Friday, November 5, 2010

జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగు

కేంద్ర ప్రభుత్వం ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలో వ్యాపార ప్రయోజనాల కోసం ఏనుగులను చంపుతున్నారు,  దీంతో వాటి సంఖ్య తగ్గుతున్ననేపథ్యంలో ఆగస్టు 31న కేంద్ర ప్రభుత్వం 12 మంది సభ్యులతో ఏనుగుల పరిరక్షణ కోసం 'ఎలిఫెంట్‌ టాస్క్‌ఫోర్స్‌'ను నియమించింది.  ఏనుగులకు ప్రత్యేక గుర్తింపును కల్పించడం ద్వారా వాటిని సంరక్షించవచ్చని కమిటీ సభ్యులు నివేదిక ఇచ్చారు. ఇటీవల జరిగిన జాతీయ వన్యప్రాణుల బోర్డు స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.   ''ఏనుగులు ఎన్నో ఏళ్లుగా మన సంస్కృతిలో భాగం. పులుల లానే వీటిని సంరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది'' అని పర్యావరణశాఖ మంత్రి జైరాం రమేష్‌ ఒక ప్రకటనలో.. పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని సవరించేందుకు కూడా కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు పార్లమెంటు శీతకాల సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.