Friday, November 19, 2010

కొత్త జాతుల మలేరియా దోమలు


ఆఫ్రికాకు చెందిన భయంకరమైన రెండు జాతుల మలేరియా దోమలు జన్యుపరంగా తేడాలున్న రెండు కొత్త జాతులుగా రూపాంతరం చెందుతున్నట్లు లండన్‌ ఇంపీరియల్‌ కళాశాలకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. మలేరియాతో జరిపే పోరుపై ఈ ఆవిష్కరణ ప్రభావం చూపనుంది. ఆఫ్రికాలో మలేరియా వ్యాప్తికి కారణమైన అనోఫెలెస్‌ గాంబియా అనే దోమలపై లండన్‌ ఇంపీరియల్‌ కళాశాలకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ దోమలకు చెందిన రెండు జాతులు వాటి జన్యుపరిణామ క్రమంలో వేగంగా విడిపోతున్నట్లు కనుగొన్నారు. దీంతో ఎప్పటికప్పుడు వ్యాధి నివారణకు కొత్త ఔషధాలను కనుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ''దోమల్లో అత్యంత వేగంగా కొత్త జాతులు పుట్టుకొస్తున్నట్లు మా పరిశోధనలో తేలింది. ఓ జాతి నివారణ పద్ధతి మరో జాతి దోమలపై సమర్థంగా పనిచేయడం లేదు'' అని పరిశోధన బృందం సభ్యుడు మారియా లానిక్‌జాక్‌ తెలిపారు.