Saturday, November 27, 2010

ఒక్కరి నుంచి 2 టన్నుల కార్బన్‌డైఆక్సైడ్‌


తీసుకునే ఆహారం కారణంగా మనిషి ఏటా రెండు టన్నుల బొగ్గుపులుసు వాయువు (కార్బన్‌డై ఆక్సైడ్‌)ను విడుదల చేస్తాడని ఒక అధ్యయనంలో తేలింది. ''మనిషి తీసుకునే ఆహారం నుంచి ఏటా రెండు టన్నుల చొప్పున కార్బన్‌డై ఆక్సైడ్‌ విడుదల అవుతుంది. మనిషి నుంచి విడుదలయ్యే వాయువుల్లో దీనిది 20 శాతంగా ఉంటుంది'' అని ప్రధాన పరిశోధకుడు ఇవాన్‌ మౌజ్‌ తెలిపారు. స్పెయిన్‌కు చెందిన ఆల్మెర్‌ వర్శిటీ చేసిన పరిశోధనా ఫలితాలను 'జీవన చక్రం - అంచనాలు' అన్న అంతర్జాతీయ పత్రిక ప్రచురించింది. 

చందమామపై జలచక్రం

చంద్రునిపై పుష్కలమైన నీటి వనరులతో పాటు జలచక్రం (వాటర్‌సైకిల్‌) కూడా ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నీటివనరులు జల, వాయు, ఘన రూపాల్లోకి మారుతూ నీటి నిల్వలను స్థిరంగా ఉంచటాన్ని జలచక్రం అంటారని  మనకు తెలుసు కదా. జీవం ఉనికికి జలచక్రం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఎల్‌క్రాస్‌, ఎల్‌ఆర్‌ఓ అనే రెండు ఉపగ్రహాల ద్వారా నాసా  చందమామపైనా జలచక్రం కొనసాగుతున్నట్టు గుర్తించింది. ఈ రెండు ఉపగ్రహాల నుంచి దూసుకెళ్లిన రాకెట్లు చంద్రునిపై ఎన్నడూ సూర్యకాంతి పడని'కాబియస్‌' అనే లోయను గత ఏడాది అక్టోబర్‌ 9న ఢీకొన్నాయి. ఆ తాకిడివల్ల ఎగసిన 10 మైళ్ల ఎత్తు ధూళి మేఘాన్ని ఉపగ్రహాల్లోని పరికరాల ద్వారా నాసా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ధూళిమేఘంలో స్వచ్ఛమైన మంచు స్ఫటికాలు, హైడ్రోజన్‌వాయువు, అమ్మోనియా, మీథేన్‌ తదితర రసాయనిక సమ్మేళనాలున్నాయని గుర్తించారు. వూహించినదానికన్నా అధిక నీరు చంద్రునిపై ఉందని నాసా పేర్కొంది. చంద్రునిపైకి వెళ్లే వారికి అవసరమైన జల, ఇంధన అవసరాలు వీటి ద్వారా తీరుతాయని ముఖ్యశాస్త్రవేత్త ఆంథోనికొల్‌ప్రిట్‌ తెలిపారు.

Friday, November 19, 2010

కొత్త జాతుల మలేరియా దోమలు


ఆఫ్రికాకు చెందిన భయంకరమైన రెండు జాతుల మలేరియా దోమలు జన్యుపరంగా తేడాలున్న రెండు కొత్త జాతులుగా రూపాంతరం చెందుతున్నట్లు లండన్‌ ఇంపీరియల్‌ కళాశాలకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. మలేరియాతో జరిపే పోరుపై ఈ ఆవిష్కరణ ప్రభావం చూపనుంది. ఆఫ్రికాలో మలేరియా వ్యాప్తికి కారణమైన అనోఫెలెస్‌ గాంబియా అనే దోమలపై లండన్‌ ఇంపీరియల్‌ కళాశాలకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ దోమలకు చెందిన రెండు జాతులు వాటి జన్యుపరిణామ క్రమంలో వేగంగా విడిపోతున్నట్లు కనుగొన్నారు. దీంతో ఎప్పటికప్పుడు వ్యాధి నివారణకు కొత్త ఔషధాలను కనుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ''దోమల్లో అత్యంత వేగంగా కొత్త జాతులు పుట్టుకొస్తున్నట్లు మా పరిశోధనలో తేలింది. ఓ జాతి నివారణ పద్ధతి మరో జాతి దోమలపై సమర్థంగా పనిచేయడం లేదు'' అని పరిశోధన బృందం సభ్యుడు మారియా లానిక్‌జాక్‌ తెలిపారు. 

చర్మకణాల నుంచి రక్తం తయారీ


రక్తమార్పిడి తప్పనిసరైన లుకేమియా తదితర వ్యాధుల చికిత్సలో ఉపయోగపడే  ఓ సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. మెక్‌మాస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మూలకణ, క్యాన్సర్‌ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త మిక్‌భాటియా సారథ్యం లో ఈ విజయం సాధించారు.  ఈ విధానం బాగా ప్రాచుర్యంలోకి వస్తే శస్త్రచికిత్సలు, ఇతరత్రా రక్తమార్పిడి అవసరమైన సందర్భాల్లో ఎవరి రక్తాన్ని  వారే ఉపయోగించుకుని స్వస్థత పొందవచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ విధానంలో సేకరించిన మానవ చర్మకణాలను నేరుగా రక్తంగా రూపాంతరం చెందిస్తారు. ఇది మూలకణాల ద్వారా రక్తం తయారీ ప్రక్రియ కంటే సులువైన విధానమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే, కేవలం యౌవన ప్రాయంలో ఉన్న వ్యక్తులనుంచి సేకరించే చర్మకణాలు మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు.

Friday, November 5, 2010

డ్రైవర్‌ అక్కర్లేని కారు

డ్రైవర్‌ అక్కర్లేని కారు తయారీలో గూగుల్‌ నిమగ్నమైంది. అంతర్జాల దిగ్గజం గూగుల్‌  ఇంటర్ నెట్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి తెలుసు. డ్రైవర్‌ అవసరం లేకుండా తనంతట తానే సొంతంగా నడిచే కారును రూపొందించే పనిలో  గూగుల్‌  ఇపుడు నిమగ్నమైంది. గూగుల్‌ ప్రయోగాత్మకంగా రూపొందించిన 7 కార్లు మానవ ప్రమేయం లేకుండానే 1000 మైళ్లు ప్రయాణించినట్లు 'న్యూయార్క్‌ టైమ్స్‌' పత్రిక వెల్లడించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో నడిచే ఈ కారు తనకి సమీపంలో ఏమున్నా గ్రహిస్తుంది. దానికి అనుగుణంగా స్వయంగా నిర్ణయం తీసుకొంటుంది.

తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు

  
    * 1 తంగేడు పూచినట్లు
    * 2 తంటల మారి గుఱ్ఱముకు తాటిపట్టె గొరపం
    * 3 తండ్రి త్రవ్విన నుయ్యి అని అందులో పడి చావవచ్చునా
    * 4 తోచీ తోయనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు
    * 5 తంబళి తన లొటలొటే గాని, యెదటి లొటలొట యెరగడు
    * 6 తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలము రమ్మంటే వచ్చునా
    * 7 తగినట్టే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ
    * 8 తగిలిన కాలే తగులుతుంది
    * 9 తగు దాసరికీ మెడ పూసలకూ, అమ్మకన్న కాన్పుకూ అయ్య ఇచ్చిన మనుముకూ
    * 10 తడక లేని ఇంట్లో కుక్క దూరినట్లు
    * 11 తడిగుడ్డలతో గొంతులు తెగకోస్తాడు
    * 12 తడిశిగాని గుడిశె కట్టడు, తాకిగానీ మొగ్గడు
    * 13 తడిశిన కుక్కి బిగిశినట్టు
    * 14 తడిశి ముప్పందుం మోశినట్టు
    * 15 తణుకుకు పోయి మాచవరం వెళ్ళినట్లు
    * 16 తద్దినము కొని తెచ్చుకొన్నట్టు
    * 17 తనకంపు తనకింపు, పరులకంపు తనకు వొకిలింపు
    * 18 తన కలిమి ఇంద్రబోగము, తనలేమి లోకదారిద్ర్యము
    * 19 తన కాళ్లకు బంధాలు తానే తెచ్చుకొన్నట్టు
    * 20 తనకు అని తవ్వెడు తవుడు వుంటే, ఆకటి వేళకు ఆరగించవచ్చును
    * 21 తనకు కానిది గూడులంజ
    * 22 తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట
    * 23 తడి గుడ్డతో గొంతులు కొయ్యడం
    * 24 తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట
    * 25 తంతే బూరెల బుట్టలో పడ్డట్టు
    * 26 తనది కాకపోతే కాశీదాకా దేకమన్నాడట
    * 27 తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా
    * 28 తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే
    * 29 తల లేదు కానీ చేతులున్నాయి... కాళ్లు లేవు కానీ కాయం ఉంది?
    * 30 తల ప్రాణం తోకకి వచ్చినట్లు
    * 31 తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు
    * 32 తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
    * 33 తవుడు తింటూ వయ్యారమా?
    * 34 తాగిన మందు ఉంచుకొన్నదాని పొందు ఎలాంటి పనైనా చేయిస్తుంది
    * 35 తాను వలచినది రంభ, తాను మునిగింది గంగ
    * 36 తా(ను) పట్టిన కుందేటికి మూడే కాళ్లు
    * 37 తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడట
    * 38 తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
    * 39 తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది
    * 40 తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు
    * 41 తాడిచెట్టెందుకెక్కావంటే, దూడ గడ్డికోసమన్నాడంట
    * 42 తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారు
    * 43 తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు
    * 44 తాతకు దగ్గులు నేర్పినట్టు
    * 45 తాదూర సందు లేదు, మెడకో డోలు
    * 46 తానా అంటే తందానా అన్నట్లు
    * 47 తామరాకు మీద నీటిబొట్టులా
    * 48 తాను దూర సందు లేదు తలకో కిరీటమట
    * 49 తిని కూర్ఛుంటే కొండలైనా కరుగుతాయి
    * 50 తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి
    * 51 తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు
    * 52 తిండికి ముందు,తగాదాకు వెనుక ఉండాలి
    * 53 తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట
    * 54 తిట్టను పోరా గాడిదా అన్నట్టు
    * 55 తిట్టే నోరు, తిరిగే కాలు , చేసే చెయ్యి ఊరకుండవు
    * 56 తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట
    * 57 తినగ తినగ వేము తియ్యగనుండు
    * 58 తినబోతూ రుచులు అడిగినట్లు
    * 59 తిన్నింటి వాసాలు లెక్కేయటం
    * 60 తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి?
    * 61 తీగ లాగితే డొంకంతా కదిలినట్లు
    * 62 తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి
    * 63 తూట్లు పూడ్చి... తూములు తెరిచినట్లు...
    * 64 తెలిసే వరకూ బ్రహ్మవిద్య తెలిశాక కూసువిద్య
    * 65 తేలు కుట్టిన దొంగలా

జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగు

కేంద్ర ప్రభుత్వం ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలో వ్యాపార ప్రయోజనాల కోసం ఏనుగులను చంపుతున్నారు,  దీంతో వాటి సంఖ్య తగ్గుతున్ననేపథ్యంలో ఆగస్టు 31న కేంద్ర ప్రభుత్వం 12 మంది సభ్యులతో ఏనుగుల పరిరక్షణ కోసం 'ఎలిఫెంట్‌ టాస్క్‌ఫోర్స్‌'ను నియమించింది.  ఏనుగులకు ప్రత్యేక గుర్తింపును కల్పించడం ద్వారా వాటిని సంరక్షించవచ్చని కమిటీ సభ్యులు నివేదిక ఇచ్చారు. ఇటీవల జరిగిన జాతీయ వన్యప్రాణుల బోర్డు స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.   ''ఏనుగులు ఎన్నో ఏళ్లుగా మన సంస్కృతిలో భాగం. పులుల లానే వీటిని సంరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది'' అని పర్యావరణశాఖ మంత్రి జైరాం రమేష్‌ ఒక ప్రకటనలో.. పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని సవరించేందుకు కూడా కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు పార్లమెంటు శీతకాల సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

కొత్త గ్రహవ్యవస్థను గుర్తించిన కెప్లర్‌


కెప్లర్‌ టెలిస్కోప్‌ సుదూరాన ఉన్న ఒక గ్రహవ్యవస్థను నాసా శాస్త్రవేత్తలకు పరిచయం చేసింది. రోదసిలో భూమివంటి గ్రహాలేమైనా ఉన్నాయా అన్న దానిపై కెప్లర్‌ టెలిస్కోప్‌ అన్వేషణ జరుపుతుంది.  సూర్యునిలాగే ఉన్న ఒక నక్షత్రం చుట్టూ శని గ్రహం పరిమాణంలో ఉన్న రెండు గ్రహాలు పరిభ్రమిస్తున్నాయని పరిశోధనలో తెలిసింది. భూమి సైజుకు కొద్దిగా పెద్దగా ఉన్న మరొక గ్రహం కూడా నక్షత్రానికి కొంత సమీపంలో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అది గ్రహమా కాదా అన్న విషయాన్ని నిర్థారించవల్సి ఉంది. అది గ్రహమే అయితే దానిపై జీవం ఉనికి ఉండే అవకాశాలు లేకపోలేదన్నారు. నాసా గత ఏడాది అంతరిక్షంలోకి ప్రయోగించిన కెప్లర్‌ టెలిస్కోపు ప్రత్యేకంగా భూమి వంటి గ్రహాలనే గుర్తిస్తుంది. నక్షత్రానికి మరీ దగ్గరగా, మరీ దూరంగా ఉండకుండా మధ్యస్థంగా ఉండే భూమివంటి గ్రహాల్లోనే జీవం ఉనికిలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తరహా గ్రహాల కోసం శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.

Thursday, November 4, 2010

చంద్రుడిపైకి రోబో

చంద్రుడిపైకి రోబో
లండన్‌: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా శాస్త్రవేత్తలు చంద్రుడిపైకి మరమనిషిని పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో వెయ్యి రోజుల్లో ఈ లక్ష్యాన్ని సాధించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుడిపై రోబో నడిచే మహత్తర సందర్భం కొత్త తరం శాస్త్రవేత్తలకు ఉత్తేజాన్నిస్తుందని వారు ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ఆసక్తి లేకపోవడంతో శాస్త్రవేత్తలే స్వయంగా పూనుకుని విచక్షణ నిధుల్ని వాడటమే కాకుండా, ఇంజినీరింగ్‌ కంపెనీల సాయాన్ని తీసుకున్నారు. హ్యూస్టన్‌లోని జాన్సన్‌ అంతరిక్ష కేంద్రం ముఖ్య ఇంజినీర్‌ స్టీఫెన్‌ ఆల్టెమస్‌ ప్రత్యేక ఆసక్తితో ఈ ప్రాజెక్టు పట్టాలకెక్కింది. తోటి శాస్త్రవేత్తలను పోగేసి నిధుల కొరత సమస్యను వివరించి, వీలైనంత వేగంగా దీనిని పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు సాగిస్తున్నారు.

రోదసిలో వాతావరణ మార్పులు

రోదసిలో వాతావరణ మార్పులు
లండన్‌: వాతావరణ మార్పులు భూమ్మీదే కాదు.. అంతరిక్షంలోనూ ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. విశ్వ ఆవిర్భావానికి కారణమని భావిస్తున్న మహావిస్ఫోటనం (బిగ్‌బ్యాంగ్‌) తర్వాత కాలంలో అంతరిక్ష వాతావరణంలోని ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు సంభవించాయని చెబుతున్నారు. బిగ్‌బ్యాంగ్‌ అనంతరం 100 కోట్ల ఏళ్ల తర్వాత రోదసిలోని వాయువుల ఉష్ణోగ్రత ఎనిమిదివేల డిగ్రీల సెల్సియస్‌ ఉండేదని, 350 కోట్ల ఏళ్ల తర్వాత ఇది 12వేల డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిందని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుర్తించారు. మహావిస్ఫోటనం తర్వాత అనేక కొత్త నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని.. వాటికి కేంద్రంగా ఉండే క్వాజర్లనే కృష్ణబిలాల నుంచి అతినీలలోహిత కిరణాలు పెద్ద ఎత్తున విడుదల కావటం వల్లనే ఉష్ణోగ్రతలు పెరిగి ఉంటాయని ముఖ్య శాస్త్రవేత్త జార్జ్‌బెకర్‌ తెలిపారు.

Monday, November 1, 2010

ప్రయోగశాలలో మానవ కాలేయం

ప్రయోగశాలలో మానవ కాలేయం అభివృద్ధి
లండన్‌: ప్రయోగశాలలో మానవ కాలేయాన్ని శాస్త్రవేత్తలు దిగ్విజయంగా అభివృద్ధి చేశారు. రోగులకు అనుగుణంగా ప్రత్యేక అవయవాలను రూపొందించడానికి ఈ ప్రయోగం వల్ల మార్గం సుగమం అవుతుందని తెలిపారు. అమెరికాలోని వేక్‌ ఫారెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. వీరు అక్రోటు కాయ పరిమాణంలో ఉండే కాలేయాన్ని తయారుచేశారు.

కీలక ప్రోటీను

కీలక ప్రోటీను పనితీరును గుర్తించిన శాస్త్రవేత్తలు
లండన్‌: మానవ రోగ నిరోధక వ్యవస్థలో వజ్రాయుధంలా పనిచేసే ఒక కీలక ప్రోటీన్‌ పనితీరును శాస్త్రవేత్తలు తొలిసారిగా గమనించారు. పెర్ఫోరిన్‌ అనే ఈ ప్రోటీన్‌ శత్రు కణాలను హతమారుస్తుంది. అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపులను ఉపయోగించడంద్వారా అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ ఘనత సాధించింది. వైరస్‌ల దాడికి గురైన కణాల్లో రంధ్రాలు పెట్టడంద్వారా ఇవి వాటిని హతమారుస్తాయి.