Saturday, April 9, 2011

జంతువుల బడి


ప్రపంచం వేగంగా మారిపోతోంది. మారే ప్రపంచంతో పాటే మనమూ మారాలి. అడవిలో జంతువులన్నీ ఒకసారి ఇలానే అనుకొన్నాయి. అలా అనుకొని ఒక బడి పెట్టాలని నిర్ణయించాయి.
పరిగెత్తటం, ఎగరటం, ఈదటం,  పాకటం - ఇలాంటివన్నీ జంతువులకు అవసరమని నిపుణులైన జంతువులు తేల్చి చెప్పాయి. వీటిని నేర్పేందుకు పాఠ్య పుస్తకాలు కూడా సిద్ధమయ్యాయి. ఈ విషయాలన్నిటినీ అన్ని జంతువులూ తప్పని సరిగా నేర్చుకోవాలి. ఉత్తీర్ణులవ్వాలి. ఇక బడి మొదలయ్యింది.
బాతు ఈదటంలో సిద్ధహస్తురాలు. నిజం చెప్పాలంటే, ఉపాధ్యాయురాలి కన్నా మిన్నగా ఈదేది. కానీ పరుగు పెట్టటంలో మాత్రం అందరి కంటే ఎంతో వెనుకపడింది. దాంతో బడి అయిపోయిన తర్వాత కూడా పరుగుల తరగతిలో ప్రాక్టీసు చేస్తూ ఉండాల్సి వచ్చింది. రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈతకు వెళ్లటం కూడా మానేసి, పరుగుకే ఆ సమయాన్ని కూడా వెచ్చించటం మొదలు పెట్టింది. పరుగు పెట్టీ పెట్టీ, తెడ్ల లాంటి బాతు పాదాలు చీలి పోయాయి. కాళ్లు వాచి పోయాయి. ఇపుడు ఈతలో కూడా బాతు వెనుకబడింది.
ఇక కుందేలుకు కూడా ఇటువంటి కష్టమే వచ్చి పడింది. పరుగుల రాణికి ఈత అంటే వణుకు పుట్టుకొచ్చేది. ఈతలో వెనుకబడిన వారి కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక తరగతులకు కుందేలు హాజరవుతోంది ఇపుడు.
ఉడుత చెట్లు ఎక్కటంలో నేర్పరే కానీ నేరుగా పక్షిలా ఎగరటం మాత్రం దానికి వల్ల కాలేదు. కొమ్మ మీద నుంచి కొమ్మకు దూకటం కాకుండా నేరుగా నేల మీద నుంచి పైకి ఎగరాలని ఉపాధ్యాయురాలు చెప్పింది. అలా నేర్చుకోవటం ఉడుతకు కుదరటం లేదు. చివరికి పరీక్షల్లో తప్పి కూర్చుంది ఉడుత.
ఇక ఇది ఇలా జరుగుతూ ఉండగా, ఎలుకల్లో అలజడి మొదలయింది. పాఠాల్లో ఎక్కడా బొరియలు తవ్వటాన్ని గురించి నేర్పక పోవటం అన్యాయమని అవి ఆందోళనకు దిగాయి. వాటికి పందికొక్కులు తోడయ్యాయి. ఇక ఈ బడిలో ఈ చదువులు తాము చదవలేమని అవి నిర్ణయించేశాయి. ప్రత్యామ్నాయ విద్య పేరుతో మరొక పాఠశాలను తెరిచాయి. ఇపుడు ఆ బడిలో కేవలం 'బొరియలు తవ్వటం' మాత్రమే నేర్పుతున్నారు.

కుక్క - దొంగ


ఒక దొంగ అర్ధరాత్రి వేళ దొంగతనానికి బయలు దేరాడు. అతడు మెల్లిమెల్లిగా ఒక ఇంటి గోడదూకి ముందుకు అడుగు వేశాడు. దొంగ అడుగుల చప్పుడు ఆ ఇంటిని కాపలా కాస్తున్న కుక్క పసి గట్టింది. అంతే .... మొరగడం మొదలెట్టింది.  గొలుసుతో కట్టేసి ఉండటం వల్ల కుక్క దొంగను కరవలేదు. 'హమ్మయ్య ఇంకా నయం. ఇది గొలుసుతో కట్టి ఉంది. ఇది ఇలాగే మొరిగితే నేను పట్టుపడటం ఖాయం. ముందు దీన్ని మొరగకుండా చెయ్యాలి.'' అనుకుని సంచీలో నుంచి ఒక రొట్టెముక్క తీసి కుక్క దగ్గర పెట్టాడు. కాని కుక్క దానిని ముట్టుకోలేదు. మళ్ళీ మొరగడం ప్రారంభించింది. దొంగ దానిని బుజ్జగించేందుకు దాని దగ్గరికి వచ్చాడు. అంతే కుక్క దొంగ కాలుని కరిచింది. దొంగకు విపరీతమైన కోపం వచ్చింది.
''నన్నెందుకు కరిచావ్‌ నీకు  ఒక రొట్టె ముక్క కూడా ఇచ్చాను కదా?'' అన్నాడు.
వెంటనే కుక్క ''నేను నిన్ను ఎందుకు కరిచానంటే - నువ్వు నాకు రొట్టెముక్క ఇవ్వకముందు నువ్వు మంచి వాడివో, చెడ్డవాడివో నాకు తెలి యదు. కాని ఇప్పుడు తెలుసుకున్నాను. నువ్వు చెడ్డవాడివనీ, నాకు రొట్టెముక్క ఇచ్చి నన్ను ఏమార్చాలని చూస్తున్నావనీ, అందుకే నిన్ను కరిచాను'' అంది కుక్క.
(లియో టాల్‌ స్టాయ్‌ కథ ఆధారంగా)

పందుల దొడ్డి


అది ఒక అడవి. దట్టంగా ఉంది.
ఎటు చూసినా క్రూరమృగాలు.
మధ్యలో వంద ఎకరాల చదునైన భూమి.
ఆ భూమి వరాహరాజు ఆధీనంలోకి వచ్చింది.
ఆయన నివాసం అక్కడే! మధ్యలో ఒక చక్కటి ఇల్లు కట్టుకొన్నాడు. తన భూమికి చుట్టూ కంచె వేయించాడు.

వరహరాజు దగ్గర వెయ్యి పందులు ఉన్నాయి. అతని ఇల్లు కట్టిందీ. చుట్టూ కంచె వేసింది ఆ పందులే! వరాహరాజుకు గాని అతడి కుటుంబ సభ్యులకు గానీ అన్ని పనులు చేసి పెట్టేది పందులే!
పందులు పొలం దున్నుతాయి. పంటలు పండిస్తాయి. పండించిన ధాన్యాన్ని వరాహ రాజు ధాన్యాగారం లోకి చేరుస్తాయి.
పందుల బాగోగులు వరాహరాజే చూస్తాడు. వాటికి కావలసిన తవుడు, పొట్టు, గంజినీళ్ళు, ముగ్గిపోయిన ధాన్యం అందేలా చూస్తాడు. వరాహరాజు అభిమానానికి నోచుకొన్న కొన్ని పందులకు అప్పుడప్పుడూ వరి అన్నం కూడా దొరుకుతుంది.
పందులలో కూడా రకరకాల తేడాలు ఉన్నాయి. కొన్ని కష్టపడి పనిచేస్తే, మరికొన్ని సోమరిగా తిరుగుతాయి. బక్కచిక్కిన వాటి మీద అధికారం చెలాయిస్తాయి. వాటిల్లో  తేడాలు ఎలా ఉన్న వరాహరాజు విషయానికి వస్తే అన్నీ బానిసలే!
ఏ చీకూ చింతా లేని వరాహరాజుకు రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి.
ఒక రాత్రి ఒక తెలివైన పందికి నిద్ర పట్టలేదు.
మిగిలిన అన్ని పందులనూ అది నిద్ర లేపింది.
సభ చేసింది.
''మన పంది బతుకులు చాలా హీనంగా ఉన్నాయి. మన యజమాని చాలా సుఖంగా ఉన్నాడు. ఫలితం దక్కాలి. ఇందుకు మీరేమంటారు?'' అని అడిగింది.
తెలివైన పంది మాటలకు మిగిలినవన్నీ ఒప్పు కొన్నాయి. ''నిజమే! మనకు చాలా అన్యాయం జరుగుతోంది. ఏం చెయ్యమంటావో నువ్వే చెప్పు'' అన్నాయి.
''మనం వరాహరాజును, అతని కుటుంబంలోని అందరినీ చంపేద్దాం. అటు తరువాత మన మీద అధికారం చలాయించేవాళ్ళు ఎవరూ ఉండరు. అందరం కలిసి కష్టపడి పనిచేద్దాం. ఫలితం సమానంగా అనుభవిద్దాం'' అంది.
ఈ సలహా అన్ని పందులకూ నచ్చింది.
అన్నీ మూకుమ్మడిగా పైకి లేచాయి. అప్పటికప్పుడే వరాహరాజు  ఇంటిమీద దాడి చేశాయి.
వెయ్యి పందులు ఒక్కమారుగా మీద పడడంతో వరాహరాజు ఏమీ చెయ్యలేక పోయాడు. పందులు అతన్ని చీల్చి చెండాడాయి. అతని భార్య పిల్లలు కూడా పందుల దాడిలో చనిపోయారు.
పందులు స్వతంత్రం ప్రకటించుకొన్నాయి.వాటి ఆనందానికి అంతులేదు. వరుసగా వారం రోజుల పాటు విచ్చలవిడిగా గంతులు వేశాయి. ఆనందంతో  పందులు పనుల గురించి పట్టించుకోలేదు. నీళ్ళు కట్టకపోవడం వల్ల వరిమడి ఎండిపోయింది. చెరకుతోట బెండు తేలిపోయింది. కూరగాయలు వాడి రాలిపోయాయి.
ఏ పందికి ఆ పంది నేనే ఎందుకు పనిచేయాలి అని చాటుకు తప్పుకోసాగింది.
తెలివైన పంది పరిస్థితి గమనించి మళ్ళీ పందుల సభ  జరిపింది. ''మనకు నాయకుడు లేకపోవడం వల్ల ఎవరూ బాధ్యతగా పనిచేయడం లేదు. కాబట్టి మనలో ఒకరిని నాయకుడిగా ఎన్నుకొందాం'' అంది.
మిగిలిన అన్ని పందులూ అందుకు ఒప్పుకొని ''నువ్వే మా నాయకుడివి'' అన్నాయి.
తెలివైన పంది నాయకుడు అయిన తరువాత పరిస్థితి మారిపోయింది.
అన్నీ కష్టపడి పని చేయసాగాయి.
నాయక పంది అటూ ఇటూ తిరిగి అజమాయిషీ చేయసాగింది.
నెలరోజుల్లో  నాయక పంది వరాహరాజు మునుపు ఉన్న ఇంట్లోకి వెళ్ళింది.
ఆ పంది పిల్లలు, భార్య, బంధువులు అన్నీ అధికార హోదా సంపాదించుకున్నాయి.
మరికొన్ని రోజులకు పరిస్థితి మునుపటిలా తయారయింది. వరాహరాజు  కాలంలో ఎలా ఉండేదో అలాగే మారిపోయింది.
అర్ధరాత్రి పూట పందులు మళ్ళీ సభ చేశాయి. పంది నాయకుణ్ణి చంపెయ్యాలని తీర్మానించాయి.
ఒక పిల్ల పంది పైకిలేచి ''ఈ రోజు నాయకుణ్ణి చంపేస్తాం. రేపు ఇంకొకరు వస్తారు. అతనూ ఇలాగే తయారవుతాడు. మనం ఎంతకాలం ఇదే పద్ధతి కొనసాగించాలి?'' అంది.
పందులు అన్నీ ఆలోచనలో పడ్డాయి.