Saturday, November 27, 2010
చందమామపై జలచక్రం
6:17 PM
Vikasa Dhatri
చంద్రునిపై పుష్కలమైన నీటి వనరులతో పాటు జలచక్రం (వాటర్‌సైకిల్) కూడా ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నీటివనరులు జల, వాయు, ఘన రూపాల్లోకి మారుతూ నీటి నిల్వలను స్థిరంగా ఉంచటాన్ని జలచక్రం అంటారని మనకు తెలుసు కదా. జీవం ఉనికికి జలచక్రం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఎల్‌క్రాస్, ఎల్‌ఆర్‌ఓ అనే రెండు ఉపగ్రహాల ద్వారా నాసా చందమామపైనా జలచక్రం కొనసాగుతున్నట్టు గుర్తించింది. ఈ రెండు ఉపగ్రహాల నుంచి దూసుకెళ్లిన రాకెట్లు చంద్రునిపై ఎన్నడూ సూర్యకాంతి పడని'కాబియస్' అనే లోయను గత ఏడాది అక్టోబర్ 9న ఢీకొన్నాయి. ఆ తాకిడివల్ల ఎగసిన 10 మైళ్ల ఎత్తు ధూళి మేఘాన్ని ఉపగ్రహాల్లోని పరికరాల ద్వారా నాసా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ధూళిమేఘంలో స్వచ్ఛమైన మంచు స్ఫటికాలు, హైడ్రోజన్‌వాయువు, అమ్మోనియా, మీథేన్ తదితర రసాయనిక సమ్మేళనాలున్నాయని గుర్తించారు. వూహించినదానికన్నా అధిక నీరు చంద్రునిపై ఉందని నాసా పేర్కొంది. చంద్రునిపైకి వెళ్లే వారికి అవసరమైన జల, ఇంధన అవసరాలు వీటి ద్వారా తీరుతాయని ముఖ్యశాస్త్రవేత్త ఆంథోనికొల్‌ప్రిట్ తెలిపారు.
