నో కొనుక్కోవచ్చు.
     ఆ రాత్రంతా కరుణకు నిద్ర పట్టలేదు.
    మరుసటి రోజు కరుణ ఆ దుకాణం ముందు నుండి వెళ్తోంది. దుకాణదారుడిని చూసి అనుకోకుండా వణికింది. ఆ రోజు సాయంకాలం పాఠశాల నుండి తిరిగి వస్తూంటే అదే వణుకు.
    దుకాణదారుడు తన కొడుకును దండిస్తున్నాడు.
    కరుణకు క్రమంగా అర్థమవుతోంది.
    నిన్న కొడుకు దుకాణంలో కొద్దిసేపు మాత్రమే కూర్చున్నాడట. ఉండవలసిన సొమ్ములో అయిదు రూపాయలు తగ్గాయి.
    కరుణకు తెలుసు.
    దుకాణదారుడి పరాకు వల్ల తగ్గిపోయిన డబ్బే అది. ఆ డబ్బు తన వద్ద ఉంది.
    కరుణ చప్పున ఇంటికి పరుగెత్తి అయిదు రూపాయల నోటుతో తిరిగి వచ్చింది. సంగతి చెప్పి దుకాణదారుడికి ఆ నోటుని అందించింది. ఆమెలో కొత్త సంతృప్తి కలిగింది.
    అయిదు రూపాయలతో అనుభవించే సంతృప్తి కన్నా ఆ డబ్బు తిరిగి దుకాణదారుడికి ఇవ్వడం వల్ల ఎక్కువ సంతృప్తి కలిగింది. అంతేకాదు. ఆమెలో అటు తర్వాత వణుకు పుట్టలేదు.
    - ఎం.వి.వి సత్యనారాయణ

కాపీ కొట్టాడు

పరీక్ష హాలు నుండి బయటికి వచ్చిన హెడ్‌మాస్టర్‌, అనిల్‌, సునీల్‌ పోట్లాడు కోవడం చూశారు.
హెడ్‌మాస్టర్‌: మీరిద్దరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు.
అనిల్‌: సార్‌ ఇతను నా పేపరు చూసి కాపీ కొట్టాడు.
హెడ్‌మాస్టర్‌: ఏది కాపీ గొట్టాడు
అనిల్‌: నేను తెల్లపేపరిస్తే వీడు కూడా అలాగే ఇచ్చాడు.
----
గోపి: నాన్నా గోల్కొండ ఎక్కడుంది?
తండ్రి: హైదరాబాద్‌లో.
గోపి: అలాగా! అది బొంబాయిలో ఉంటే ఎంత బావున్ను.
నాన్న: ఎందుకురా?
గోపి: మరి నేను బొంబాయిలో ఉందని రాశాగా!
---
మాష్టారు: తాజ్‌మహల్‌ ఎక్కడుందిరా?
సంతోష్‌: తెలియదండి.
మాష్టారు: అయితే బెంచీ ఎక్కు.
సంతోష్‌: బెంచీ ఎక్కితే కనిపిస్తుందాండి.
---
సతీష్‌: (ఏడుస్తూ...) నాన్నా నా బుడగను రాము పైకి వదిలేశాడు.
నాన్న: ఏరా రాము ఎందుకు వదిలేశావ్‌
రాము: నిన్న మా టీచర్‌ చెప్పింది. భూమికి ఆకర్షణ శక్తి ఉందని. నాకేం తెలుసు భూమి బుడగలను ఆకర్షించదని.

మంత్రి నక్క

అనగా అనగా ఒక అడవి. ఆ అడవికి ఒక సింహం రాజు. నక్క ఆ సింహానికి మంత్రిగా ఉండేది. అది గుంటనక్క. జిత్తులమారి కూడా. అది కపటోపాయంతో మాయమాటలు చెప్పి రోజుకో జంతువును రాజుగారికి ఆహారంగా తీసుకుని వస్తుండేది. ఆ జంతువును చంపి సింహం తినగా మిగిలిన మాంసాన్ని నక్క తింటుండేది. ఇలా తింటుండగా కొన్ని రోజుల తరువాత అడవిలో జంతువులన్నీ అయిపోయాయి. సింహానికి ఆహారం దొరకకపోతే తననే చంపేస్తుందని నక్కకు భయం పట్టుకుంది. చిన్న ఉపాయం ఆలోచించింది.
    'మృగరాజా ఈ అడవిలో జంతువులన్నీ అయిపోయి అటు చివర ఒక పులి మాత్రమే ఉంది. అది మీ దగ్గరకి రానంటుంది. మీరే వెళ్ళి దాన్ని చంపి తినండి' అంది.
    కూర్చున్న దగ్గరికే ఆహారం వస్తుంటే తిని సోమరిగా తయారైంది సింహం. తనిప్పుడు పులితో పోట్లాడి జయించలేదు. ఈ విషయం తెలిసే నక్క కుట్ర పన్నింది.
    సింహానికి నక్క కుట్ర అర్థమైంది.
    ''పులి సంగతి రేపు చూస్తాను. ఇవ్వాల్టికి నువ్వున్నావుగా'' అని నక్క పైకి దూకి గుటకాయస్వాహా చేసింది.
(పిల్లలూ... ఇది పాతకథ. ఎన్నో సార్లు విని ఉంటారు. అందుకే దీన్ని 'అనగా అనగా ఒక కథ' అందాం. ఇలాంటి కథలు మీరు రాసి పంపించవచ్చు. మీ ఫోటో, పేరుతో ప్రచురిస్తాం.)

కుడి ఎడమైతే

రోజు ఆదివారం!
పాఠశాలకు సెలవు.
పొద్దున్నే లేచి స్నానం చేసి తయారయ్యాను. ఆ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్న కూడా ఇంటి దగ్గరే ఉన్నారు.
    తొందరగా తయారయి, అమ్మ టిఫిన్‌ తినమని పిలుస్తున్నా వినక పరిగెత్తుకొచ్చి దొడ్లో ఉన్న సైకిల్‌ తీశాను.
    నేను ఈ మధ్యనే సైకిల్‌ తొక్కడం నేర్చుకున్నాను. సైకిల్‌ తొక్కడం కొద్దిగా వచ్చు. నడిచేటప్పుడూ లేదా ఏదైనా వాహనం నడిపేటప్పుడు 'ఎడమ నుండి వెళ్ళాలని' మాష్టారు చెప్పిన మాటలు నాకు చాలా గుర్తు.
    సైకిల్‌ తీసి రోడ్డుపైకి వచ్చి తొక్కడం ప్రారంభించాను. ''నాకు సైకిల్‌ తొక్కడం వచ్చు'' అని పక్క వీధిలోని మా మామయ్యకు చూపెట్టేందుకు నా తొందర. మెల్లిగా రోడ్డుకు ఎడమ వైపు నుండి సైకిలు తొక్కుతూ ఎలాగైతేనేం మా మామయ్య ఇంటికి వెళ్ళాను.
    ''నాకు సైకిల్‌ తొక్కడం వచ్చు'' అని చెప్పగానే మా మమయ్య, అత్తమ్మ చాలా సంతోషించారు. నాకు కాస్త గర్వం అనిపించింది. వాళ్ళింట్లో టిఫిన్‌ చేసి మళ్ళీ సైకిల్‌పై మా ఇంటికి బయలుదేరాను. నాకు ఎదురుగా ఓ వ్యక్తి సైకిల్‌ పై వస్తున్నాడు.
    'రోడ్డుకు ఎడమ వైపు నుండి వెళ్ళండి' అని అన్నాను.
    ఆ వ్యక్తి నా వైపు వింతగా చూసుకుంటూ వెళ్ళాడు. కాసేపటికి ఇంకో వ్యక్తి అలాగే రావటం చూసి మళ్ళీ అదే మాట అన్నాను.
    అతను కూడా నావైపు అదోలా చూసి వెళ్ళిపోయాడు. నాకేం అర్థం కాలేదు.
    ఎదురుగా మా నాన్నగారు సైకిల్‌పై వస్తున్నారు.
    మళ్ళీ అదే మాట అన్నాను.
    మా నాన్న సైకిల్‌ ఆపి ''ఏరా నీ కుడిచేయి, ఎడమ చేయి మరిచిపోయావా. కుడిచేయి వైపు వస్తూ నాకే చెపుతున్నావ్‌'' అని అడిగారు.
    అప్పుడు గానీ నాకు అర్థం కాలేదు.
    నేను వెళ్ళేటప్పుడు ఎడమ వైపే వెళ్ళాను. కానీ మళ్ళీ వచ్చేటప్పుడు అదే ఎడమవైపు అనుకుని అలాగే వస్తున్నాను.
---- (గోదావరి ఖని నుంచి వంశీకృష్ణ పంపిన కథ)

జీవనదాత సూర్యుడు

సూర్యుడు ప్రపంచానికి వెలుగును, వేడిని ఇస్తాడు. అంత వేడి వెలుగు సూర్యునిలో ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అణుశక్తి, పరమాణు శక్తి, అణుబాంబు, హైడ్రోజన్‌ బాంబు గురించి మీరు విన్నారు కదా. చిన్నదిగా ఉండే అణువులో ఎంతో శక్తి దాగి ఉంటుంది. అణువును ఛేదించగలిగితే ఆ శక్తి బయటకు వస్తుంది. అలా అణువును ఛేదించి విపరీతమైన శక్తిని వెలువరించే పరికరమే అణుబాంబు. అణువుల్లో చిన్నది పరమాణువు. ఇందుకు ఉదాహరణ హైడ్రోజన్‌ పరమాణువు. ఇందులో మరింత శక్తి ఉంటుంది. అందుకే హైడ్రోజన్‌ బాంబు అణుబాంబు  కన్నా శక్తివంతమైంది. అణువును ఛేదించడం చాలా కష్టమైన పని. దానికి ఎంతో శాస్త్రవిజ్ఞానం, సున్నితమైన శాస్త్రపరికరాలు కావాలి. ఇవన్నీ ఉన్నా కూడా అణువును ఛేదించడం చాలా కష్టం.
    మనం ఇక్కడ ఇంత కష్టపడినా సాధ్యం కాని అణువిచ్ఛేదనం సూర్యునిలో దానంతట అదే జరుగుతుంది. మండే సూర్యునిలో ఉన్న మూలకాలు గాలి రూపంలో ఉంటాయి. వాటిలో హైడ్రోజన్‌ పరమాణువులు ఎల్లప్పుడు విడిపోతూ ఎంతో వేడిని, వెలుతురును వెదజల్లుతుంటాయి. ఆ వేడి, వెలుతురులే  భూమిపైకి కాంతికిరణాల రూపంలో ప్రసరిస్తున్నాయి. ఇందులోని వేడిని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమలో నిల్వ చేసుకుంటాయి. ఆ మొక్కల భాగాలను జీవకోటి స్వీకరించడం ద్వారా ఆ వేడిని మనుషులతో సహా ఇతర జంతువులు కూడా వినియోగించుకొంటున్నాయి.
    మనుషుల్లో జంతువుల్లో జరిగే జీవన వ్యాపారాలన్నింటికి సూర్యశక్తే మూలాధారం అన్నది అర్థమైంది కదా. మొక్కల్లో ఆహారం సూర్యరశ్మి వలన ఉత్పన్నమవుతుందని, సూర్యకిరణాల సాయంతో మానవ శరీరంలో 'డి' విటమిన్‌ ఉత్పత్తవుతుందని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. అందుకే వైద్యులు చంటిపిల్లల్ని లేత ఎండలో పడుకోబెట్టాలని చెప్తుంటారు. ప్రకృతి వైద్యులు సూర్యరశ్మిని అనేక చర్మ వ్యాధులను నయం చేయడానికి వినియోగిస్తున్నారు. విదేశాల్లో సూర్యరశ్మి కోసం 'సూర్య స్నానాలు' (సన్‌బాత్‌) చేస్తారు. మన దేశంలో ఆరోగ్యపరంగా సూర్య నమస్కారాలని అనాదిగా ఉన్నాయి. ఇన్ని రకాలుగా సూర్యుడు మన జీవితంలో ముడిపడి ఉన్నాడు.
    భూమి నుండి చూస్తే సూర్యుడు ఫుట్‌బాల్‌ అంత పరిమాణంలో కనిపిస్తాడు. కాని సూర్యగ్రహం భూమి కన్నా కొన్ని వందల రెట్లు పెద్దదిగా ఉంటుంది. దాని వ్యాసం 14 లక్షల కిలోమీటర్లు. ఇది భూమి వ్యాసం కన్నా 109 రెట్లు ఎక్కువ. భూమి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడి నుండి చూస్తే అంత చిన్నగా కన్పిస్తున్నాడు. అంత దూరంనుండే నిప్పులు కురిపించే ఎండను వెదజల్లుతున్నాడు. అక్కడికి వెళితే ఎంత వేడి ఉంటుందో ఊహించండి. అమ్మో! మాడి మసైపోము! ఊహించడానికే భయం వేయటం లేదూ...?!
    సూర్యుడి కన్నా భూమి చిన్నది. భూమి కన్నా చందమామ మరింత చిన్నది. చందమామ కురిపించే చల్లని వెన్నెల వెలుతురు కూడా సూర్యుడిదే. ఇది ఎట్లాగంటే సూర్య కిరణాలు చంద్రుని మీద పడి అవి పరావర్తనం చెంది భూమి పైకి వస్తాయి. ఈ క్రమంలో ఆ కిరణాలలోని వేడిని కాస్త చంద్రుడు భరిస్తాడు. మనకు చల్లని కిరణాలను ఇస్తాడు. అందుకే చందమామ మంచివాడు. పిల్లలకు మామ వాడు.

అభినందన

మాస్టారు ఆ రోజు హాఫియర్లీ పరీక్ష పేపర్లు  ఇస్తున్నారు. పిల్లలంతా ఆసక్తిగా మార్కుల కోసం ఎదురుచూస్తున్నారు. మూడు సబ్జెక్టుల్లో మహేష్‌, మిగిలిన మూడు సబ్జెక్టుల్లో గోపి ఫస్ట్‌ వచ్చారు. మాస్టారు వారిద్దరిని పిలిచి అభినందించారు.
''మీరు చదువు విషయంలో ఇలా పోటీ పడటం నాకు చాలా ఆనందంగా ఉంది.ఏ విషయంలోనైనా పోటీ ఉన్నప్పుడే రాణిస్తారు.మీరిద్దరూ ఇలాగే శ్రద్ధగా చదువుకోండి.'' అన్నారు మాస్టారు.
'అలాగే' అన్నారు మహేష్‌, గోపి. మూడు సబ్జెక్టుల్లో ఫస్ట్‌ వచ్చినందుకు గోపి మహేష్‌ను అభినందించాడు. మహేష్‌ మాత్రం ముఖం అదోలా పెట్టి వెళ్ళిపోయాడు.
వాళ్ళిద్దరు కేవలం చదువులోనే కాకుండా క్విజ్‌,వ్యాసరచన పోటీ, చదరంగం లాంటి అన్ని విషయాల్లోను పోటిపడతారు. మహేష్‌ తనకు రాని ఆటల్లో కూడా గోపికి పోటిగా ఉండేవాడు. గోపీకి బహుమతి వస్తే సహించేవాడు కాదు.
వారం రోజుల తర్వాత జరిగే ఈతపోటిల్లో పాల్గొనేందుకు పేరు ఇచ్చాడు గోపి. గత రెండేళ్ళుగా గోపి ఈత పోటీల్లో ఫస్ట్‌ వస్తున్నాడు. మహేష్‌ కూడా తన పేరు ఇచ్చాడు. అది చూసి గోపి-
''మహేష్‌! నీకు ఈత రాదుకదా ఎలా ఈదుతావ్‌'' అన్నాడు.
''ఏం పరవాలేదు. వారం రోజుల్లో ఈత నేర్చుకుని ఈదుతా. నేను పాల్గొంటే నీకు భయంగా ఉందా?'' అన్నాడు మహేష్‌ ఎగతాళిచేస్తూ.
ఈతపోటీల రోజు రానే వచ్చింది. అందరూ ఒకరికొకరు 'విష్‌ యూ ఆల్‌ ది బెస్ట్‌' అని చెప్పుకున్నారు. మహేష్‌ మాత్రం గోపికి చెప్పలేదు.
పోటీి ప్రారంభమయ్యింది. పిల్లలందరు గమ్యం వైపు ఈదుతూ వెళుతున్నారు. కొంత దూరం తనతో సమానంగా వచ్చిన మహేష్‌ వెనకబడటం గమనించాడు. గోపి తనను దాటి వెళ్ళడంతో మహేష్‌ రొప్పుతూ ఈదబోయాడు. ఈలోగా దమ్ము పట్టడం కష్టమవడంతో నీళ్ళలో మునిగిపోయాడు.
ఒడ్డున ఉన్న వాళ్ళంతా 'మహేష్‌' అంటూ అరవసాగారు. ముందు వెళ్తున్న గోపి వెనకకు తిరిగి మహేష్‌ నీళ్ళలో మునిగి పోవడం చూసి తొందరగా మహేష్‌ దగ్గరికి వచ్చి అతడిని ఒడుపుగా పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. కాసేపు ప్రథమ చికిత్స చేసేసరికి మహేష్‌ మెల్లిగా తెప్పరిల్లాడు.
మహేష్‌ గోపికి కనీసం 'థాంక్స్‌' అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు జిల్లా జడ్జి విజేతలకు బహుమతులు అందచేశాడు. సాహసంతో మహేష్‌ను రక్షించినందుకు గోపికి ప్రత్యేక బహుమతిని ఇచ్చి మెచ్చుకున్నాడు.
గోపి మైక్‌ వద్దకువెళ్ళి 'మిత్రులారా! నేను చదువులో, ఆటల్లో శ్రద్ధ వహించడానికి మహేష్‌ పరోక్ష ప్రేరణ, అటువంటి మహేష్‌ వారం రోజుల్లో ఈత నేర్చుకుని నాకు పోటిగా ఎంతో సాహసంగా ఈదాడు. అతని పట్టుదల చూసి, నా ఈ బహుమతిని మహేష్‌కు ఇవ్వాలనిపిస్తున్నది. అంటూ మహేష్‌ను స్టేజి పైకి పిలిచి బహుమతిని మహేష్‌కు అందించాడు.
గోపి మాటలకు మహేష్‌ మనసు కదిలిపోయింది. 'తను ఈర్షతో గోపికి పోటిగా నిలబడితే గోపి దాన్ని మెచ్చుకుని తన బహుమతిని నాకు ఇస్తున్నాడు. దేనికైనా పోటీ పడాలి. కాని ఎదుటివాడిని కించ పరచేలా ఉండకూడదు. అలాగే పోటీలో గెలిచిన, ఓడిన సరదాగా తీసుకోవాలి. ఒకవేళ ఓడితే తర్వాత గెలిచేందుకు పట్టుదలతో కృషి చేయాలి. అంతేగాని ఈర్ష్య పడొద్దు' అనుకుంటూ స్టేజిపైన ఆనందంతో గోపిని కౌగిలించుకున్నాడు మహేష్‌.
-- యన్‌.యస్‌.శర్మ

హార్న్‌బిల్‌

పొడవైన పెద్ద ముక్కు, దానిపై టోపి లాంటి అమరిక, ముక్కును మించిన పొడవుతో తోక, నలుపు తెలుపు రంగుల పెద్ద ఈకలు, పెద్ద శబ్దంతో కూతవేస్తూ, చిత్ర విచిత్రమైన అలవాట్లతో,గమ్మత్తుగా అనిపించే హార్న్‌బిల్‌ అనే పక్షి అస్సాం అడవుల్లో కనిపిస్తుంది. ఇది గద్దకన్నా కొంచెం పెద్దది.ఇది 30 సెంటీమీటర్ల బలమైన ముక్కుతో కలిపి దాదాపు 5 అడుగుల పొడవు ఉంటుంది. ముక్కు ముదురు పసుపు రంగులో దానిపై టోపిలాంటి అమరిక నలుపు పసుపు రంగుల్లో ఉంటుంది. తోక తెలుపు రంగులో ఉండి కింద అడ్డంగా చిన్నపట్టీ ఉంటుంది. పొట్ట భాగంలో ఈకలు తెలుపుగా ఉంటాయి. ఈ పక్షి దట్టమైన  అడువుల్లోనే నివసించడానికి ఇష్టపడుతుంది. పెద్ద చెట్ల కున్న చిన్న తొర్రల్లో ఉంటుంది. చిన్న గింజలున్న పండ్లు, పురుగులు, ఎలుకలు,బల్లులు, చిన్న పాములను ఇది ఇష్టంగా తింటుంది. ఇది ఎగురు తుంటే రెక్కల శబ్దం గమ్మత్తుగా వస్తుంది.
ఆడ మగ హార్న్‌బిల్‌ పక్షులు కలిసి ఒక చెట్టు తొర్రను ఇంటిగా చేసుకొంటాయి. అందులో ఆడపక్షి రెండు నుండి నాలుగు గుడ్లను పెడుతుంది. తర్వాత గుడ్లమీద పొదగడానికి కూర్చుంటుంది. అప్పుడు మగపక్షి ముక్కును తాపీలా ఉపయోగించి రెట్టా, మట్టితో చెట్టు తొర్ర ద్వారాన్ని మూసి వేస్తుంది. దానికి ఒక చిన్న కన్నం మాత్రం ఉంచుతుంది. దీని నుంచి మగపక్షి ఆడపక్షికి ఆహారం అందిస్తుంది.
గుడ్లు పొదిగి పిల్లలు బయటికి వచ్చి రెండు నెలల వయస్సు వచ్చేవరకు ఆడపక్షి ఆ గూటిలోనే ఉంటుంది.
అంటే దాదాపు నాలుగు నెలలు ఆ గూటిలోనే ఎటూ కదలకుండా ఉంటుంది.
పిల్లలు ఎదిగి వాటంతట అవే ఆహారం సంపాదించుకునే స్థితికి రాగానే మగపక్షి గూటిని ముక్కుతో పగలగొడుతుంది.
అపుడు తల్లి, పిల్లలు బయటికి వచ్చి స్వేచ్చగా ఎగురుతాయి.

పాపాయి చదువు

పాప బడిలో చేరింది
పలకా బలపం పట్టింది
'అ ఆ' లన్నీ నేర్చింది
'కఖా' లన్నీ దిద్దింది
    మాటలు బాగా రాలేదు
    ముక్కున కోపం పోలేదు
    'పలకాబలపం' అనవే అంటే
    'బలకం కలపా' అంటుంది
    'రఘుపతిరామా' అని చెబితే
    'లఘుపతి లామా' అంటుంది
    గణపతి ముక్కుకు పేరేమంటే
    టొండము టొండము అంటుంది.
    బడిలో పిల్లలు విన్నారు
    పక్కున అందరు నవ్వారు
    పాపకు రోషం హెచ్చింది
    కోపం ముంచుకు వచ్చింది.
    -- గాలి ప్రభావతి

అయిదు వేళ్ళు

చిన్నది చిన్నది చిటికెన వేలు
ఉన్నది పక్కనే ఉంగరం వేలు
నడుమన పొడవుది నడిమీ వేలు
చూపును దిశలను చూపుడు వేలు
పొట్టిది గట్టిది బొటనా వేలు   
అన్నము కలుపును అయిదూ వేళ్ళు
ఆకలి తీర్పును అయిదూ వేళ్ళు
ఐక్యత నేర్పును అయిదూ వేళ్ళు
అమ్మలవంటివి అయిదూ వేళ్ళు
అమ్మలకమ్మలు అయిదూ వేళ్ళు
-- సి.ఎల్‌.శ్రీనివాసరెడ్డి

Wednesday, June 23, 2010

చెలిమి కథలు

చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ ఎకాడమీ బాలల కోసం ముద్రించిన తొలి పుస్తకం 'చెలిమి కథలు'. చింతామణి గారు రచించిన ఈ కథలు చిన్న తరగతుల లోని బడి పిల్లలకోసం ఉద్దేశించినప్పటికీ, పెద్ద వారికి కూడా ఉపయోగకరమే. నిజం చెప్పాలంటే వీటిని విజ్ఞాన గుళికలని చెప్పాలి. ప్రతి కథ వెనుక ఒక సందేశం, నీతి, సంస్కృతికి సంబంధించిన అంశం ఉన్నాయి. కాని ఈ నీతి బోధ బాహాటంగా ప్రచార ధోరణిలో ఉండదు. చదవటానికి ఆసక్తికరమైన రీతిలో విజ్ఞానానికి వినోదం జోడించి ఈ కథలను వ్రాశారు. మానవతా విలువలను కాపీ బుక్కు వరవడుల్లాగా కొట్టొచ్చినట్లు ప్రదర్శించక, చిన్న పిల్లలు వాళ్లంతట వాళ్లు తెలుసుకొనేలా సున్నితంగా ఈ కథల ద్వారా తెలియజేశారు. దీనినే ఆధునిక విద్యా బోధనా విధానంలో తనంతట తానుగా తెలుసుకొనే పద్ధతి (డిస్కవరీ మెథడ్‌) అంటారు.
ఈ కథలన్నీ సులభమైన భాషలో రచించి, పిల్లల మనోభావాలను విశ్లేషించి, నేర్పుగా చిత్రీకరించిన రచయిత అభినందనీయులు. వ్యంగ్యమైన విమర్శలతో మనసులను నొప్పించకుండా, ఉన్నత విలువలను ప్రతిపాదించటంలో ఆయన ఎంతో కౌశలం ప్రదర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి రచనలు సాంఘిక, నైతిక ప్రయోజనాలను సాధిస్తాయని నా విశ్వాసం.
-- ఐ.వి. చలపతి రావు 
చెలిమి కథలు
రచన : చింతామణి
బొమ్మలు: పాతర్ల లక్ష్మణ్‌
పేజీలు : 82
వెల:12 రూ.
ప్రతులకు: చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ ఎకాడమీ
'చంద్రం', 3-6-712/2, 11 వ వీధి
హిమాయత్‌నగర్‌, హైదరాబాద్‌ 500 029

Tuesday, June 22, 2010

category

కథ, కవిత, గేయం, కంప్యూటర్‌, క్రీడ, యాత్ర, హక్కు, ప్రకృతి, హాబీ, అమ్మమ్మ కథలు, నేను విన్న కథ, సమాచారం
సైన్స్‌ సరదాలు, సామెత, పొడుపు కథ, పుస్తకం, స్ఫూర్తి, చలన చిత్రం, పర్యావరణం, ప్రకృతి, మాజిక్‌, వినోదం, లీడర్‌
సినిమా 

జ్ఞానపదం

పిల్లల్లో కథలు వినే
కోరిక బహు మెండు,
తాతయ్యలు, నానమ్మల
కథ మాటల చెండు!

ఎక్కడుంది బామ్మకిపుడు
కథ చెప్పే తీరిక,
ఆమెకి కూడా 'టీ.వీ'
చూడాలని కోరిక!

ఎంచక్కా లైబ్రరీకి
వెళ్ళవచ్చు కాని,
హోమువర్కు  చేయకపోతె
క్లాసులోన హాని!

ఒక్కసారి యోచిస్తే
ఉంది చాల టైము,
దాన్ని వృథా చేస్తుంటాం
అదొక పెద్ద క్రైము!

పోసుకోలు కబుర్లతో
గడపరాదు నిమిషం,
వృథా అయిన ప్రతి నిమిషం
బతుకున ఒక విషం!

పత్రికలూ, పుస్తకాలు
కథల నిధులు, బాలలూ!
తీరికలో చదువుకోండి
వేసుకుంటు ఈలలు.

-- దేవిప్రియ అంకుల్‌

తెలియకచేసే పొరపాట్లు

మానవుడు జీవితంలో అనేకసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు కొంతమందిని వెనకనుండి చూసి తెలిసిన మనిషిగా భావించి చప్పట్లుకొట్టి తర్వాత సారీ చెప్పటం, కొందరిని చూసినపుడు పోలికల్ని బట్టి 'ఫలానవారు మీ బంధువులా?' అని అడిగాక తర్వాత పొరబడ్డామని గ్రహించటం, ఇలా అనేక రకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు. మానవులే కాక పక్షులు, జంతువులు మొదలైన జీవరాశులు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తాయని శాస్త్రవేత్తలు ఋజువులతో సహా చెబుతున్నారు.
ఉదాహరణకు ఆఫ్రిన్‌ ఆర్కిడ్‌ అనే మొక్క పువ్వు అచ్చం ఆడ తేనెటీగలా ఉంటుందిట. దీన్ని నిజంగా ఆడతేనెటీగని భావించి మగతేనెటీగలు ఆ  పూవుపై వాలతాయి. ఫలితంగా అవి పూవును తమ రెక్కలకంటుకున్న అదే జాతి పుప్పొడితో ఫలదీకరణం చేస్తాయి.
అలాగే ఓ కోడి పెట్ట నుండి పిల్లల్ని దూరం చేసినపుడు ఆకోడి పిల్లి పిల్లలనయినా తన పిల్లలేనని భావించి వాటిని తన రెక్కల కింద ఉంచుకొని కాపాడుతూ వస్తుందట. పిల్లి పిల్లలు కూడా కోడిని తమ తల్లిగానే భావించి మొదట్లో దాంతో ప్రేమగా ఆడుకొంటాయట. కొంతకాలానికి పిల్లి పిల్లలు కోడి తమ తల్లికాదని గ్రహించి కోడినుండి దూరంగా వెళ్ళిపోతాయి.
ఇదే విధంగా ఓ జాతికి చెందిన పక్షి తనగూడు నెవరయినా నాశనం చేసినప్పుడు తన పిల్లలకోసం తెచ్చే ఆహారాన్ని దగ్గర చెరువులో ఉండే చేపపిల్లలకు అందిస్తుందట. ఆ పిట్ట చెరువు ఒడ్డుకు రాగానే చేపపిల్లలు పిట్ట దగ్గరకు నోరు తెరుచుకుని వెళ్తాయి. చూశారా? తప్పులు మానవులేగాక జీవరాశులన్నీ చేస్తాయి.
-గిరిజానారాయణ్‌
పలు ప్రయోజనాల 'కోడిగుడ్డు'
ఒక కోడి ఏడాదికి దాదాపు 180 గుడ్లు పెడుతుంది. కోడి గుడ్డులో బి1,బి2 విటమిన్లే కాక ప్రొటీనులు కూడా ఉంటాయి. కోడిగుడ్డు తినడానికి గాక ఐవరీ పాలిష్‌, రంగులు, జిగురు, పుస్తకాల బైండింగ్‌, మందులు, పుస్తకాల ముద్రణకు ఉపయోగించే సిరా, సబ్బు, వార్నష్‌, వైన్‌, ఐస్‌క్రిమ్‌, రొట్టెల తయారీలలో కూడా వాడుతారు.

దుష్టులకు దూరంగా....

ఒక అడవిలో పులి బోనులో బందీ అయిఉంది. అది బోనులో నుండి బయటికి రావాలని ప్రయత్నించింది. కానీ వీలుకావటం లేదు. ఆ దారిలో ఒక బ్రాహ్మణుడు వెళ్తూండటం పులి కంటపడింది. అది వెంటనే-
'ఓయీ బ్రాహ్మణుడా! ఆగు, నేను చాలాసేపటినుంచి ఈ బోనులో బందీ అయి ఉన్నాను. నాకు విపరీతమైన దాహం వేస్తోంది. నీవు కాస్త ఈ బోను తెరిస్తే నేను నీళ్ళుతాగి మళ్ళీ ఈ బోనులోకి వస్తాను'' అంది.
అది విని బ్రాహ్మణుడు 'అమ్మో! దీన్ని బయటికి వదిలేస్తే ఇంకేమైనా ఉందా! నన్నే తింటుంది. - అనుకుని, 'నేను తెరవను' అన్నాడు.

'నీవు భయపడుతున్నట్లుగా నిన్ను ఏమీ చేయను. దయ ఉంచి తెరువు. లేకుంటే నేను ఇందులోనే చచ్చిపోతాను.' అంది దీనంగా ముఖంపెట్టి, కొద్దిసేపటికి బ్రాహ్మణుడికి జాలి కలిగి బోను తెరిచాడు. పులి వెంటనే బోనులోనుంచి బయటికి వచ్చి-
'నేను చాలా ఆకలితో ఉన్నాను. నిన్నిప్పుడు తింటాను.' అంది. బ్రాహ్మణుడికి భయం పట్టుకుంది. గజగజ వణికిపోతూ ''ఇది అన్యాయం. నేను నీకు సాయం చేశాను. కావాలంటే ఎవరినైనా న్యాయం అడుగుదాం.' అన్నాడు. ఇంతలో అటుగా వస్తున్న ఒక నక్కకు బ్రాహ్మణుడు జరిగింది చెప్పాడు. నక్క అంతా విని-
''నీ మాటలు నాకు ఏమీ అర్థం కాలేదు. ఈ బోనులో నీవున్నావా?'' అంది నక్క బ్రాహ్మణుడిని చూస్తూ-
'లేదు నేనే ఉన్నాను' అంది పులి.
''ఇంత చిన్నబోనులో నీవెలా ఉంటావు. నీవు చెప్పేది నమ్మబుద్ది కావటంలేదు.'' అంది నక్క బోను వైపు చూస్తూ-
అసలే ఆకలిగా ఉన్న పులి-
'ఓసీ మూర్ఖపు నక్కా! ఈ బోనులో నేనే ఉన్నాను. కావాలంటే చూడు లోనికి వెళ్ళి వస్తాను' అంటూ పులి బోనులోకి వెళ్ళింది. బ్రాహ్మణుడు, నక్క కలిసి వెంటనే బోను తలుపులు బిగించారు. తన ప్రాణాలు కాపాడి నందుకు నక్కకి కృతజ్ఞతలు తెలిపి, 'దుష్టుల మాటలు నమ్మరాదు' అనుకుంటూ బ్రాహ్మణుడు తన దారిన తాను పోయాడు.

Sunday, June 20, 2010

ఫతిక్‌ చంద్‌

కలకత్తాలో దుండగులు అపహరించుకు పోయిన పన్నెండేళ్ల అబ్బాయి గురించి కదిలించివేసే నాటకీయమైన కథ ఫతిక్‌ చంద్‌. ఒకవైపు సంపన్నుల హృదయం లేనితనాన్నీ, మరోవైపు పేదవాళ్ల ప్రగాఢమైన, అర్థవంతమైన సానుభూతినీ ఇది చిత్రిస్తుంది. జీవితానికి అద్దం పట్టిన ఈ అద్భుతమైన నవల మతిమరుపునకు గురై, తనను తాను ఫతిక్‌ చంద్‌ అని పిలుచుకొనే ఒక పిల్లవాడి గురించి ఆర్థ్రమైన చిత్రణను ఇస్తుంది. ఫతిక్‌ చిట్టచివరకు ఇంటికి చేరటానికి సాయపడిన గారడీ వాడైన హరున్‌ గురించీ అంత ఆర్థ్రంగా చిత్రిస్తుంది. పిల్లవాడికీ, గారడీ వాడికీ మధ్య పెరిగిన అనుబంధాన్ని నవలకు ఇతివృత్తంగా తీసుకొని ప్రేరణాత్మకంగా ఈ నవలలో వివరించారు. ఈ నవల ఆధారంగా తీసిన సినిమా బెంగాల్‌లో గొప్ప విజయాన్ని సాధించింది.
సత్యజిత్‌ రే బెంగాళీలో వ్రాసిన పుస్తకాన్ని లీలా రే ఆంగ్లం లోకి అనువదించారు. హరిపురుషోత్తమ రావు తెలుగులోకి అనువదించిన ఈ పుస్తకాన్ని 1991 లో బాల సాహితి బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. కాగా 2009వ సంవత్సరంలో పిల్లల పుస్తక ప్రచురణ సంస్థ 'పాల పిట్ట' ఈ పుస్తకాన్ని ప్రచురించింది.

Thursday, June 17, 2010

అంత ఉరిమీ ఇంతేనా కురిసింది

సామెతలు...
తెలుగు సాహిత్యంలో సామెతల కేమీ కొదవ లేదు. నగర జీవి మరిచిపోయినా ఈ సామెతలు పల్లె జనం నోళ్లలో నేటికీ నానుతూ ఉన్నాయి. జంతువులు, చెట్లు, వ్యవసాయం..... ఇలా ఎన్నో విషయాల గురించి విలువైన సమాచారాన్ని సామెతల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు. అటువంటి సామెతల నుంచి కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాం.

  • అంత ఉరిమీ ఇంతేనా కురిసింది
  • అందని ద్రాక్ష పుల్లన
  • అందరి కన్నా తాడిచెట్టు పెద్ద
  • అందరికీ అన్నం పెట్టేవాడు రైతే
  • అందితే తియ్యన అందకపోతే పుల్లన
  • అగ్నికి వాయువు తోడైనట్టు
  • అచ్చివచ్చిన భూమి అడుగైనా చాలు
  • అడవిలో ఆంబోతై తినాలి
  • అతివృష్టి అయినా అనావృష్టి అయినా ఆకలి బాధ తప్పదు
  • అదను ఎరిగి సేద్యమూ పదును ఎరిగి పైరు
  • అన్ని కార్తెలు తప్పినా హస్తకార్తె తప్పదు
  • అన్నీ పండించిన వాడికే అన్నం కరువు
  • అయితే ఆరిక కాకుంటే కంది
  • అరవై ఆరు వంటలు ఆవు చంటిలోనే ఉన్నాయి

ఇటువంటి సామెతల గురించి మీ ఇంట్లో అమ్మానాన్నలనీ, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలనీ అడగండి. ఆ సామెతల వెనుక దాగిన అర్థం ఏమిటో తెలుసుకోండి. మీరు తెలుసుకున్న సామెతల గురించి వివరంగా మాకు వ్రాసి మీ ఫోటోతో పాటుగా పంపండి. 'బాల చెలిమి'లో వాటిని ప్రచురిస్తాం.

Contact

కథ అంటే పిల్లలు చెవి కోసుకొంటారు. కథల పట్ల పిల్లలకున్న ఈ ఆసక్తిని ఆసరాగా చేసుకొని ఎన్నో కథలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. పిల్లలకు జానపద గా థలంటే వెర్రి వ్యామోహం అనీ, అలాంటి కథలే వాళ్ల మనసులను దోచుకొంటాయనీ ఒక అభిప్రాయం మనలో వేళ్లూనుకొని ఉంది. నిజానికి ఊహాలోకాల్లోకి, స్వప్న జగత్తులోకి ఎగిరి పోవడానికి రంగురంగుల రెక్కలు ఇచ్చే కథల అవసరం ఎంతైనా ఉంది. అలాగే చెలి మెలేసి, జీవితం అంటే ఇదీ, ఇలా వుంటుంది అని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పే కథల అవసరం అంతకన్నా ఉంది. మారుతున్న విలువలు, వెల్లువలా ముంచెత్తుతున్న నూతన పరిణామాలు పిల్లల మనసుల్లో నాటుకోవాలంటే కథలే సాధనాలు. కథల ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని మా విశ్వాసం. ప్రస్తుత యుగాన్ని రోదసీ యుగంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యుగ లక్షణాల్లో సైన్స్‌ ఫాంటసీ ఒకటి. పిల్లల మనస్సుల్లో నాటుకొనేలా వినోద విజ్ఞానాలను మేళవించి కొన్ని సైన్స్‌ ఫాంటసీ కథలను తీసుకురావటానికి బాల చెలిమి సిద్ధమవుతోంది. పిల్లలను జోకొడుతూ, వాళ్లని నిద్ర పుచ్చడానికి కథలు చెప్పే సాంప్రదాయం మనకు అనాదిగా ఉంది. అలాగాక వాళ్ల గుండె తలుపు తట్టి వాళ్లను మేల్కొలపడానికి కథలు చెప్పే కొత్త అవసరం నేడు మన ముందు ఉంది. ఆ గురుతర బాధ్యతను 'బాల చెలిమి' తీసుకొంటోంది.
ఆహ్వానం
మీరు పిల్లలైనా, పిల్లల మనసు తెలిసిన పెద్దలైనా, మీకిదే మా ఆహ్వానం. కథలు, కవితలు, గేయాలు, ఇక బాల చెలిమిలో ఉన్న ఏ ఇతర శీర్షిక కైనా మీరు మీ రచనలను పంపవచ్చు. మీ అభిప్రాయాలను, సూచనలను, సలహాలను మాకు తెలియ జేయండి.
సంప్రదించండి:
balachelimi (at) balachelimi.com
{Replace (at) with @ }

Wednesday, June 16, 2010

పిల్లల పండుగ

చాచా నెహ్రు పుట్టినరోజు - పిల్లల పండుగ
పువ్వులంటే ఆయనకు ఇష్టం!
పిల్లలంటే ఎంతో ఇష్టం!!
తీరికలేని సమయాల్లో కూడా, ఏకాస్త తీరిక దొరికినా పిల్లలతో ఆనందంగా గంతులేస్తూ ఆడుకునేవారు.
ఆయనే తొలి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ.
''అపారమైన సంఖ్యలో గల పిల్లలు చూపులకు రకరకాలుగా కనిపిస్తారు. తలో భాష మాట్లాడతారు. రంగురంగుల బట్టలు వేసు కుంటారు. అయినా ఒకే మాదిరిగా ఉంటారు. ఒకేచోట చేరి ఆడుకుంటారు, పాడుకుంటారు, గంతులేస్తారు, పోట్లాడుకుంటారు. అయితే మళ్ళీ వెంటనే కలిసిపోతారు. రంగూ, కులం, భాషా భేదాలు వారికి తెలియవు. వీటి విషయం వారు ఆలోచించరు. నిజానికి పిల్లలు తమ తల్లిదండ్రులకంటే తెలివైనవారు.'' అని చాచా నెహ్రూ అంటారు. వారే మరొక సందర్భంలో ''పిల్లలతో ఉండటానికి ఇంకా చెప్పాలంటే వారితో ఆడుకోవటానికి ఎంతో ఇష్టపడతాను. కొద్ది క్షణాల పాటు నేను ముసలివాణ్ణనే విషయం మరిచిపోతాను'' అని అంటారు.
పండిట్‌ జవహర్‌లాల్‌నెహ్రూ కాశ్మీరు పండిత కుటుంబంలో జన్మించారు కాబట్టి వారిని పండిత్‌జీ, అని పిలుస్తారు. నెహ్రూను పిల్లలు ముద్దుగా చాచానెహ్రూ, జవహర్‌, జవహర్‌ భాయి అని పిలుచుకుంటారు.
-డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్య



 

బుల్లి బుల్లి స్టాంపులు


'స్టాంపుల సేకరణ' ఒకమంచిహాబీ, దేశవిదేశాల స్టాంపులు సేకరించటం వల్ల ఆయాదేశాల వన్య జీవులు, పక్షులు, కట్టాడాలు, నాయకులు, ప్రముఖ వ్యక్తులు, ఆచార వ్యవహారాలు మొదలైన విషయాల్ని గురించి తెలుస్తుంది. ఒక చిన్న స్టాంపు ఎన్నో విశేషాలు తెలియజేస్తుంది. వినోదంతో పాటు విజ్ఞానాన్ని పెంచే ఒక చక్కని హాబీ ఇది.
ప్రపంచంలో మొట్టమొదట ఒక ఇంగ్లీషు మహిళ 'స్టాంపుల సేకరణ' మొదలు పెట్టింది. ఆమె వద్ద దాదాపు 16,000 స్టాంపులుండేవి. ప్రపంచంలోని వివిధ దేశాల స్టాంపులు కొంటానని ఆమె 1814లో 'లండన్‌ టైమ్స్‌' అనే పత్రికలో ప్రకటన ఇచ్చింది.
స్టాంపు చరిత్ర:
19వ శతాబ్దం వరకు కూడా బ్రిటన్‌లో ఉత్తరాలు,పార్శిళ్ళు,పోస్టింగ్‌ అన్నీ అవకతవకలుగా ఉండేవి. పోస్టల్‌ రేట్లు ఒక తీరుగా ఉండేవికావు. ముందే డబ్బుకట్టి ఉత్తరాలు పంపేవారు. లేకపోతే ఉత్తరాలు అందుకున్నాకే వారు డబ్బు కట్టేవారు. రేట్లుకూడా దూరాన్ని బట్టి ఉండేవి. ఇదే సమయంలో 'రౌలండ్‌ హిల్‌' (1795-1879) అనే అతను ప్రతిపాదించిన రెండు సూచనలు బ్రిటిష్‌ ప్రభుత్వానికి నచ్చాయి. ఫలితంగా 1840 లో మొట్టమొదటి స్టాంపు వెలువడింది. దీన్ని మే 6, 1840 న ఉపయోగించడానికి వీలుగా మే 1వ తేదీన అమ్మకం ప్రారంభించారు. భారతదేశంలో 1854 లో విక్టోరియా మహారాణి మొట్టమొదటి సారిగా స్టాంపులు జారీచేసింది. వాటిపై విక్టోరియారాణి బొమ్మ ఉండేది.
అరుదైన, ఖరీదైన స్టాంపులు:
బ్రిటిష్‌లోని గయానాలో 1856 ఫిబ్రవరిలో విడుదలైన ఒక సెంట్‌ విలువగల స్టాంపు ప్రపంచంలోని ఒక అరుదైన, ఖరీదైన స్టాంపుగా గుర్తింపు పొందింది. ఇది విడుదలైన 17 సంవత్సరాలకు ఒక పాఠశాల బాలుడు ఈ స్టాంపును 10 షిల్లింగ్‌ (దాదాపు పదిరూపాయలకు) లకు స్టాంపులు సేకరించే వ్యక్తికి అమ్మాడు. ఈ స్టాంపు దేశ విదేశాలు తిరిగి ఇప్పుడు ఒక కోటి రూపాయల విలువ చేసే స్టాంపుగా అగ్రస్థానంలో ఉంది.
రకరకాల స్టాంపులు
స్టాంపులు రకరకాలుగా ప్రింటు చేస్తారు. జాతీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు, జంతువులు, పక్షులు, ఆటలు, పిల్లలు, ఆ దేశపు చారిత్రాత్మక ప్రదేశాలు, కట్టడాలు ఇలా. . . ఇవే గాక అంతర్జాతీయ బాలికల దినోత్సవం, ఒలింపిక్‌గేమ్స్‌, ఏషియన్‌గేమ్స్‌, బాలల  దినోత్సవం ఇలా ప్రత్యేక సందర్భాలలో కూడా స్టాంపులు వెలువడతాయి.
స్టాంపులలో జరిగే పొరపాట్లు:
స్టాంపుల ప్రింటింగ్‌లో ఒకొక్కసారి పొరపాట్లు జరుగుతాయి. స్టాంపులలో ఒకదానిపైన ఇంకోటి ప్రింట్‌కావడం, రంగులు ప్రింట్‌ కాకపోవడం, సగమే ప్రింటవడం, మధ్య డిజైన్‌ తలకిందులుగా పడటం, రేటు తప్పుగా పడటం ఇలాంటివి జరుగు తుంటాయి. ఇలాంటి స్టాంపులు, కొన్ని లక్షల రూపాయల విలువ చేస్తాయి.
స్టాంపుల విశేషాలు:
స్టాంపుల సేకరణనే 'ఫిలాటెలీ' అని కూడా అంటారు. ఇది 'ఫిలాన్‌' అనే గ్రీకు పదం నుంచి పుట్టింది.
- ప్రపంచపు పోస్టల్‌ యూనియన్‌ సేకరణ అక్టోబర్‌ 9,1874లో జెనీవాలో స్థాపించబడింది. ప్రతీ దేశంలో విడుదలైన ప్రతి స్టాంపు 400 కాపీలు జెనీవాకు చేరతాయి. 1926 లో నాసిక్‌ (మహారాష్ట్ర)లో ఇండియా సెక్యూరిటీ ప్రెన్‌ స్థాపించబడింది. అప్పటి నుంచి మనదేశపు స్టాంపులు అందులో ప్రింటు అవుతున్నాయి.
స్విట్జర్లండ్‌, జర్మనీ, డచ్‌, అమెరికా, లండన్‌లలో పోస్టల్‌ మ్యూజియంలు ఉన్నాయి.

పరీక్ష!

అందమైన స్విట్జర్లెండును ఒక దుర్మార్గుడు పరిపాలించే వాడు ఆ దుర్మార్గుణ్ణి తొలగించి మంచి రాజ్యం ఏర్పరచాలని అనేకమంది దేశ భక్తులు ప్రయత్నించేవారు. అలాంటి దేశభక్తులలో ప్రముఖుడు విలియంటెల్‌.
విలియం టెల్‌ విలువిద్యలో నిపుణుడు. అతని కొక ముద్దుల చిన్నారి కొడుకుండేవాడు. టెల్‌ను పట్టుకోవాలని సైనికులు ఎంత ప్రయత్నించినా వారికి చిక్కలేదు. సైనికులు దేశమంతా వెదికారు. కనబడిన వారినల్లా అడిగారు. కొందరిని కొట్టారు. మరి కొందరిని ఖైదులో అనుకోకుండా వారికి టెల్‌ చిన్నారి కొడుకు తారస పడ్డాడు. ఆ బాబును తీసుకు పోయారు. ఆ బాబు సైనికాధికారి వద్ద ఉన్నట్లు దేశమంతటా చాటింపు వేయించారు. విలియం టెల్‌ వస్తే ఆ బాబును అప్పచెపుతామని కూడా ఆ చాటింపులో చెప్పించారు. విలియం టెల్‌ ధైర్యసాహసాలు కల వీరుడు. అందుచేత, ఏమాత్రం జంకకుండా సైనికుల వద్దకు వెళ్లాడు. అక్కడున్న బాబును ముద్దులాడాడు. ఆ దృశ్యం చూస్తున్న సైనికాధికారికి ఒక చిలిపి ఊహ వచ్చింది.
''టెల్‌ నేనొక చిన్న పరీక్ష పెడతాను. దానిలో నెగ్గితో నీ కొడుకును నీవు తీసుకు వెళ్ళవచ్చును'' అన్నాడా దుర్మార్గుడు ''ఏమిటా పరీక్ష?'' అని అడిగాడు టెల్‌.
''నీవు విలువిద్యలో గొప్పవాడివి కదా! అందులోనే నీకు పరీక్ష!'' అన్నాడు. ''విలువిద్యలో అయితే సరే! ఇంతకీ ఏమిటా పరీక్ష!'' అన్నాడు టెల్‌.
''ఏభై అడుగుల దూరంనుంచి ఏపిల్‌ పండును బాణం తో కొట్టాలి'' అని వికటంగా నవ్వాడా నియంత.
''ఇంతేనా! దీనికి నవ్వుతా వెందుకు?''అని చిరాకు పడ్డాడు టెల్‌.
''కొంచెం గమ్మత్తుంది . . . . ఆ ఏపిల్‌ పండు నీ కొడుకు తల మీద పెడతాము. అప్పుడు కొట్టాలి'' అని మళ్లీ నవ్వాడు.
విలియం టెల్‌ ఒక నిమిషం ఆలోచించి ''సరే!'' అన్నాడు.
బాబును ఒక చోట నించోబెట్టి అతని తలపై యాపిల్‌ పండుంచారు. సరిగ్గా ఏభై అడుగులు కొలిచారు. అక్కడ నించుని బాణం వదలాలన్నమాట.
విలియం టెల్‌ కొడుకువంక చూశాడు. ఒకసారి మధ్య ఉన్న దూరం ఎంతో చూసుకున్నాడు. గట్టిగా ఊపిరిపీల్చి వదిలాడు. తన అంబుల పొదలో నుంచి మంచి తిన్నని బాణాలు రెండు ఎంచుకున్నాడు.
ఒక బాణం విల్లుకు తగిలించి గురి చూశాడు. వింటితాడు వెనక్కి లాగి బాణం వదిలాడు. బాణం రయ్యిన వెళ్ళి ఏపిల్‌ పండును రెండు ముక్కలు చేసింది. అక్కడున్న వాళ్ళంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు.
టెల్‌ తన కొడుకు దగ్గరకు పరుగెత్తు కెళ్లాడు. ఎత్తుకుని ముద్దాడాడు. నెమ్మదిగా నడిపించి పిల్లవాణ్ణి గుర్రం వద్దకు తీసుకు వచ్చాడు.    
అప్పుడా దుర్మార్గ సైనిక నియంత ''సరే! ఒక్క బాణంతో ఏపిల్‌ను కొట్టగలగిన నీవు రెండు బాణాలెందుకు తీసుకున్నావు'' అని అడిగాడు.
''ఒక బాణం గురి తప్పి బాబుకు చిన్న దెబ్బ తగిలినా రెండో బాణం నీ గుండెల్లోకి దూసుకుపోయేది'' అని సమాధానం చెప్పాడు.
''పట్టుకోండి. . . . పట్టుకోండి'' అని కేకలు వినబడిన మరుక్షణం కొడుకును తీసుకుని గుర్రం ఎక్కి మాయమయ్యాడు విలియం టెల్‌.  (తరవాత స్విట్జర్లెండుకు స్వాతంత్య్రం వచ్చింది)

జాబిల్లి రావే...

ప్రయోగం
రవి:    సార్‌! మీరు దేన్నీగురించి ప్రయోగం చేస్తున్నారు.
సైంటిస్ట్‌: ఏ వస్తువుపైన పోసినా వెంటనే ఆ వస్తువు కరిగిపోయే రసాయనాన్ని గురించి బాబు!
రవి:    మరయితే ఆ రసాయనాన్ని దేనిలో నిలువ చేస్తారు.......?

 జాబిల్లి రావే...
ఏడుస్తున్న పాపకు తల్లి జోలపాట పాడుతుంది.
''చందమామ రావే
జాబిల్లి రావే....''
పాఠాలు చదువుతూ పెద్దపాప ఆ పాటవిని 'చంద్రుడెలా వస్తాడమ్మా! ఆయనెప్పుడూ భూమిచుట్టూ తిరుగుతాడు కదా!

--- కలలెలా వస్తాయి
పాప:    అమ్మా! నువ్వు రోజూ తలుపుకు గడియ వేస్తావా?
అమ్మ: అవును ఏం.....?
పాప: అలావేస్తే నాకు కలలెలా వస్తాయి.

చరిత్ర
వేణు: చరిత్రలో నాకు అరవై మార్కు లొచ్చాయి తాతయ్య
తాత:    హు! మారోజుల్లో అయితే తొంభై మార్కులొచ్చేవి.
వేణు:    అప్పట్లో చరిత్ర తక్కువగా ఉండేది మరి.

మీ అన్నయ్యేడి?
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన వేణుతో-
టీచర్‌: వేణూ! ఆలస్యమెందుకయింది;
వేణు:    వర్షం వచ్చింది కదూ! రోడ్డుపైన ఉండే కుండీలలో పడతానేమోనని మా అన్నయ్య తీసుకొచ్చాడు.
టీచర్‌:    ఇంతకీ మీ అన్నయ్యేడి?
వేణు:    కుండీలో పడిపోయాడు.

మనమంతా ఏమౌతామో?
విచారంగా స్కూలు మెట్లపై కూర్చున్న సురేష్‌ను చూసి
అశోక్‌:    ఏమిట్రా అలా బాధగా కూర్చున్నావ్‌
సురేష్‌:    ఇంకో 6 మిలియన్‌ సంవత్పరాలకు భూమి నశించి పోతుందని టీచర్‌ చెప్పింది కదా! మనమంతా ఏమౌతామో అని!

చిన్న మీటింగ్‌
కొడుకు: నాన్నా! మనమిప్పుడు చిన్న మీటింగ్‌కు వెళ్తున్నాం....?
తండ్రి: చిన్న మీటింగేమిట్రా....?
కొడుకు:మా టీచర్‌-నీవు-నేను, మన ముగ్గురి మీటింగే
తండ్రి: అదేం మీటింగ్‌రా?
కొడుకు: మరేమో- నిన్ననే మాకు రిపోర్టులు ఇచ్చారు కదా!

తేనెగుడ్లు

కాంచీపురంలో 'భుజంగం' అనే తెలివైన దొంగ ఉండేవాడు. అతను తెలివిని ఉపయోగించి యుక్తిగా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు భుజంగం దొంగతనానికి బయలు దేరాడు. ఆ ఊరిలోని షావుకారు ఇంటి వెనుకకు వెళ్ళి మెల్లిగా గోడ దూకాడు. ఒక్కసారిగా మంచి మిఠాయిల వాసన వచ్చింది. సహజంగా భోజన ప్రియుడైన భుజంగానికి, నగలూ, డబ్బూ బదులు మిఠాయిలు దొంగిలించాలనే కోరిక కలిగింది. ఇంటి వెనక గుమ్మంలోంచి లోపలికి వెళ్ళాడు. లోపల వంటవాడు లడ్డూలు చేస్తున్నాడు. భుజంగానికి వెంటనే ఓ ఉపాయం తట్టింది. వంటవాడి దగ్గరకొచ్చి-
''మీకు పనిలో సాయపడమని షావుకారు నన్ను పంపించాడయ్యా'' అన్నాడు వినయంగా. షావుకారు తనకు సహాయంగా ఒక మనిషిని పంపినందుకు సంతోషిస్తూ వంటవాడు-
''చూడు! లడ్డూలన్నీ ఈ బుట్టలో వెయ్యి! అలాగే పొయ్యిలో బూడిదని ఈ బుట్టలో వేసి బయట పారేసిరా!'' అంటూ రెండు బుట్టల్నీ అక్కడ పెట్టి బయటికి వెళ్ళాడు. భుజంగం 'ఇదే మంచి సమయం' అనుకుని, లడ్డూలన్నీ ఓ బుట్టలో పేర్చి, వాటిపైన కాగితం పెట్టి, కాగితం పైన కాస్త బూడిదను పోశాడు. అదే విధంగా ఇంకో బుట్టనిండా బూడిద నింపి, పైన కొన్ని లడ్డూలు పేర్చాడు. ఇప్పుడు లడ్డూలున్న బుట్ట బూడిద బుట్టలా, బూడిదబుట్ట లడ్డూలున్న బుట్టలా కన్పిస్తోంది. అటూ ఇటూ చూసి వంటవాణ్ణి పిలిచి-
''మర్చిపోయా! షావుకారు ఓ తేనెసీసా ఇమ్మన్నాడు. వెళ్తూ షావుకారుకు ఇచ్చి వెళ్తా'' అన్నాడు.
వంటవాడు ఇచ్చిన తేనెసీసాను బట్టపై పెట్టుకుని, బుట్టను ఎత్తుకుని బయటికి బయలుదేరాడు.
భుజంగం చేసేదంతా 'మధు' అనే కుర్రాడు చూడనే చూశాడు. మధు మెల్లిగా భుజంగం వెనకే బయలుదేరాడు. కొద్దిదూరం వెళ్ళిన తర్వాత-
''బాబుగారు! నేను ఆ బుట్టను మోస్తాను. ఓ రూపాయి ఇప్పించండి. పొద్దుటి నుంచీ ఏమీ తిన్లేదు'' అన్నాడు దీనంగా ముఖంపెట్టి. భుజంగానికి జాలికలిగి 'సరే' అంటూ బుట్టను మధు తలపై పెట్టాడు. ఇద్దరూ ఒకరిపక్క ఒకరు నడవసాగారు.
'బుట్టలో ఏమున్నాయండి?' మధు అడిగాడు.
'తేనెగుడ్లు' సమాధాన మిచ్చాడు భుజంగం.
'తేనెగుడ్లా!' ఆవేంటిబాబూ! అన్నాడు తెలియనట్లు ముఖంపెట్టి.
'వెధవా! తేనెగుడ్లు అంటే తెలీదా! ఆగుడ్లు పిల్లలవుతాయి' అన్నాడు చికాకుగా.
'మరి సీసాలో ఏముందండి?' మళ్ళీ ప్రశ్నించాడు.
'విషం' అన్నాడు కోపంగా.
మధు మౌనంగా కొద్దిదూరం నడిచి హఠాత్తుగా పరుగెత్తడం మొదలెట్టాడు. అది చూసి భుజంగం-
''ఒరేయ్‌! పారిపోవాలని ప్రయత్నిస్తే ఏంచేస్తానో చూడు' అని అరిచాడు.
మధు పరుగెడుతూ వెనక్కి తిరిగి
''నేను టీకొట్టు దగ్గరుంటా. మీరక్కడికిరండి అన్నాడు.

''అక్కడే ఆగకపోయావో నాచేతిలో చచ్చావన్నమాటే జాగ్రత్త'' అన్నాడు భుజంగం.
మధు తొందర తొందరగా పరుగెత్తి రోడ్డు పక్కనే ఉన్న చెట్ల గుబుర్లోకి వెళ్ళి, కాగితంపైన ఉన్న బూడిదను కింద పారబోసి లడ్డూలన్నీ కాగితంపైన వేశాడు. తేనె సీసాను మాత్రం ఖాళీ బుట్టలో పెట్టుకుని టీకొట్టు దగ్గరికి వచ్చి బుట్ట నేలపై పెట్టి ఏడవటం మొదలెట్టాడు. అదిచూసి అందరూ గుమికూడారు. మధు ఏడుస్తూనే-
''బుట్టలో తేనెగుడ్లు ఉండేవి. అవి ఒక్కొక్కటి తేనెటీగలై ఎగిరిపోయాయి. మా అయ్యగారికి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు.'' అన్నాడు.
''వీడికేమైనా పిచ్చిపట్టిందా? తేనెగుడ్లు ఉండటమేంటి?'' అన్నారు అందరు. కొద్ది సేపటికి భుజంగం అక్కడికి రానే వచ్చాడు. భుజంగాన్ని చూసి మధు ఇంకా గట్టిగా ఏడుస్తూ - 'అయ్యగారూ! ఈ బుట్టలో తేనెగుడ్లు ఉన్నాయని చెప్పారా లేదా?'' అన్నాడు. ''అవును  చెప్పాను'' అన్నాడు భుజంగం.
    ''నేను ఆ గుడ్లు పట్టుకుని వస్తుంటే అవి అన్నీ తేనెటీగలై ఎగిరిపోయాయి'' అన్నాడు.
    భుజంగం మధు తెలివికి ఆశ్చర్యపోయాడు. బుట్టలో తేనెసీసా మాత్రం ఉంది. అదైనా మిగిలింది కదా అనుకుని సీసా తీసుకునేందుకు భుజంగం ముందుకు వంగాడు. అదే క్షణంలో మధు ఆ సీసా అందుకుని-''ఇంటికెళ్ళిన తర్వాత మీరు నన్ను ఎలాగూ చావబాదుతారు. అక్కడ చచ్చే బదులు ఈ విషం తాగి ఇక్కడే చస్తాను'' అంటూ సీసా లోని తేనె అంతా గడగడా తాగేశాడు. అది చూసి భుజంగానికి ఒక్కసారిగా తల తిరిగి పోయింది.

నెత్తిమీద మేకు కొట్టడం

పూర్వం ఒక హరిదాసు నవాబు దర్శనం చేసుకుని, రసవత్తరంగా హరికథ చెప్పి నవాబును మెప్పించాడు. నవాబు వెంటనే హరిదాసు వంటినిండా మల్లెమాలలు చుట్టి ఏనుగుపై ఊరేగించి వెయ్యి వరహాలు బహుమానం ఇవ్వమని ఆజ్ఞాపించాడు. భటులు దాసును పక్క గది లోకి తీసుకువెళ్ళి మల్లెమాలలు వంటినిండా చుట్టారు. కాని దాసుకు బట్టతల ఉండటం వలన  తలమీద మల్లెమాలలు జారి పోయాయి. భటులు రాజు వద్దకు వచ్చి ప్రభువు చెప్పినట్లు చేయలేకపోతున్నామని కారణం వివరించారు. తన మాటకు ఎదురు ఉండటం నవాబు సహించలేకపోయాడు. ''జారి పోతున్నాయి అనే సాకుతో బట్టతల మీద మల్లెమాలలు చుట్టడం మానేస్తారా? దాసుగారి గుండు మీద మేకులు కొట్టి మాలలు చుట్ట బెట్టండి.'' అని కోపంగా అన్నాడు. ఈ మాటలు విన్న దాసుగారు కిటికీలో నుంచి దూకి పారిపోయాడు. తల మీద మేకు కొట్టించుకోవడం అంటే ఎంతటి ధైర్యవంతుడికైనా సాధ్యమయ్యే పనికాదు. నేను చెప్పే గమ్మత్తు అచ్చంగా ఇటువంటిదికాదు.
తలమీద 10 సెం.మీ. మందం కలిగిన దేవదారు కర్రముక్క ఉంచి, ఆ కర్రలోకి 8 సెం.మీ. పొడవు ఉన్న మేకును సుత్తితో కొట్టి దిగగొట్టాలి. అమ్మో! ఆ అదురుకి బుర్ర ఉంటుందా అసలు? బుర్రకు అదురు తగల కుండా కర్ర దిమ్మలోకి మేకును దిగ్గొట్టే సులభ పద్ధతి ఒకటి ఉంది.
చాలా లావుగా ఉన్న గ్రంథాలు మూడు నాలుగు తెచ్చి తలమీద దొంతరగా పెట్టి, వాటి మీద కర్ర దిమ్మ పెట్టి అప్పుడు ఆ కర్రలోకి మేకు కొడితే అతి సులభంగా తలకి అదురు తగలకుండా పని జరిగిపోతుంది. దీనికి కారణం ఏమిటో తెలుసా?
వస్తువులన్నింటికీ ఒక విధమైన 'జడత్వం' ఉంది. అది ఎటువంటిదంటే స్థిరంగా ఉన్న వస్తువు కదలదు. అంతేకాదు. కదులుతున్న వస్తువు ఆగదు. ఈ సంగతి మొట్టమొదటిసారిగా ఐజాక్‌ న్యూటన్‌ ఊహించి తన గతిశాస్త్ర సూత్రాలలో ఒకటిగా పేర్కొన్నాడు. వస్తువు బరువు ఎక్కువైన కొద్దీ ఈ జడత్వం కూడా ఎక్కువ అవుతుంది. లావుపాటి పుస్తకాలకున్న జడత్వం వల్ల సుత్తి దెబ్బ మేకు మీద పడినపుడు మేకు కదులుతుందే గాని కింద ఉన్న పుస్తకాలు అంతగా కదలవు. కనుక తలకి అదురు అంతగా ఉండదు. అదీ సంగతి!

గర్వభంగం

 ఒక అడవిలో ఒక సింహం బాగా తిని చెట్టుకింద పడుకొంది. అటుగా వెళ్తున్న ఒక దోమ పడుకున్న సింహాన్ని చూసింది.
    అడవిలో జంతువులన్నీ సింహాన్ని  రాజుగా గౌరవిస్తాయి కదా! ఈ సింహం గొప్ప ఏమిటి? ఇది నా కంటే గొప్పదా? దీని గొప్ప తనమేమిటో చూస్తా?'' అనుకొంటూ సింహం చుట్టూ 'జుయ్‌' మని శబ్దం చేస్తూ తిరిగింది. దోమ చేసిన శబ్దానికి సింహానికి మెళుకువ వచ్చింది. సింహం నిద్ర చెడిపోయినందుకు దోమ సంతోషిస్తూ సింహం ముందు వాలి-
    ''మృగరాజా!మృగరాజా!! అడవిలో నీవే బలమైనదానివని అందరూ అంటుంటారు కదా! నేను నీకంటె గొప్పదానిని తెలుసా?'' అంది దోమ సగర్వంగా-
    దోమ మాటలకు సింహానికి చాలా కోపం వచ్చింది. వెంటనే అది దోమను చంపబోయింది. కానీ దోమ ఠక్కున తప్పించుకుని పైకి ఎగిరి-

    ''చూశావా! నీవు నన్ను పట్టుకోలేక పోయావు'' అంది నవ్వుతూ - సింహానికి కోపం మరీ ఎక్కువైంది. దోమ, సింహం చుట్టూ తిరుగుతూ సింహం ముక్కుపై వాలింది. సింహం తన పంజాతో ఒక్కటి కొట్టింది. దోమ 'జయ్‌' మంటూ గాలిలోకి ఎగిరింది. పంజా తన ముక్కుపైనే పడి రక్తం చిమ్మింది. ఈ విధంగా దోమ, సింహం కన్నుపై, చెవులపై వాలుతూ సింహాన్ని బాధించసాగింది. అలా గర్వంతో సింహాన్ని బాధిస్తున్న దోమ హఠాత్తుగా పక్కనే చెట్టుకి ఉన్న సాలె గూడులో చిక్కుకు పోయింది. సాలె పురుగు తన గూడులో చిక్కుకుపోయిన దోమను లటుక్కున మింగింది.

    'అన్నింటికంటే నేనే గొప్పదానిననుకొని గర్వ పడ్డాను. నాకంటే గొప్పవి కూడా ఉన్నాయని ఇప్పుడు తెలిసింది. నాగర్వమే నా చావుకు కారణమైంది'' అనుకుంటూ దోమ ప్రాణం విడిచింది.

Tuesday, June 15, 2010

Children’s Educational Academy

The world of children finds in Children’s Educational Academy an institution dedicated to the all-round development of children, by complimenting their curricular activities and making their life merrier. Parents come to see in Children’s Educational Academy an assured future for their wards and productive way of spending their spare time.
It is now widely accepted fact that schools and academics can not fully draw out a child’s talents or satisfy his or her intelligence. For that an all round training is required.

Children’s Educational Academy (CEA) is a resource centre supporting various educational institutions for holding workshops and training programmes by providing material help, information and guidance in the field of literature, Fine Arts, Games and Sports to enrich their knowledge with the developments in educational and related fields. CEA also is into spreading awareness related to Consumer Rights, Environmental Education, Right to Information and Human Rights Education. CEA strives to increase awareness and knowledge of key target groups (school children, youth, woman, local communities, and voluntary organizations etc) about various aspects of Children’s Rights.

Keeping in view the growing demand for new and dynamic children’s writing Children’s Educational Academy introduced the unique concept of publishing books and magazines in Telugu. “Bala Chelimi” a Monthly Magazine published by CEA initiates a process whereby more and more children are exposed to international trends in Literature, Science and Technology, Arts and an interest in general knowledge and Current Affairs.